రాష్ట్రీయం

కెసిఆర్‌పైనే యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 30: ‘సిఎం కె. చంద్రశేఖర్‌రావుపై ఇది ఆఖరి పోరాటం’ అని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి అన్నారు. తనలో పసుపు రంగు రక్తం ఉన్నా, తెరాసను గద్దె దింపేందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నానని అన్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో జూబ్లీహిల్స్ పరిసరాలూ సందడిగా మారాయి. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమావేశానికి హాజరై, రేవంత్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్ సభకు టి.టిడిపి మాజీ ఎమ్మెల్యేలు వేం నరేందర్ రెడ్డి, బోడ జనార్ధన్ కూడా పాల్గొన్నారు. ఇలాఉండగా సమావేశానంతరం రేవంత్ ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమై, సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్‌లో అధికారికంగా చేరనున్నారు.
రేవంత్ విసుర్లు
రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో సిఎం కెసిఆర్ కుటుంబ పాలన చేస్తున్నారంటూ నిప్పు లు చెరిగారు. కెసిఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటే కాంగ్రెస్‌లో చేరడం వినా తనకు వేరే గత్యంతరం లేదన్నారు. కుటుంబ పాలనకు స్వస్తి చెప్పేందుకు విద్యార్థులు, యువకులు ప్రతి ఒక్కరూ మరోసారి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం తొలుత ఒక ఉద్యమం వచ్చిందని, తర్వాత మలి ఉద్యమం
రావడం సాధించుకోవడం జరిగిందని, ఇది తుది పోరాటం కావాలన్నారు. ఎన్టీఆర్‌ను, చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని, తెలంగాణను కాపాడుకోవడానికి పునరంకితం అవుతున్నానని అన్నారు. తెలంగాణ కోసం త్యాగం చేయడం తప్పా? అని ప్రశ్నించారు. తనకు ఎటువంటి పదవులు అవసరం లేదన్నారు. పదవులు కావాలనుకుంటే బిజెపిలో చేరవచ్చని, పైగా కేంద్రంలో తమ పార్టీ భాగస్వామ్యం ఉందని ఆయన తెలిపారు.
బిజెపి-తెరాస అలయ్ బలయ్
ప్రధాని నరేంద్ర మోదీ, సిఎం కెసిఆర్ కలిసే ఉన్నారని, ఉదయం తిట్టుకుంటారని, సాయంత్రం మాట్లాడుకుంటారని విమర్శించారు. ఇంత పొడుగు లాల్చీ వేసుకుని పెద్దపెద్ద మాటలు మాట్లాడే బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఎప్పుడు వార్డు సభ్యునిగా కూడా గెలుపొందలేదని అన్నారు. తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అని చెప్పే బిజెపికి సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో 248 ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. నోట్ల రద్దు, జిఎస్‌టిని టిఆర్‌ఎస్ సమర్థించడాన్ని గమనించాలన్నారు. తెలంగాణ కోసం పోరాడిన గద్దర్, విమలక్కపై నక్సల్స్ కేసు పెడుతున్నారన్నారు. కెసిఆర్ కుటుంబ పాలనను తుదముట్టించి, రాజకీయ పునరేకీకరణ కోసమే తాను కాంగ్రెస్‌లో చేరుతున్నానని చెప్పారు. కాంగ్రెస్‌తో టిడిపి కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ఆంధ్రలో కాంగ్రెస్ నేతలు జెసి దివాకర్ రెడ్డి, రాయపాటి, టిజి వెంకటేష్ ప్రభృతులు చేరలేదా? అని ప్రశ్నించారు. బద్ధ శతృవులైన పరిటాల సునీత, జెసిలు కలుసుకోలేదా? అని రేవంత్ ప్రశ్నించారు.
టిఆర్‌ఎస్‌ను తరిమి కొడదాం..
టి.పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ అధిష్టానం తరఫున రేవంత్‌ను ఆహ్వానించేందుకు వచ్చానని చెప్పారు. తెరాసను తరిమి కొడదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్‌లో చేరాలని ఆయన ఇతర పార్టీల నేతలను కోరారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అవినీతి జరుగుతున్నదని ఉత్తమ్ విమర్శించారు.

చిత్రం..హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వద్ద ఆత్మీయ సమావేశానికి హాజరవుతున్న రేవంత్ రెడ్డి