రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల్లో చావు కేకలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: తెలుగు రాష్ట్రాల్లో వివిధ కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధుల ఆత్మహత్యలు ఆగడం లేదు. నెల వ్యవధిలో ఇరు రాష్ట్రాల్లో సుమారు 50మంది విద్యార్ధులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. చాలా సంఘటనలు పోలీసు స్టేషన్ల వరకూ కూడా వెళ్లడం లేదు. కార్పొరేట్ కాలేజీల్లో ఒత్తిడి కారణంగా చనిపోతున్నవారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంటే, పిల్లల తల్లిదండ్రులను బెదిరించి ప్రేమ, కుటుంబ పరిస్థితులు కారణంగానే బలవన్మరణాలకు పాల్పడుతున్నట్టు యాజమాన్యాలు రాయించుకుంటున్నాయి. కొన్ని కాలేజీల యాజమాన్యాలు తల్లిదండ్రులకు కొంత మొత్తాన్ని ముట్టజెప్పి చేతులు దులుపుకుంటున్నాయి. ఒత్తిడి, ప్రేమ, వేధింపులు, ర్యాగింగ్, కుటుంబ కారణాలురీత్యా విద్యార్థుల ఆత్మహత్యలు ఇటీవలికాలంలో బాగా పెరిగాయి. 1999-2004 మధ్య విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువ కావడంతో అప్పటి ప్రభుత్వం ప్రొఫెసర్ నీరదారెడ్డి కమిటీని నియమించింది. ఆ కమిటీ సూచనలు గాలికి వదిలేయడంతో 2005- 2011 వరకూ 1500 మంది ఆత్మహత్యకు పాల్పడగా, 2011-12 విద్యాసంవత్సరంలోనే 1300 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2013లో ఆ సంఖ్య 340కి తగ్గినా, తర్వాత కూడా ఆత్మహత్యలు ఆగలేదు. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యల సంఖ్య 100కు చేరుకోగా, గత నెలలోనే 50 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
నూజివీడు ట్రిపుల్ ఐటిలో శనివారం రమాదేవి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా, నల్గొండ కనగాల మండలం తిమ్మన గూడెంలో అనూష ఆత్మహత్యకు పాల్పడింది. నిజామాబాద్ జిల్లా రానంపల్లి విద్యార్థిని హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య విద్యాసంస్థలో నీట్ పరీక్షకు లాంగ్‌టెర్మ్ కోచింగ్ తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడింది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న దిండిగల్ సూరారం కాలనీకి చెందిన 21 ఏళ్ల వౌనికను తల్లి మందలించిందని ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్రలో విజయనగరం జిల్లా శిఖాబడి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని చీపురుపల్లి మాలతి ఆత్మహత్యకు పాల్పడింది. గత వారమే ట్రిపుల్ ఐటి నూజివీడులో 16 ఏళ్ల పూర్ణ లక్ష్మీనరసింహమూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కెపిహెచ్‌బి కాలనీలో ఉంటున్న తుంగతుర్తి ఇంజనీరింగ్ విద్యార్థి ఎం రమేష్ ఆత్మహత్యకు పాల్పడగా, కడప జిల్లా కృష్ణాపురం నారాయణ జూనియర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని పావని, సూర్యాపేటలో ఏడో తరగతి చదువుతున్న వేణు ఆత్మహత్య చేసుకున్నారు. కర్నూలు నారాయణ కాలేజీలో శ్రీకాంత్, హిందూపూర్‌లో నవీన్, చిత్తూరు జిల్లా మదనపల్లిలో సంతోష్‌కుమార్, గూడవల్లి నారాయణ క్యాంపస్‌లో ఈశ్వర్‌రెడ్డి ‘కార్పొరేట్’ దెబ్బకు ఆత్మహత్యలు చేసుకున్నారు. వనపర్తి జాగృతి జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న శివశాంతి ఆత్మహత్య చేసుకుంది. విజయవాడ నిడమనూరు శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న భార్గవరెడ్డి ఆత్మహత్య చేసుకుంది. భార్గవరెడ్డి కడప జిల్లా రాయచోటికి చెందిన అమ్మాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో చదువుతున్న ఆకాష్ గుప్త చెరువువద్ద జారిపడి మరణించాడని చెబుతున్నా ఆత్మహత్యగా విద్యార్థులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు బలవన్మరణాలు కొనుసాగుతున్నాయి. కన్నవారికి కన్నీళ్లే మిగుల్చుతున్నాయి. ఎంతో మంది విద్యార్థులు వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కార్పొరేట్ కాలేజీలు విద్యార్థుల పాలిట మృత్యుగీతికలుగా మారుతున్నాయి. విద్యార్థులను బావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన కాలేజీలు ర్యాంకులు, డొనేషన్ల వెంటపడి తీవ్ర ఒత్తిడికి నెడుతున్నాయి. ఒకటి రెండు సంఘటనలు జరగ్గానే ఆయా కాలేజీలను మూసివేయడం చట్టపరంగా జరగాల్సి ఉన్నా ఇరు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఎన్ని దారుణాలు జరుగుతున్నా, నివేదికలు, దర్యాప్తులు పేరిట చర్యలు మృగ్యమయ్యాయి. గుంటూరు, కృష్ణ, విశాఖ, తిరుపతి, హైదరాబాద్ పట్టణాల్లో ఎన్నో ఆత్మహత్యలు జరిగినా యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చదువు పేరిట కార్పొరేట్ కాలేజీలు విద్యార్థులపై వత్తిడి తీసుకురావడమేగాక, వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కాలేజీలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విద్యార్థి ఈశ్వర్‌రెడ్డి విషయంలో ఇదే జరిగింది. విద్యార్థి చనిపోయినా, ఆ విషయాన్ని తల్లిదండ్రులకు యాజమాన్యం సమాచారం ఇవ్వలేదు. దానిని గోప్యంగా ఉంచారు. వేరే గ్రామానికి చెందిన విద్యార్థులు ఫోన్ చేస్తే తప్ప ఆ విషయం వెలుగు చూడలేదు. కాగా సూర్యాపేటలో సైతం ఏడో తరగతి చదవే వేణు అనే విద్యార్థి హాస్టల్‌లో ఉండలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
పట్టించుకోని ప్రభుత్వాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ కాలేజీలకు ప్రభుత్వాల బలమైన మద్దతు ఉండటంతో ఎంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఇటు ఇంటర్ బోర్డు అధికారులు, అటు పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులు సైతం ఆత్మహత్యలపై ఇచ్చిన స్పష్టమైన మార్గదర్శకాలను అధికారులు గాలికొదిలేశారు. ఇంత వరకూ ఆత్మహత్యలకు సంబంధించి వివిధ కమిటీలను నియమించడమే తప్ప శాస్ర్తియ పరిశోధన జరగలేదు. ప్రొఫెసర్ నీరదా రెడ్డి కమిటీ నివేదిక నేటికీ అధికారికంగా వెలుగు చూడలేదు. ఆంధ్రాలో చక్రపాణి కమిటీ ఇచ్చిన నివేదిక సైతం వెలుగు చూడలేదు. అయినా ఆత్మహత్యలపై సమీక్షకు 16న అక్కడి విద్యాశాఖ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినా, అటువంటి ఆలోచన ఏదీ తెలంగాణ ప్రభుత్వం చేయలేదు.

రమాదేవి (ఫైల్ ఫొటో)