రాష్ట్రీయం

‘సీట్ల’పై మళ్లీ ఒత్తి‘ఢీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 11: రాజకీయ సుస్థిరత కోసం తమ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచుకోవాలని భావిస్తోన్న తెలుగు చంద్రులకు ఎప్పటికప్పుడు చుక్కెదురవుతూనే ఉంది. విభజన చట్టం హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచాలని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ రాష్ట్ర సీఎం చంద్రశేఖర్‌రావు చాలాకాలం నుంచీ కేంద్రంపై వేర్వేరుగా ఒత్తిడి చేస్తున్నారు. ఈసారి మరో గట్టి ప్రయత్నం చేయాలని టీడీపీ-టీఆర్‌ఎస్ నిర్ణయించాయి. అయితే రెండు రాష్ట్రాల్లోని బిజెపి నాయకత్వాలు ఆ ప్రతిపాదనను ఎప్పటికప్పుడు అడ్డుకోవడంతో, ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడుతూ వస్తోంది.
తాజాగా తెరాస పక్షాన కేంద్రంలో లాబీయింగ్ చేస్తున్న ఎంపి వినోద్‌కుమార్ విజయవాడకు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. పెళ్లికార్డు ఇచ్చేందుకు వచ్చిన ఆయన, నియోజకవర్గాల పునర్విభజన అంశంపై బాబుతో సుదీర్ఘంగా మంతనాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ ఒక్క అంశంలో మాత్రం చాలాకాలం నుంచీ రెండు పార్టీలు కలసి పనిచేస్తుండటం ప్రస్తావనార్హం. ఏపిలో వైసీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు, తెలంగాణలో వివిధ పార్టీల నుంచి 20 మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరిన విషయం తెలిసిందే. ఏపిలో 175 ఉన్న అసెంబ్లీ స్థానాలను 225, తెలంగాణలో 119 నుంచి 154 స్థానాలకు పెంచాలన్నది ఒక ప్రతిపాదనగా ఉంది.
నియోజకవర్గ పునర్విభజన జరుగుతుందన్న ధీమాతోనే, వారికి తిరిగి అవే నియోజకవర్గాల్లో సీటు ఇస్తామన్న హామీతో తమ పార్టీల్లో చేర్చుకున్నారు. కానీ కేంద్రం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి సానుకూల సంకేతాలు రాకపోవడం, తమ నియోజకవర్గాల్లో సొంత పార్టీ ప్రత్యర్ధుల దూకుడు పెరిగిపోతుండటంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి పార్టీ మారిన ఎమ్మెల్యేలలో కనిపిస్తోంది.
దీనిని నివారించి, వారికి భరోసా ఇచ్చేందుకు ఇద్దరు చంద్రులు కేంద్రంపై మరోసారి ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనిపై ఉమ్మడి వ్యూహంతో వెళ్లాలని భావిస్తున్నారు. అయితే, ఈ అంశంలో తమ కంటే తెరాసనే ఎక్కువ చొరవ తీసుకుంటేనే, ఫలితాలు మెరుగ్గా ఉంటాయని టీడీపీ నాయకత్వం ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీకి ఏపిలో కంటే తెలంగాణలోనే ఎక్కువ అంచనాలుండటం, మోదీతో కేసీఆర్‌కు సత్సంబంధాలున్న నేపథ్యంలో ఫలితం కోసం ‘అటుంచి నరుక్కురావడ’మే మంచిదన్న వ్యూహంతో టీడీపీ నాయకత్వం ఉన్నట్లు ఆ పార్టీ నేతలు విశే్లషిస్తున్నారు.
తాజాగా బాబు ఢిల్లీ వెళ్లి సందర్భంలో హోంమంత్రి రాజనాధ్‌సింగ్‌ను కలసి మరోసారి పునర్విభజన అంశాన్ని ప్రతిపాదించారు. రాజకీయ సుస్థిరత ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుందన్న బాబు వాదనతో రాజనాధ్‌సింగ్ ఏకీభవించినప్పటికీ, ఇది ప్రభుత్వపరంగా కంటే రాజకీయపరంగా తీసుకునే నిర్ణయమని తన నిస్సహాయత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. నిజానికి హోంమంత్రి పునర్విభజనకు వ్యక్తిగతంగా సానుకూలంగా ఉన్నప్పటికీ, మోదీ-షా స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన అంశమయినందున, రాజనాధ్ కూడా క్రియాశీలపాత్ర పోషించి చొరవ తీసుకోలేకపోతున్నారని టీడీపీ ఎంపిలు చెబుతున్నారు. తమ సమావేశాల్లో హోంమంత్రి ఒక్కసారి కూడా పునర్విభజన అంశాన్ని వ్యతిరేకించలేదని గుర్తు చేస్తున్నారు. పైగా ఇటీవలి కాలం వరకూ ఇద్దరు చంద్రుల పక్షాన కేంద్రంలో లాబీయింగ్ చేసిన వెంకయ్యనాయుడు, ప్రత్యక్ష రాజకీయాల నుంచి నిష్క్రమించి ఉప రాష్టప్రతిగా వెళ్లడంతో పునర్విభజన అంశం ముందుకు కదలకుండా నిలిచిపోయింది. వెంకయ్య కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో హోంమంత్రిత్వ శాఖకు స్వయంగా వెళ్లి, అధికారులతో సమావేశమయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన నిష్క్రమణ రెండు తెలుగు రాష్ట్రాలకు నష్టమేనని, ఆయన స్థాయిలో చొరవ తీసుకునే వారు లేకుండా పోయారన్న ఆవేదన రెండు పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది.
కాగా, నియోజకవర్గ పునర్విభజన ప్రతిపాదనను ఏపి-తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖలు తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా చంద్రబాబును వ్యతిరేకిస్తోన్న బీజేపీలోని ఒక వర్గం అదే కోణంలో ఈ ప్రతిపాదనకు మోకాలడ్డుతోంది. దానివల్ల పార్టీకి రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం లేదని, టీడీపీ-టీఆర్‌ఎస్ బలోపేతానికి మనం ప్రత్యక్షంగా సహకరించడమే అవుతుందని రెండు రాష్ట్రాల శాఖలు తమ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా వద్ద ఇప్పటికి మూడుసార్లు వాదించాయి. పైగా రెండు రాష్ట్రాల్లో సీట్లు పెంచితే, మిగిలిన రాష్ట్రాల్లోనూ అలాంటి డిమాండ్లే తెరపైకి వస్తే, ఇప్పటి పరిస్థితిలో ఆ తలనొప్పి భరించడం కష్టమన్న భావన కూడా తమ నాయకత్వంలో ఉందని ఏపీకి చెందిన ఓ అగ్రనేత అసలు విషయం వెల్లడించారు. 2026 వరకూ నియోజవకర్గాల పెంపు సాధ్యం కాదని ఇసి కూడా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రాజకీయ నిర్ణయం తీసుకుంటే పునర్విభజన కష్టమేమీ కాదని, అయితే, తమకు ఎలాంటి బలం లేని రెండు రాష్ట్రాల్లో బీజేపీ అంత రిస్కు తీసుకుంటుందా అన్నదే చూడాల్సి ఉందని రాజకీయ విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు.