రాష్ట్రీయం

ఫాం టు ఫ్యాషన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 14: టెక్స్‌టైల్ పరిశ్రమలో ఫాం టు ఫ్యాషన్ సూత్రంతో సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని రాష్ట్ర ఐటి, చేనేత, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. విద్య, పారిశ్రామిక, ఐటి రంగాల అభివృద్ధి ద్వారా వరంగల్ మరో ఆర్థిక రాజధానిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఏర్పాటుచేస్తున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు ద్వారా 1.20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం, గీసుకొండ మండలాల పరిధిలో శాయంపేట- చింతలపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్న మెగా టెక్స్‌టైల్ పార్కు కోసం సేకరించిన భూములను మంత్రి కెటిఆర్ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా టెక్స్‌టైల్ పార్కు లోగోను మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతు దేశంలోనే అత్యంత నాణ్యమైన పత్తి తెలంగాణ రాష్ట్రంలో పండుతుందని, ఈ విషయాన్ని నేషనల్ టెక్స్‌టైల్ కార్పొరేషన్, తమిళనాడులోని సౌత్ ఇండియన్ టెక్స్‌టైల్ మిల్స్ ధృవీకరించాయని తెలిపారు. అందుకే ఇతర రాష్ట్రాలకు ఇక్కడి నుంచి పత్తి ఎగుమతి జరుగుతుందని చెప్పారు. కానీ రాష్ట్రంలో 60 లక్షల పత్తి బేళ్లు ఉత్పత్తి అవుతుండగా కేవలం 10 లక్షల బేళ్లను మాత్రమే ఉపయోగించుకోవటం ఆందోళన కలిగిస్తోందని, దీనివల్ల చేనేత కార్మికులకు రాష్ట్రంలో సరైన అవకాశాలు లేక భివాండీ, సూరత్, ముంబై తదితర ప్రాంతాలకు
వలస వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయం తరువాత ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నది టెక్స్‌టైల్ రంగంలోనేని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు నిర్ణయించారని చెప్పారు. టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు అవసరమైన 1200 ఎకరాల భూసేకరణ పూర్తయిందని, మరో 800 ఎకరాల భూమిని సేకరించవలసిన అవసరం ఉందని చెబుతు, మొదటి దశలో 677 కోట్ల వ్యయంతో పార్కు పనులు చేపడతామని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో లభించే అన్ని రకాల వస్త్రాలు ఇక్కడి టెక్స్‌టైల్ పార్కులో తయారు చేసేలా చర్యలు తీసుకుంటామని, అపార అనుభవంతో ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న చేనేత కార్మికులను ఎక్కువ పని, మెరుగైన వేతనాలు ఇవ్వటం ద్వారా ఇక్కడికి రప్పిస్తామని చెప్పారు. వస్త్రాల ఉత్పత్తిలో మెళుకువలు నేర్పించేందుకు అవసరమైన టెక్స్‌టైల్ కళాశాల ఏర్పాటుకు కోయంబత్తూరులోని పిఎస్‌జి కళాశాలతో ఒప్పందం కుదుర్చుకుంటున్మాని, అదేవిధంగా మారుతున్న ఆధునికతకు అనుగుణంగా వస్త్రాల తయారీకోసం కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు నిఫ్ట్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఈనెల 22న ముఖ్యమంత్రి కెసిఆర్ మెగా టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన చేస్తారని, అదే రోజు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 12 కంపెనీలతో సిఎం సమక్షంలో ఒప్పందాలు జరుగుతాయని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా ఇక్కడి టెక్స్‌టైల్ పార్కులో వస్త్రాల తయారీకి ప్రణాళికలు రూపొందిస్తామని, దీనివల్ల మెగా టెక్స్‌టైల్ పార్కు దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు. ఎన్నికల తంతుగా కాకుండా ఏడాది కాలవ్యవధితో టెక్స్‌టైల్ పార్కు మొదటిదశ నిర్మాణం పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుతోపాటు వివిధ పరిశ్రమల ఏర్పాటు ద్వారా వరంగల్ నగరం భారీగా విస్తరించేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరంగల్ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, వరంగల్‌ను ఎడ్యుకేషన్, ఐటి, ఇండస్ట్రియల్ హబ్‌లుగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్, జడ్పీ చైర్‌పర్సన్ పద్మ, ఎంపిలు దయాకర్, సీతారాంనాయక్, ప్రభుత్వ విప్ బోడకుంట్ల వెంకటేశ్వర్లు, నగర మేయర్ నరేందర్, రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.

చిత్రం..మెగా టెక్స్‌టైల్ పార్కు స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి కెటిఆర్