రాష్ట్రీయం

సర్కారుతో ఆర్టీసీ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 11: ఆర్టీసీలో పదవీ విరమణ వయసు పెంపు విషయం ఎటూ తేలకుండా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు న్యాయస్థానాలు జారీచేసిన ఉత్తర్వులు సైతం బేఖాతరవుతున్నాయి. ఇటు కార్మికులు, రిటైర్డ్ కార్మికులు జీవోల అమలు కోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆశ్రయిస్తూ లక్షలకు లక్షలు ధారపోస్తుంటే ఇటు ఆర్టీసీ యాజమాన్యం కూడా పంతాలు, పట్టింపులకు పోతూ సంస్థ నష్టాలతో ఉందనే సాకుతో జీవోలు చెల్లుబాటు కాకుండా చూసేందుకు సీనియర్ న్యాయవాదులను నియమించుకుంటూ లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు గత సెప్టెంబర్‌లో జరిగిన ఎన్‌ఎంయు స్వర్ణోత్సవ సభలో ఉద్యోగులెవరూ అడగకపోయినా పదవీ విరమణ వయస్సును పెంచేసాం.. ఆర్టీసీలో కూడా అమలు చేస్తున్నామని ప్రకటించారు. కాని నేటి వరకు ఆ ఊసే లేదు. దీంతో 58 ఏళ్ల పదవీ విరమణకు దగ్గర పడుతున్నవారు, అలాగే రిటైర్
అయిన మొత్తం ఏడువేల మంది కార్మికులు ప్రత్యక్ష పోరుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం పదవీ విరమణ వయోపరిమితిని 60కి పెంచుతూ 2014 జూన్ 30న 147 నెంబర్‌తో ఉత్తర్వు జారీచేసి ఆమేర జూన్ రెండో తేదీ నుంచి అమల్లోకి తెచ్చింది. ఆపై పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూలులో ఉన్న ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు, 10వ షెడ్యూలులోని రాష్టస్థ్రాయి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా వర్తింప చేస్తూ 2017 జూన్ 27న 102 నెంబర్‌తో జీవో జారీ చేసింది. అయితే ఈ జీవోల ప్రకారం తమ సంస్థ ఆర్థిక పరిస్థితి, అవసరాలు దృష్టిలో ఉంచుకుని బోర్డు లేదా అధికారిక మండలిలో నిర్ణయం తీసుకున్నరోజు ఎప్పటికైనా అప్పటి నుంచే అమల్లోకి వచ్చేలా మెలిక పెట్టారు. అయితే నండూరి సాంబశివరావు సంస్థ ఎండిగా ఉన్నప్పుడు ఉద్యోగుల సీనియార్టీ, అలాగే తక్షణం రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్గించేలా ఆర్థిక స్థితి లేకపోవటం దృష్టిలో ఉంచుకుని సిబ్బంది రిటైర్మెంట్ వయో పరిమితిని పెంచాల్సి ఉందంటూ 2015 డిసెంబర్ 4న ప్రభుత్వానికి సిఫార్స్ చేశారు. ప్రస్తుత ఎండి మాలకొండయ్య మాత్రం నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు కాలేదంటుంటే బోర్డు లేకపోతే కొత్త బస్సుల కొనుగోళ్లు, అలాగే బస్ భవన్ నిర్మాణానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా అని పదవీ విరమణ చేసిన ఆర్టీసీ కార్మికులు వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం 102 జీవోలో కొన్ని సవరణలు చేస్తూ నిర్ణయం ఎప్పుడు జరిగినా ఇతర ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా 2014 జూన్ రెండో తేదీ నుంచి కొనసాగించాలని ఆదేశించింది. అయితే పదవీ విరమణ చేసిన వారిని కూడా తక్షణం వెనక్కి తీసుకొని 60 ఏళ్ల వరకు కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశిస్తే అప్పటికే పదోన్నతులు ద్వారా అనేక పోస్టులు భర్తీ చేసామని సంస్థ చెబుతున్నది. ఈ జీవోల ప్రకారం ఇప్పటికే విద్యుత్ సంస్థ, గృహనిర్మాణ సంస్థ, సివిల్ సప్లయ్‌స్ సంస్థ, ఏపీ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో పదవీ విరమణ వయో పరిమితి పెరిగింది. ఆర్టీసీలో సగటున సంవత్సరానికి 2వేల మంది పదవీ విరమణ చేస్తున్నారు. ప్రస్తుత ఎండి మాలకొండయ్య పదవీ విరమణ వయోపరిమితి పెంపు సాధ్యాసాధ్యాలపై ఉన్న పరిమితులను వివరిస్తూ తగు సూచనలు ఇవ్వాలని కోరుతూ ఈ ఏడాది ఆగస్టు 17తేదీన ప్రభుత్వానికి లేఖ రాయగా దీనికి ప్రత్యుత్తరంగా రవాణాశాఖ ముఖ్య కమిషనర్ 60ఏళ్ల పెంపు అమలు చేయాలంటూ అక్టోబర్ 26న సమాధానమిచ్చారు. ఇక ప్రస్తుత వివాదం సుప్రీంకోర్టులో ఉంది. యాజమాన్యం వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకోగల్గితే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కాగలదని ఉద్యోగ, కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి.