రాష్ట్రీయం

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ 190 టిఎంసికి చేరుకోవడం, సగటున రోజుకు 2.7 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో తెలంగాణ పరిధిలోని సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాలనే యోచనలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి కృష్ణాబోర్డు తీసుకునే నిర్ణయం కోసం వేచి ఉంది. వీలైనంత త్వరగా రెండు మూడురోజుల్లో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఇరిగేషన్ శాఖ బోర్డుకు లేఖ సంధించింది. శ్రీశైలం, సాగర్ రెండు జలాశయాల్లో 527 టిఎంసికిగాను 402 టిఎంసి (శ్రీశైలం 212, నాగార్జునసాగర్‌లో 190) నీటి లభ్యత వచ్చింది. ఇదే ప్రవాహం కొనసాగితే నాగార్జునసాగర్‌కు రెండు, మూడు రోజుల్లో 225 టిఎంసి నీటినిల్వ చేరుకునే అవకాశం ఉందని సాగునీటి ఇంజనీర్లు చెబుతున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి బోర్డు అనుమతి లేకుండా పోతిరెడ్డిపాడు, మచ్చుమర్రి ద్వారా ఆంధ్రకు నిర్దేశించిన దానికంటే, ఎక్కువ పరిమాణంలో నీటిని తరలించిందని ఇప్పటికే తెలంగాణ ఫిర్యాదు చేసిన విషయం విదితమే. దీనికి స్పందించిన కృష్ణాబోర్డు
పోతిరెడ్డిపాడు ద్వారా నీటి మళ్లింపు ఆపాలని ఆదేశించింది. ప్రస్తుతం తన పరిధిలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా ఎడమ కాల్వ కింద ఉన్న 6.25 లక్షల ఎకరాల్లో జోన్-1కు సాగునీటిని విడుదల చేస్తే బాగుంటుందని ప్రజా ప్రతినిధుల నుంచి ప్రభుత్వంపై వత్తిడి పెరిగింది. తెలంగాణ రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సాగునీటి ప్రయోజనాలకు నీటిని విడుదల చేస్తే ఎలా ఉంటుందనే యోచనపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషయమై ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఈ ఏడాదికి నీటి ప్రణాళికను కృష్ణాబోర్డు ఖరారు చేయలేదు. వాస్తవానికి నేడు మీటింగ్ నిర్వహించాల్సి ఉన్నా, ప్రతిపాదనను వాయిదా వేశారు. బోర్డు కార్యదర్శి సమీర్ చటర్జీ స్థానంలో పరమేశన్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో బోర్డు మీటింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉందంటున్నారు.
ఎడమ కాల్వ కింద జోన్-1కు 34.5 టిఎంసి, జోన్-2కు 20 టిఎంసి, ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం ఎడమకాల్వకు 10 టిఎంసి, హైదరాబాద్ నగరానికి 14.83 టిఎంసి నీరు తాగునీటి అవసరాలకు విడుదల చేయాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బోర్డును కోరింది. మొత్తం 122 టిఎంసి నీటిని విడుదల చేయాలని ఇండెంట్ పంపింది. మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కింద 25 టిఎంసి కేటాయించాలని కూడా ఇండెంట్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. ఈ నెల 6వరకు తాము 34.784 టిఎంసి నీటిని వినియోగించుకున్నామని, ఇందులో హైదరాబాద్ నీటి అవసరాలకు 5 టిఎంసి చేరి ఉందని వివరించింది. రబీ, మంచినీటి అవసరాల నిమిత్తం 122 టిఎంసి నీరు విడుదల చేయాలని తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ బోర్డును కోరారు.
శ్రీశైలంలో 885 అడుగులకు 884.4 అడుగులు నీటిమట్టం చేరింది. 212 టిఎంసి నీరు ఉంది. 2.3 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దిగువకు 2.7 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లో 590 అడుగులకు 540 అడుగులు నీటి మట్టం చేరింది. ఆంధ్ర పరిధిలోని పులిచింతల ప్రాజెక్టులో 13.47 టిఎంసి నీటి లభ్యత ఉంది. ఎగువున కర్నాటకలో ఆల్మట్టి నుంచి 45 వేల క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 60616 క్యూసెక్కులు, జూరాల నుంచి 1.28లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండడంతో, ఆంధ్రప్రభుత్వం శనివారం ఏడు గేట్లు ఎత్తి వేసింది. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్కేంద్రం నుంచి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు పెద్ద ఎత్తున విద్యదుత్పత్తి చేస్తున్నాయి. దిగువకు 2.7 లక్షల క్యూసెక్కుల నీటిని వదలడంతో, ఈ నీటి ద్వారా జల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో చౌకగా విద్యుత్ అందుబాటులోకి వచ్చింది.

చిత్రం..శ్రీశైలం ప్రాజెక్టులో పది అడుగులమేర ఏడు గేట్లు ఎత్తడంతో కిందికి పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ