రాష్ట్రీయం

కార్యదర్శి లేకుండానే అసెంబ్లీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 2: శాసనసభకు పూర్తిస్థాయి కార్యదర్శి లేకుండానే సమావేశాలు ప్రారంభం కానుండటం చర్చనీయాంశమయింది. అసెంబ్లీ కార్యదర్శిగా పనిచేసిన రామాచార్యులు ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు వద్ద చేరడంతో కొద్దినెలల నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది. ఈ నెల 10 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటివరకూ పూర్తిస్థాయి కార్యదర్శినెవరినీ నియమించకపోవడం, డిప్యూటీ సెక్రటరీల్లో సీనియారిటీకి చోటివ్వకపోవడంపై కొద్దికాలం నుంచీ చర్చ జరుగుతోంది. రామాచార్యులు ఢిల్లీకి వెళ్లిన తర్వాత కార్యదర్శిగా ఎవరినీ నియమించలేదు. సీనియారిటీ లిస్టులో ఉన్న డిప్యూటీ కార్యదర్శులుగా సత్యనారాయణ, బాలకృష్ణమాచార్యులు, విజయరాజులలో సత్యనారాయణకు అంతకుముందు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి కూడా ఆయన వైపే మొగ్గుచూపడటంతో సత్యనారాయణకు తాత్కాలిక ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చారు. తర్వాత ఆయనకు లా డిగ్రీ లేనందున ఆ పదవికి అర్హుడు కాదని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేయడంతో బాధ్యతల నుంచి తప్పించారు. అయితే తర్వాత సీనియారిటీ లిస్టులో ఉన్న బాలకృష్ణమాచార్యులును కాదని, వారిద్దరికీ జూనియర్ విజయరాజుకు బాధ్యతలు అప్పగించటం ఉద్యోగుల్లో విమర్శలకు దారితీసింది. ప్రస్తుతం సత్యనారాయణ శాసనమండలి వ్యవహారాలు, బాలకృష్ణమాచార్యులు అసెంబ్లీ వ్యవహారాలు చూస్తున్నారు. ఇదిలావుండగా, అసెంబ్లీ కార్యదర్శిగా ఖమ్మం జిల్లాకు చెందిన ప్రసన్నకుమార్‌ను నియమించాలన్న ప్రయత్నాలపై వస్తున్న విమర్శల నేపథ్యంలో పూర్తిస్థాయి కార్యదర్శి నియామక ప్రక్రియను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. ఆయన రాష్ట్రానికి చెందిన అధికారి కాకపోవడం, తన మాతృ శాఖ ప్రసార భారతి రిలీవ్ చేయకపోవడం, డెప్యుటేషన్ ముగిసినందున ఆయనను ప్రసార భారతిలో రిపోర్టు చేయాలన్న ఆదేశాల అమలు పెండింగ్‌లో ఉండటం, అసెంబ్లీ ఉద్యోగుల నుంచి నాన్ లోకల్ వివాదం తెరపైకి రావడం, ప్రసన్నకుమార్ నేపథ్యాన్ని బిజెపి నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడంతో కొత్త కార్యదర్శి ఎంపిక వ్యవహారం నిలిచిపోయినట్లు తెలిసింది. కాగా ఇప్పటివరకూ శాసనసభ, శాసనమండలి చీఫ్ విప్ పదవులు భర్తీ కాకపోవడంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తవౌతోంది. సమాచార శాఖ మంత్రిగా పనిచేసిన పల్లె రఘునాథరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించి ఆయన స్థానంలో అప్పటివరకూ అసెంబ్లీ చీఫ్ విప్‌గా ఉన్న కాలవ శ్రీనివాసులుకు అప్పగించిన రోజున, పల్లెకు చీఫ్ విప్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆరు నెలలయినా ఇప్పటివరకూ అసెంబ్లీ చీఫ్ విప్ పదవిని భర్తీ చేయలేదు. శాసనసమండలి చీఫ్ విప్ పదవి కూడా చాలా నెలలుగా పెండింగ్‌లో ఉండటంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ హోదా ఉన్న చీఫ్ విప్, విప్ పదవులను భర్తీ చేయకుండా నాయకత్వం ప్రదర్శిస్తున్న తాత్సార వైఖరిని ప్రజాప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు.