రాష్ట్రీయం

రబీ.. ఆశాజనకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: తెలంగాణలో 2017-18 రబీలో 25 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. గత రెండు, మూడు వారాల నుండి వర్షాలు పుష్కలంగా కురుస్తుండటంతోపాటు ప్రధాన జలాశయాల్లోకి భారీ ఎత్తున జలాలు చేరడంతో ప్రభుత్వంలోనూ, రైతాంగంలోనూ ఆశలు రేకెత్తాయి. 2017 ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు సరిగ్గా లేకపోవడంతో పంటల ఉత్పత్తి గణనీయంగా దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తుండగా, రబీలో మాత్రం పరిస్థితి ఆశాజనకంగా ఉంది.
రబీ పంటల కోసం విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచాలంటూ ప్రభుత్వం ఇప్పటికే జిల్లాల్లోని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రబీలో ఆశాజనకంగా ఉన్న పరిస్థితిని పూర్తిగా ఉపయోగించుకోవాలంటూ సిఎం కె. చంద్రశేఖరరావు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు. సిఎం ఆదేశాలకు అనుగుణంగా పోచారం వ్యవసాయ అధికారులతో ఇప్పటికే సమావేశాలు ఏర్పటు చేసి పరిస్థితిని సమీక్షించారు. రబీకి లక్ష్యాన్ని నిర్ణయించారు. త్వరలోనే రబీ ప్రణాళిక విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి కింది స్థాయి అధికారులతో రోజువారీగా సమీక్షిస్తున్నారు. వ్యవసాయ కమిషనర్, ఉద్యాన కమిషనర్, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో ఆయన ఇప్పటికే పలుపర్యాయాలు సమావేశాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా, చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టుల కింద మొత్తం 48.95 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నాయని, ఇందులో ప్రస్తుత రబీలో 23.95 లక్షల ఎకరాలు సాగు చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. గత ఎనిమిది ఏళ్ల నుండి పరిస్థితి పరిశీలిస్తే, ఈ రబీలో 25 లక్షల ఎకరాలు సాగు చేసేందుకు వీలుందని వివరించారు. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల, కడెం, మూసి, సింగూర్, ఘన్‌పూర్
తదితర ప్రాజెక్టుల్లో నీరు ఉండటంతో 20 లక్షల ఎకరాల్లో వరి సాగుచేసేందుకు వీలవుతోంది. అలాగే చిన్ననీటి వనరుల కింద మరో ఐదులక్షల ఎకరాలు సాగవుతుందని అంచనావేస్తున్నారు. నీటి విడుదలకు సంబంధించి ఇప్పటికే వ్యవసాయ, నీటిపారుదల శాఖల మంత్రులు, అధికారులు సంయుక్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి సమగ్ర ప్రణాళికలను రూపొందించారు. నాగార్జున సాగర్ కింద 6.50 లక్షల ఎకరాలు, శ్రీరాంసాగర్ కింద 8.68 లక్షల ఎకరాలు, నిజాంసాగర్ కింద 2 లక్షల ఎకరాలకు నీటిని అందించేందుకు మంత్రి హరీష్‌రావు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
2017 ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు అంతగా బాగా లేకపోవడంతో పంటల పరిస్థితి బాగాలేదు. జలాశయాల్లోకి నీళ్లు రాకపోవడంతో వరిపంట విస్తీర్ణం బాగా తగ్గింది. సుదీర్ఘమైన వర్షాభావ పరిస్థితితో మెట్టపంటలు కూడా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిలో ఖరీఫ్ సీజన్‌కు ముందుగా నిర్ణయించుకున్న పంటల ఉత్పత్తి అంచనాలను తగ్గించుకుంటున్నారు. ఖరీఫ్‌లో 82.52 లక్షల టన్నుల పంటలు పండుతాయని అంచనావేయగా, దీన్ని 37.69 లక్షల టన్నులకు తగ్గించారు.
జలాశయాల్లో..
రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి నిలువలు బాగా ఉన్నాయి. శ్రీశైలంలో 212 టిఎంసిలు, నాగార్జునసాగర్‌లో 261 టిఎంసిలు ఉన్నాయి. ఈ రెండు జలాశయాల్లోని నీటిలో 300 టిఎంసిలను సేద్యానికి వాడుకునేందుకు వీలుంది. ఇలాఉండగా శ్రీరాంసాగర్‌లో 55 టిఎంసిలున్నాయి. సింగూరు, నిజాంసాగర్, కోయిల్‌సాగర్ తదితర ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయిలో నీటిమట్టాలున్నాయి. 2017-18 రబీ పంటలకు ఈ నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.