రాష్ట్రీయం

తెరాస... బీసీ కార్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: తెలంగాణలో తొలిసారిగా బీసీ వర్గాల ప్రజా ప్రతినిధులతో సిఎం కేసీఆర్ ఆదివారం విస్తృత సమావేశం నిర్వహించనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సమైక్యపాలనలో ఒక్క సిఎం కూడా బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. తెలంగాణలో బీసీ వర్గాలు రాజకీయంగా బలమైన ఓటు బ్యాంకు. ఈ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకే అయనా, తెరాస ప్రభుత్వం అధికారికంగా సమావేశం ఏర్పాటు చేయడాన్ని బీసీ సంఘాలు స్వాగతిస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో బీసీలు దాదాపు 60 శాతం ఉన్నారు. ఈ వర్గాల సమస్యలపై దృష్టి సారించి, ప్రజా ప్రతినిధులు ప్రస్తావించే అంశాలను సావధానంగా విని, బీసీల సముద్ధరణకు పెద్ద ఎత్తున కేసీఆర్ రానున్న రోజుల్లో వరాలు ప్రకటించే అవకాశం కనపడుతోంది. రాష్ట్రప్రభుత్వం బీసీ వర్గాల సముద్ధరణకు రకరకాల సంక్షేమ పథకాలతో భారీ ఎత్తున నిధులను వెచ్చించినా, అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల్లో చాలామంది వీటి గురించి ప్రజలకు వివరించడంలో విఫలమయ్యారు. ఇదే అధికార పార్టీలో పెద్దలోపంగా కనపడుతోంది. ప్రభుత్వం, పార్టీకి, బీసీలకు మధ్య పెరుగుతున్న అగాధాన్ని భర్తీ చేసేందుకు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.
మరో రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 2019 ఎన్నికలకు ముందు ఇదే చివరి బడ్జెట్. 2019లో వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. 2019 ప్రతి రాజకీయ పార్టీకి కీలకమైన సంవత్సరం. తెరాస ప్రభుత్వం ఇంతవరకు మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటు బీసీలకు బడ్జెట్‌లో తగినన్ని నిధులు ఇచ్చినా పెద్దగా ప్రచారం రాలేదు. మైనార్టీలకు, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపు, దళితుల సంక్షేమానికి సమైక్య పాలనలో కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలో అధిక సంఖ్యాకులుగా ఉన్న బీసీ వర్గాలను ఆకట్టుకునేందుకు సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న సమావేశంలో తమ వాణిని బలంగా
వినిపించేందుకు టిడిపి ఎమ్మెల్యే, బిసి సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్యతో పాటు పలు సంఘాలు కసరత్తు చేశాయి. అధికార పార్టీ తరఫున మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం మీటింగ్‌లో కేసీఆర్‌కు బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించేందుకు నివేదిక తయారు చేశారు. రాష్ట్రప్రభుత్వం ప్రధానంగా బీసీల్లో అత్యంత వెనకబడిన కులాలు (ఎంబిసి) వర్గాల సంక్షేమానికి, ఇతర బీసీలకు కూడా సముచితంగా జనాభాకు తగ్గట్టుగా నిధులు ఇవ్వాలనే సంకల్పంతో ముందడుగు వేస్తోంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించారు. ఈ సమావేశం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్‌లో నిర్వహించనున్నారు.
తెలంగాణ అవతరించిన తర్వాత 2016-17లో రూ.2538 కోట్లు, 2017-18లో రూ.5070.36 కోట్లను వెనకబడిన తరగతుల సంక్షేమానికి నిధులు కేటాయించారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో బిసిలు కీలక పాత్ర వహిస్తున్నారు. ఈ వర్గానికి చెందిన ఓటర్లు ఎటువైపు మొగ్గితే ఆ పార్టీ ఎన్నికల్లో గెలుపు ఖాయం. రాజకీయ సమీకరణను దృష్టిలో పెట్టుకుని మునుపెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న ప్రయత్నంపై విపక్ష పార్టీల్లో ఇప్పటికే ప్రకంపనలు మొదలయ్యాయి. పశుసంవర్ధక రంగం, చేపల పెంపకం, గొర్రెల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు. గొర్రెల పెంపకానికి రూ.4వేల కోట్ల నిధులు కేటాయించారు. చేపల పెంపకానికి రూ. 1000 కోట్ల నిధులు ఖర్చుపెడుతున్నారున. అత్యంత వెనకబడిన కులాలకు ఎంబిసి కార్పోరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఎంబిసి కులాలను బిసి కమిషన్ ఇంకా గుర్తించాల్సి ఉంది. ఈ ప్రక్రియను బిసి కమిషన్ వేగవంతం చేసింది. యాదవులు, గౌడ్‌లు, ముదిరాజ్‌లు, మున్నూరు కాపులు, పద్మశాలీలు, ఇంకా విశ్వకర్మలుగా పిలిచే కమ్మరి, కంచరి, వడ్రంగి, శిల్పాకారులు, మేర కులస్తులు, కల్లు, కుమ్మరి, నారుూబ్రాహ్మణులు, రజకులు, ఇతర బిసి వర్గాలు తెలంగాణ సమాజంలో ఉన్నాయి.
విదేశాల్లో చదువుకునే బిసి విద్యార్థులకు తోడ్పాటు అందించడానికి మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్‌సీస్ విద్యా నిధి పేర ప్రత్యేక ఆర్థిక తోడ్పాటు పథకాన్ని ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల చొప్పున 119 బిసి గురుకుల పాఠశాలలను ప్రారంభించారు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఖర్చుపెడుతున్న దాదాపు 46వేల కోట్ల రూపాయల్లో సగానికి పైగా బిసి వర్గాలకు ఫలాలు అందుతున్నాయని అంచనా. ఇందులో ఆసరా పెన్షన్లు, రెండు పడక గదుల ఇండ్లు, వ్యవసాయ రంగానికి విద్యుత్ సబ్సిడీ, ఫీజు రీ ఎంబర్స్‌మెంట్, చేనేత కార్మిక సంక్షేమం, చేపల పంపకం, గొర్రెల పంపకం వివిధ రంగాలకు రాష్ట్రప్రభుత్వం పెద్దగానే నిధులు కేటాయించి బిసి వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటోంది. 2019లో వివిధ బిసి వర్గాలతో భారీ ఎత్తున సభలను నిర్వహించే యోచనలో టిఆర్‌ఎస్ పార్టీ ఉందని తెలుస్తోంది. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెరాస ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి సీఎం కేసీఆర్ తలపెట్టిన బీసీ సెషన్‌పట్ల కృతజ్ఞతలు తెలిపారు.