రాష్ట్రీయం

పోలవరంపై 60-సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 30: పోలవరాన్ని 2019లోగా పూర్తి చేసేందుకు 60-సి నిబంధన అమలు చేయాలని నిర్ణయించినట్టు సిఎం చంద్రబాబు చెప్పారు. దీనిపై 1న జరిగే మంత్రిమండలి సమావేశంలో మరింత వివరంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. సోమవారం మధ్యాహ్నం తన కార్యాలయంలో పోలవరం, ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. పోలవరం ప్రధాన కాంట్రాక్టు సంస్థ విషయంలో ఎలా వ్యవహరించాలనే అంశంపై పలు మార్గాలను పరిశీలించామని సిఎం చెప్పారు. ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్ డ్యామ్, కాపర్ డ్యామ్ పనులు ఈ సీజన్‌లోనే చేపట్టాల్సి ఉన్నందున ప్రధాన నిర్మాణ సంస్థను కొనసాగిస్తూనే, కొన్ని పనులకు 60-సి నిబంధన వర్తింపచేసి ముందుకెళ్లాలని జలవనరుల నిపుణులు సూచించడంతో ఆ ప్రకారం నడుచుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించామన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సకాలంలోనే పూర్తి చేస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేస్తున్నారని ఈ సందర్భంగా ఎల్ అండ్ టి, బానర్ సంస్థలను అభినందించారు. ఎర్త్‌వర్క్, కాంక్రీట్ పనుల్లో జాప్యానికి వీల్లేదని స్పష్టం చేసిన సిఎం, 60సి నిబంధన ప్రకారం ఇప్పుడు తీసుకునే చర్యలతో పనులలో వేగం పుంజుకోవాలన్నారు. సిడబ్ల్యుసి నుంచి వారంలో అవసరమైన క్లియరెన్స్ వచ్చేలా తగు చర్యలు చేపట్టి గేట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్దేశించారు. డిసెంబరులోగా పూర్తి చేయాల్సిన 28 సాగునీటి ప్రాజెక్టులలో 10 ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలకు సిద్ధమయ్యాయని జలవనరుల శాఖ అధికారులు సిఎంకి వివరించారు. కోగుళ్లు, ఎర్రకాలువ, కండలేరు లిఫ్టు, మారాల, చెర్లోపల్లి, సిద్ధాపురం, నర్సింహరాయ సాగర్, గోరకల్లు, అవుకు టనె్నల్, పెదపాలం (గుంటూరు) చినసాన ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. పూర్తయిన 10 ప్రాజెక్టులకు మూడు రోజులపాటు వరుస ప్రారంభోత్సవాలు జరపాలని చంద్రబాబు సూచించారు.
గండికోట ప్రాజెక్టు విషయంలో నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంపై సిఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు. ఇదేవిధంగా ఏ నిర్మాణ సంస్థయినా నిర్దేశిత సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు త్వరలోనే ప్రారంభోత్సవం చేయనున్నట్లు ప్రకటిస్తూ, కొండవీటి వాగు డిసెంబరులోగా పూర్తి చేయాలని నిర్దేశించారు.
గిరిజన యువతతో బాబు వీడియో కాన్ఫరెన్స్
పోలవరం ప్రాజెక్టు పునరావాస కమిషనర్ శ్రద్ధ తీసుకుని గిరిజన యువతులను గ్రూపులుగా ఏర్పాటు చేసి, వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని సిఎంకి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి వివరించారు. అలా శిక్షణ తీసుకున్న 32 మంది యువతులతో కూడిన ఒక బృందాన్ని ఈ సందర్భంగా
వీడియో కాన్ఫరెన్సు ద్వారా సిఎంకి పరిచయం చేశారు.
మొన్నటివరకు ప్రాజెక్టు పనుల్లో కూలీగా పనిచేసిన తాను ప్రస్తుతం టైమ్స్ ఆఫ్ ఇండియా మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నానని విజయలక్ష్మి అనే యువతి చెప్పగా, ముఖ్యమంత్రి ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. తాము ఎక్కడికి వెళ్లినా ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం ఉందా అని అడుగుతున్నారని, తమకు ఈ దుస్థితి ఏమిటని ప్రశ్నించగా, ప్రస్తుత ప్రపంచ గమనంలో అందరూ మాతృభాషతోపాటు ఇతర భాషలు నేర్చుకోవాల్సిన అవసరముందని ఆమెకు బాబు నచ్చచెప్పారు. ప్రాజెక్టు పరిధిలోని గిరిజన గ్రామాల యువత ఉన్నతికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు ప్రత్యేకంగా ఒక ఏజెన్సీకి బాధ్యతలు అప్పగిస్తామని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని సమున్నతంగా ఎదిగేలా చేస్తామని తెలిపారు.

చిత్రం..పోలవరం, ఇతర ప్రాధాన్య ప్రాజెక్ట్‌ల పురోగతిని సమీక్షిస్తున్న సిఎం చంద్రబాబు