రాష్ట్రీయం

యుద్ధప్రాతిపదికన జోన్ల వ్యవహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: తెలంగాణ సిఎం కె. చంద్రశేఖరరావు జోన్ల వ్యవహారంలో భారీ మార్పు లు తేవాలని నిర్ణయించడంతో ఈ అంశం యుద్ధప్రాతిపదికన ముందుకు సాగుతోంది. జోన్ల విధానం కొనసాగించడమే కాకుండా, వీటి సంఖ్య పెంచాలని సిఎం తాజాగా నిర్ణయించడంతో అందుకు సంబంధించిన కార్యక్రమాలు అతివేగంగా సాగుతున్నాయి. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ అప్పుడే రంగంలోకి దిగింది. తొలి సమావేశం ఏర్పాటు చేసి అన్నికోణాల్లో అధ్యయనం మొదలు పెట్టింది. వీలైతే 2017 చివరిలోగా ఈ అంశాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని కెసిఆర్ భావిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా తెలంగాణలో రెండు జోన్లు (5-6 జోన్లు) హైదరాబాద్ ప్రత్యేక జోన్‌గా (ఫ్రీ జోన్) కొనసాగింది. ఏపీలో నాలుగు జోన్లు (1, 2, 3, 4) ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో జోన్లను రద్దు చేయాలని భావించారు. ఉద్యోగ సంఘాలు తదితరులతో చర్చలు జరిపారు. జోన్లను రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. కెసిఆర్ నేతృత్వంలో 2017 జూన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో జోన్ల విధానాన్ని రద్దు చేయాలని తీర్మానించారు. 371 (డి)కి అనుగుణంగా జారీ అయిన రాష్టప్రతి ఉత్తర్వులను జోన్లరద్దుకు అనుగుణంగా సవరించాలని కేంద్రాన్ని కోరాలని భావించారు. ఉద్యోగుల నియామకాల్లో జిల్లాస్థాయి, రాష్టస్థ్రాయి క్యాడర్లు మాత్రమే ఉండాలని, జోనల్, మల్టీ జోనల్ విధానం ఉండవద్దంటూ అప్పట్లో నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఆనాడు మీడియాకు వివరించారు.
జోన్ల విధానాన్ని రద్దుచేయాలంటూ మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకుని నాలుగు నెలలు గడవక ముందే జోన్ల విధానాన్ని కొనసాగించాలని మళ్లీ నిర్ణయించారు. పైగా ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రెండు జోన్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు ఉపముఖ్యమంత్రి, విద్యామంత్రి అయిన కడియం శ్రీహరి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలో పోచారం శ్రీనివాసరెడ్డి,
టి హరీశ్‌రావు తదితరులు ఉన్నారు. కమిటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు మరికొందరు సీనియర్ అధికారులూ ఉన్నారు.
మూడు రోజుల క్రితమే మంత్రివర్గం కమిటీ సమావేశమై ప్రాథమికంగా వేర్వేరు అంశాలపై చర్చంచింది. 31 జిల్లాలను ఎన్ని జోన్లుగా విభజిస్తే బాగుంటుందన్న అంశంపై చర్చ వివరంగా జరిగింది. అలాగే విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లాలన్నా, ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ‘స్థానికత’ (నేటివిటీ) నిర్వచనంపైనా మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ అంశంలో ఉద్యోగ సంఘాలతో చర్చించాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను అధికారులతో కూడిన కమిటీకి అప్పగించారు.
ఆరుజోన్లు
తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఆరుజోన్లను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఫ్రీజోన్‌గా ఉన్న హైదరాబాద్‌ను యథాతథంగా అలాగే ఉంచాలని భావిస్తున్నారు. ఒకటోజోన్‌లో నాగర్‌కర్నూలు, వనపర్తి, గద్వాల, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలను, రెండోజోన్‌లో నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి, మేడ్చల్ జిల్లాలను చేర్చాలని భావిస్తున్నారు. హైదరాబాద్ మూడో జోన్‌గా ఉంటుంది. నాలుగో జోన్‌లో సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజాబామాబాద్ జిల్లాలను చేర్చాలని భావిస్తున్నారు. అయిదో జోన్‌లో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల, సరిసిల్లా, పెద్దపల్లి జిల్లాలు ఉంటాయి. ఆరోజోన్‌లో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాలను చేర్చాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఈ జిల్లాల విషయంలో తుది నిర్ణయం తీసుకునేముందు కూలంకషంగా చర్చలు జరుపుతారు.
అందరితో చర్చించాలి
జోన్ల సంఖ్యను పెంచే అంశంపై కేవలం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతోనే కాకుండా, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, మేధావులు తదితరులతో చర్చించాలని తెలంగాణ ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార స్వామి పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, జోన్ల అంశం కేవలం ఉద్యోగులకు సంబంధించిందే కాదని, విద్యార్థులు, నిరుద్యోగులకు కూడా సంబంధించిందన్నారు. జోన్ల రద్దును తమ సంఘం మొదటి నుండి వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ప్రభుత్వం అన్ని కోణాల్లో అలోచించి నిర్ణయం తీసుకోవాలని సంపత్ కుమార స్వామి కోరారు.