రాష్ట్రీయం

3న కృష్ణా లెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: ఆంధ్ర, తెలంగాణకు ప్రాణాధారమైన శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో మొత్తం 530 టిఎంసి సామర్థ్యానికి 475 టిఎంసి నీటి లభ్యత ఉండడంతో ఈ ఏడాది నీటి వినియోగంపై కృష్ణాబోర్డు కసరత్తు ప్రారంభించింది. నవంబర్ 3 శనివారం ఇక్కడ కృష్ణా బోర్డు సమావేశమై నీటి కేటాయింపులను ఖరారు చేయనుంది. ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి పరమేశన్ రెండు రాష్ట్రాలకు తెలియచేశారు. నీటి లభ్యత సంతృప్తికరంగా ఉండటం, రబీ పంటకు తగినన్ని నీటి విడుదల చేస్తారనే నమ్మకంతో రెండు రాష్ట్రాల్లో రైతుల ఆశలు చిగురించాయి. తమ రాష్ట్రాల పరిధిలో ఆయకట్టుకు నీటి విడుదల కోసం ఆంధ్ర, తెలంగాణ తాజాగా ఇండెంట్‌ను పంపించాయి. ఈ సమావేశంలో 2017-18 అంటే వచ్చే ఏడాది జూన్, జూలై వరకు ప్రస్తుత నీటి లభ్యత, మంచినీరు, సాగునీటి అవసరాలు, విద్యుదుత్పత్తి, ఆవిరి నష్టం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు చేస్తారు. కాగా తెలంగాణ ప్రభుత్వం తమకు 150 టిఎంసి వరకు నీటి కేటాయింపులు జరపాలని తాజాగా కోరినట్లు తెలిసింది. గతంలో 138.5 టిఎంసి నీటిని కోరుతూ లేఖ రాసింది. పట్టిసీమ నుంచి కృష్ణాబేసిన్‌కు గోదావరి నీటిని మళ్లించడం వల్ల నాగార్జునసాగర్‌లో అదనంగా 45 టిఎంసి వాడుకోవడానికి అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం ఈ సారి కృష్ణాబోర్డును గట్టిగా కోరనుంది. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బిసి)కి 30 టిఎంసి నీటిని కేటాయించాలని, 115.3 టిఎంసి మంచినీటి, సేద్యం నీటి అవసరాలకు కేటాయించాలని కోరింది. ఇందులోనే
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ జోన్-1కు 34.5 టిఎంసి, జోన్-2కు 20 టిఎంసి, 14 టిఎంసి హైదరాబాద్ మంచి నీటి అవసరాలు, 15 టిఎంసి మిషన్ భగీరథ, 25 టిఎంసి కల్వకుర్తి స్కీం కింద మంచినీటి, సాగునీటి అవసరాలకు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
కాగా రెండు జలాశయాలు నిండినందు వల్ల తమ రాష్ట్రానికి 270 టిఎంసి నీటిని కేటాయించాలని ఆంధ్ర ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. పోతిరెడ్డి పాడుకు 84 టిఎంసి, హంద్రీనీవా మచ్చుమర్రికి 25 టిఎంసి, నాగార్జునసాగర్ కుడికాల్వకు 96 టిఎంసి, ఆంధ్ర పరిధిలో ఉన్న ఎడమ కాల్వకు 27 టిఎంసి, కృష్ణా డెల్టాకు 38 టిఎంసి నీటిని కేటాయించాలని కోరారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు తలెత్తకుండా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణను బోర్డు స్వీకరించాలని, ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ కోరింది. మంచినీటి, సాగునీటి అవసరాల తర్వాత విద్యుత్ అవసరాలను గుర్తించాలని కోరింది. విద్యుదుత్పత్తి చేస్తే వాటి ద్వారా ఏమేరకు నీటిని విడుదల చేయాలి, ఇందులో ఏ రాష్ట్రం వాటా ఎంతో ఖరారు చేయాలని కూడా ఆంధ్ర ప్రభుత్వం కృష్ణాబోర్డును కోరింది.