రాష్ట్రీయం

మండేకాలం.. ముందే మొదలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30 : సాధారణంగా చలికాలం నవంబర్ నుండి మొదలుకుని ఫిబ్రవరి వరకు నాలుగు నెలల పాటు ఉంటుంది. ఈ పర్యా యం చలికాలం ఆలస్యంగా అంటే డిసెంబర్‌లో ప్రారంభమై త్వరగా అంటే జనవరి వరకే వెళ్లిపోతోంది. గత రెండు నెలల నుండి ఉన్న చలి కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు పెరిగినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండి) నివేదికలు వెల్లడిస్తున్నాయి.
2015 వర్షాకాలంలో నైరుతీ రుతుపవనాల ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రభావం చూపించలేదు. సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. దాంతో తెలంగాణ రాష్ట్రంలో 443 మండలాలకు గానూ 231 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్‌లో 664 మండలాలకు గాను 359 మండలాలను కరవుపీడిత మండలాలుగా ప్రకటించారు. వర్షాలు పెద్దగా లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో జలాశయాలు నీరులేక బోసిపోయి ఉన్నాయి. సాధారణంగా జలాశయాలు నీటితో కలకలలాడుతూ ఉంటే వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఉభయ రాష్ట్రాల్లో జలాశయాలలో నీటినిలువలు అడుగంటిపోయాయి. భారీ ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్ జలాశయాల్లో నామమాత్రంగా నీటినిలువలున్నాయి.
ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ రాత్రివేళ ఉష్ణోగ్రతలు 15 నుండి 20 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. పగటి వేళ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల వరకు చేరుతున్నాయి. గత నెల రోజుల నుండి పగటివేళ ఉష్ణోగ్రతలు కేవలం 25 నుండి 30 డిగ్రీల మధ్య నమోదవుతు వస్తున్నాయి. ఇప్పుడు సుమారుగా ఐదు డిగ్రీల వరకు పెరిగింది.
ఐఎండి హైదరాబాద్ డైరెక్టర్ వైకె రెడ్డి శనివారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ఈ సీజన్‌లో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 4.5 డిగ్రీల వరకు నమోదైందని, ఇతర జిల్లాల్లో ఇది 9 నుండి 15 డిగ్రీల వరకు నమోదైందని తెలిపారు.
పగటి వేళ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని, గత రెండు రోజుల నుండి సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని వివరించారు. వచ్చే వేసవిలో సాధారణం కన్నా రెండు, మూడు డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్నారు. సాంకేతికపరంగా జనవరి-్ఫబ్రవరి నెలలను చలికాలంగా పరిగణిస్తున్నామని తెలిపారు. వివిధ కారణాల వల్ల చలి తగ్గుతూ వస్తోందని, పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయని డైరెక్టర్ వైకె రెడ్డి వివరించారు.

హెచ్‌సియు ముట్టడి

ఆందోళనలతో అట్టుడికిన సెంట్రల్ వర్శిటీ
వర్శిటీలోకి చొచ్చుకెళ్లేందుకు ఎబివిపి యత్నం
పోలీసులతో వాగ్వివాదం, తోపులాట
పలువురు విద్యార్థుల అరెస్టు
కాంగ్రెస్ దీక్ష భగ్నం చేసిన పోలీసులు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 30: కేంద్రీ య విశ్వవిద్యాలయం ఆందోళనలతో అట్టుడికి పోయింది. రోహిత్ ఆత్మహత్యపై న్యాయ విచారణ జరిపించాలని, కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ చేపట్టిన ఆందోళనలతో శనివారం యూనివర్శిటీ దద్దరిల్లింది. రోహిత్ మృతికి కారకులైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత పనె్నండు రోజులుగా సెంట్రల్ వర్శిటీలో విద్యార్థుల నిరశన దీక్షలు కొనసాగుతున్న విషయం విదితమే. శనివారం వర్శిటీలో విద్యార్థుల నిరశన, కాంగ్రెస్ నాయకుల దీక్ష, ఎబివిపి నాయకుల వర్శిటీ ముట్టడితో క్యాంపస్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వర్శిటీ గేటు ఎదుట కాంగ్రెస్ చేపట్టిన నిరశన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాకను నిరసిస్తూ ఎబివిపి కార్యాకర్తలు ‘రాహుల్ గాంధీ గోబ్యాక్’ అంటూ పెద్దఎత్తున నినదించారు. వర్శిటీలోకి దూసుకెళ్లెందుకు యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఉద్రిక్తతల నడుమ జరిగిన తోపులాటలో గచ్చిబౌలి సిఐ రమేశ్‌కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పలువురు ఎబివిపి నాయకులను పోలీసులు అరెస్టు చేసి బాలానగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
కాంగ్రెస్ దీక్ష భగ్నం
ఓవైపు వర్శిటీలో విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షకు మద్దతుగా రాహుల్ గాంధీ దీక్షలో పాల్గొనగా మరోవైపు వర్శిటీ గేటు ముందు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బైఠాయించి నిరాహార దీక్ష చేపట్టింది.
పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క పాల్గొన్న దీక్ష శిబిరానికి ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు దీక్షను భగ్నం చేశారు. శిబిరాన్ని ఎత్తేసి కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకొని చందానగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

రోహిత్ మృతికి కారకులైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని
డిమాండ్ చేస్తూ శనివారం ఆందోళన చేస్తున్న యూనివర్శిటీ విద్యార్థులు