రాష్ట్రీయం

విద్యార్థులేమైనా రోబోలా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 29: ఇక ఏ ఒక్క విద్యార్థి ఆత్మహత్య జరిగినా సహించేది లేదు. కళాశాల యాజమాన్యం ఎవరిదైనా వారిని ఉపేక్షించేది లేదు, కఠిన చర్యలు తప్పవని సిఎం చంద్రబాబు సభాముఖంగా హెచ్చరించారు. అసెంబ్లీలో బుధవారం ‘విద్యాలయాల్లో విద్యార్థుల ఆత్మహత్యల’పై దాదాపు గంటసేపు చర్చ జరిగింది. దీనిపై సిఎం సమాధానమిస్తూ స్వప్రయోజనాల కోసం ర్యాంకుల పేరిట విద్యార్థులను మరయంత్రాలుగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజులో కనీసం 18 గంటలపాటు తరగతి గదులకే పరిమితం చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుకునే ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుందన్నారు. ఆదివారం, సెలవు దినాల్లో సైతం విద్యార్థులను హింసిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. ఒక్క చదువే కాదు సృజనాత్మకత, మానసికోల్లాసం కలిసినపుడే విద్యార్థులకు ఉజ్వల భవితవ్యం ఉంటుందన్నారు. వారానికోసారైననా తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం విద్యార్థులకు లేకుండా పోతున్నదన్నారు. విద్యార్థులను రోబోల్లా చూస్తే ఎలాగని ప్రశ్నించారు. ఏది ఏమైనా ఆత్మహత్యల వార్త వినపడటానికి వీలు లేదని, యాజమాన్యాల్లో మార్పు రావాలన్నారు. ప్రతి విద్యా సంస్థలో టీవీలు, దినపత్రికలు, క్రీడా స్థలాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పర్యవేక్షణకు ఎమ్మెల్యేలతో కమిటీలు వేయాలన్న సభ్యుల ప్రతిపాదనను బాబు సున్నితంగా తిరస్కరిస్తూ అలా చేస్తే ఇక చదువులే ఉండవని చమత్కరించారు. చర్చ జరిగే సమయంలో మానవవనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంతో సీరియస్‌గా సభ్యుల ప్రసంగాలను వింటూ కూర్చోగా, అదే సమయంలో నారాయణ విద్యా సంస్థల యజమాని, మంత్రి పి.నారాయణ సభలో లేరు. దీంతో అధికార మిత్రపక్ష సభ్యులు అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పారు. అయితే వారంతా ప్రత్యక్షంగా, పరోక్షంగా చైర్మన్ నారాయణ విద్యా సంస్థలను వెనుకేసుకు వస్తూ ప్రతిపక్షం వైకాపాపై ఎదురుదాడికి దిగారు. ఇందుకోసం దశాబ్దాల కాలం నాటి గణాంకాలను ఉదహరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు విద్యార్థుల ఆత్మహత్యలు 116 నమోదు కాగా 75 శాతం ఒత్తిళ్ల కారణమని, వాస్తవానికి నారాయణ విద్యా సంస్థల్లో నమోదైన కేసులు 15 మాత్రమేనని అధికారపక్ష సభ్యురాలు వంగలపూడి అనిత, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పేర్కొన్నారు. అయితే ప్రతిపక్ష వైకాపా దీన్ని రాద్ధాంతం చేస్తోందంటూ మంత్రి నారాయణ, గంటా శ్రీనివాసరావు వియ్యంకులు కావడమే దీనికి కారణమన్నారు. ప్రతిపక్ష నేత జగన్ విద్యార్థులతో రకరకాల భేరీలు నిర్వహిస్తూ ప్రభుత్వాన్ని నిందించడం మినహా వారికి ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వలేకపోతున్నారన్నారు. చైతన్య, నారాయణ సంస్థలు నేటివి కావని, ప్రధానంగా నారాయణ సంస్థ ఆయన
రాజకీయాల్లోకి రాకముందు నుంచి నడుస్తున్నాయని రవికుమార్ అన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయంటూ విరుచుకుపడ్డారు. కోఆపరేటివ్ పేరిట విశృంఖలంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ఊరూవాడా వెలిశాయని అన్నారు. ఒకే అనుమతితో అడ్డగోలుగా మరో పది బ్రాంచీలను అదీ జానెడు ఖాళీ స్థలం లేని అపార్ట్‌మెంట్లలో విస్తరిస్తుంటే అధికారులు ఏమి చేస్తున్నారంటూ నిలదీశారు. తనకు తాను ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనుమతి కోసం ప్రయత్నిస్తే ఐదెకరాల స్థలం, అలాగే మరెన్నో నిబంధనలు చూపారంటూ విరుచుకుపడ్డారు. పార్కింగ్ స్థలం కాదు కదా ఒక్కో సెక్షన్‌లో 40 మందికి బదులు వందలాది పైగా ఉంటున్నారని అన్నారు. అగ్నిమాపక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు ఉండటం లేదన్నారు. కనీసం ల్యాబ్‌లు కూడా లేవన్నారు. బిజెపి ఫ్లోర్ లీడర్ పెన్మత్స విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థల్లో హాస్టల్స్, మరుగుదొడ్లు అధ్వాన్నంగా ఉంటున్నాయన్నారు. పలు హాస్టల్స్‌కు అనుమతుల్లేవని మంత్రి గంటా ఓ సారి స్వయంగా ఒప్పుకున్నారన్నారు. కేవలం ర్యాంకుల కోసం ఆదివారం సెలవు దినాల్లో కూడా తెల్లవారుజామున ఐదు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అదీ రెండో సంవత్సరం కోర్సును మొదటి సంవత్సరంలోనే బలవంతంగా పూర్తి చేయిస్తున్నారన్నారు. ఇక ఎలాంటి చదువులు లేని కోఆర్డినేటర్లు క్రమశిక్షణ పేరుతో ట్యూటర్లు, అధ్యాపకులపైనే పెత్తనం సాగిస్తున్నారంటూ భవిష్యత్తులో అధ్యాపకుల ఆత్మహత్యల గురించి కూడా వినాల్సి వస్తుందంటూ విష్ణుకుమార్ రాజు తీవ్రస్థాయిలోనే హెచ్చరించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వం నీరజారెడ్డి, తాజాగా చక్రపాణిలతో కమిటీలు వేసి ఈ ఆత్మహత్యలకు దారితీస్తున్న పరిస్థితులను గమనంలోకి తీసుకుందన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా నడిచే సంస్థలకు నోటీసులు జారీ చేశామ, ఇప్పటికే పలు సంస్థలకు రూ.50 లక్షలు వరకు జరిమానాలు విధించామన్నారు. ఇందులో చైతన్య, నారాయణ, ఎన్నారై విద్యాసంస్థలున్నాయని అన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత తమ చర్యలు మరింత కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు.