రాష్ట్రీయం

మీ మేలు మరువను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 30: ‘చేయూతనిచ్చే బాధ్యత నాది. అందిపుచ్చుకునే అవకాశం మీది’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు భరోసా ఇచ్చారు. సోమవారం అమరావతి సచివాలయ ప్రాంగణంలో ఆయన సింగపూర్ వెళుతున్న 34 మంది రైతులకు వీడ్కోలు పలికారు. సక్రమ మార్గంలో ముందుకు వెళితేనే ఎంతటి అభివృద్ధయినా సాధ్యమవుతుందని ఈ సందర్భంగా అన్నారు. అభివృద్ధికి అడ్డుపడేవారిని నమ్ముకుంటే ఒరిగేది ఏమీ ఉండదని తెలిపారు. రాజధాని అమరావతి సింగపూర్ తరహాలో ఉంటుందని తాను ఎన్నికలకు ముందే చెప్పానని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అడవిలో రాజధాని కట్టుకోవాలని శివరామన్ కమిటీ సిఫారసులు చేసి గందరగోళంలో పడవేస్తే, ఆ కమిటీ నివేదిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని ఉండాలని, ఉంటుందనీ తాను ప్రకటించానని గుర్తు చేశారు. కాంగ్రెస్ సారధ్యంలోని యుపిఎ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా, అశాస్ర్తియంగా విభజించిందని విమర్శించారు. రాజధాని లేక, గమ్యం తెలియని సంక్షోభకాలంలో తాను ఇచ్చిన పిలుపునకు రాజధాని ప్రాంత రైతాంగం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విలువైన భూములిచ్చిందని,
వారిని జీవితాంతం గుర్తుంచుకుంటానని చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రాజధానికి భూములిచ్చిన ప్రతి ఒక్క రైతు పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే తన ధ్యేయమన్నారు. రాజధాని రైతుల సమగ్రాభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని, వారికి అండగా ఉంటామని చంద్రబాబు ప్రకటించారు. అచంచల విశ్వాసంతో ఫ్రెంచి ఓపెన్ సింగిల్స్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన కిడాంబి శ్రీకాంత్ ఈ ప్రాంతం వారేనని చంద్రబాబు అభినందించారు.
సింగపూర్ 55 ఏళ్లకు ముందు చేపలు పట్టుకునే చిన్న పల్లె, మలేసియా వెళ్లగొడితే వేరై పట్టుదలతో ఎదిగి అభివృద్ధి సాధించిందని, అక్కడి ప్రజలు ఎడారినే స్వర్గంగా మార్చుకున్నారని ముఖ్యమంత్రి వివరించారు.
రాజధాని పరిపాలన నగరం ఆకృతులు తుది దశకు వచ్చాయని, సచివాలయం, ఇతర కార్యాలయాలకు ఏడు టవర్లు నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు. ఇక్కడికి ఎంతో మంది వస్తారని, వారితో పోటీపడే స్థాయికి రాజధాని రైతులు ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. ఎదగడానికి సంపద అవసరం లేదని, సంకల్పం ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. ‘వ్యాపారాలలో మీరు ఎదగాలి, మీకు అన్ని విధాలుగా అవకాశాలు కల్పిస్తాం’ అని అన్నారు. ఆనాడు హైదరాబాద్‌లో 163 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తే అందరూ ఆశ్చర్యపోయారన్నారు. ఆలోచన, సంకల్పం ఉంటే అద్భుతాలు చేయవచ్చన్నారు. మెకన్జీ సూచనలతో రాజధాని ప్రాంత రైతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
చాలా సంతోషం:ఆదిలక్ష్మి
అభివృద్ధిని తెలుసుకునేందుకు సింగపూర్ టూర్‌కు వెళ్లడం చాలా సంతోషంగా ఉందని భూసమీకరణలో తొలిసారిగా భూమి ఇచ్చిన నేలపాడు రైతు కొమ్మినేని ఆదిలక్ష్మి అన్నారు. సింగపూర్ కంటే నెంబర్ వన్‌గా అమరావతి అభివృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని, దాన్ని నెరవేర్చుకునేందుకు సంపూర్ణంగా సహకరిస్తామని, ముఖ్యమంత్రి పేరు నిలబెడతామని అన్నారు.
యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చాం: జె.వినయ్
యూఎస్ నుంచి తాము ఇక్కడికి వచ్చామని, నెక్కల్లులోనే నివాసం ఉంటామని, తమ పిల్లలకు ఇక్కడే ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయని జె.వినయ్ అన్నారు. అమరావతి రాజధాని నగరం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సింగపూర్ యాత్ర సంతోషదాయకమమని, ఇది అభివృద్ధి అవగాహనకు తోడ్పడుతుందని చెప్పారు.
తామంతా ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఆయనపై ఎంతో నమ్మకంతో స్వచ్ఛందంగా భూసమీకరణలో భూములు ఇచ్చామని, ఇచ్చిన హామీ ప్రకారం రాజధాని అభివృద్ధికి సిఎం ఎంతో కృషి చేస్తున్నారని రైతు యాత్రకు వెళుతున్న మంగళగిరి జడ్పీటీసీ ఆకుల జయసత్య న్నారు. సింగపూర్ యాత్ర ద్వారా రైతులకు అభివృద్ధిపై అవగాహన కల్పించి పారిశ్రామిక వేత్తలుగా తయారు కావడానికి ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అభివృద్ధికి బాటలు వేస్తున్న సిఎం: బెల్లంకొండ నరసింహరావు
సింగపూర్‌లా అమరావతి రాజధాని నగరాన్ని అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చెప్పిన విధంగా ఎన్నో ప్రముఖ సంస్థలను ఏర్పాటు చేయించి అభివృద్ధికి బాటలు వేస్తున్నారని సింగపూర్ టూర్‌కు వెళుతున్న రైతు, తాడికొండ మార్కెట్ చైర్మన్ బెల్లంకొండ నరసింహారావు అన్నారు. తమ పిల్లలు విదేశాలకు వెళ్లే అవసరం లేకుండా అమరావతి నగరంలోనే అపూర్వ అవకాశాలు కల్పించేందుకు సిఎం చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. ఇచ్చిన హామీ ప్రకారం అభివృద్ధి చేయడమే కాక, అన్ని వర్గాలకు తగిన ప్యాకేజీలు అమలు చేస్తున్నారని, రైతులకు యాన్యుటీ, పేదలకు పెన్షన్లు, స్కిల్ డెవలప్‌మెంట్, తదితర పథకాలను వివరించారు. సింగపూర్ పర్యటనకు తమను తీసుకెళ్లడం ఎంతో సంతోషకరమన్నారు.

చిత్రం..సింగపూర్ వెళ్తున్న రాజధాని రైతుల బస్సుకు జెండా ఊపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు