రాష్ట్రీయం

కొట్టుకుపోరాదు కోటిలింగాల!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగనభట్ల రామకిష్టయ్య

మన చరిత్రను మనమే కప్పెట్టేసుకుంటున్నామా? శాతవాహనుల తొలి రాజధానిగా చరిత్ర పుటలకెక్కిన గోదావరి ఒడ్డు గ్రామాన్ని పరిరక్షించుకోలేమా? తవ్వుకుంటే చారిత్రిక సత్యాలనెన్నో దోసిటికి అందించగల చరిత్రకు పూర్వపు గ్రామం ప్రమాదపుటంచున పయనిస్తుంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తిరిగి కోటిలింగాలే చెప్పాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాచీన చరిత్రకు సాక్షీభూతంగా నిలిచిన కోటిలింగాల నేడు కాలగర్భంలో కలిసిపోతున్న వైనమే ఈ కథనం.
ధర్మపురి, డిసెంబర్ 2: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాక్చరిత్రకు నిలువుటద్దంగా నిలిచి, శాతవాహనుల తొలి రాజధానిగా చరిత్ర పుటలకెక్కిన కోటిలింగాల ఒడ్డు గోదావరి నీటి వల్ల నానాటికీ కోతకు గురవుతున్నది. తవ్వకాలు జరిపితే చారిత్రిక సత్యాలెన్నో వెలికి తీయగల చరిత్రకు పూర్వపుగ్రామం ప్రమాదపుటంచున పయనిస్తున్నది. స్థానికుల, దాతల చేయూతతో, ధర్మకర్తల మండలుల కృషితో, ప్రత్యేక నిధులను ప్రోగు చేసుకుని దేవస్థానాన్ని అభివృద్ధి పరుచుకున్నా, పర్యాటక శాఖ ఈ గ్రామంపై ఇంతకాలం చిన్నచూపే చూసింది. గతంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యాటక స్థలంగా తీర్చిదిద్దగలమని ఇచ్చిన హామీలు, ప్రకటనలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకులు, ఉన్నతాధికారులు, చారిత్రక విషయాసక్తులైన వ్యక్తులు, రాష్ట్ర చరిత్రలో ప్రధాన ప్రదేశమైన కోటిలింగాలలో, ప్రత్యేక అభివృద్ధి పనులు, ప్రాచీన చారిత్రక అవశేషాల సంరక్షణా చర్యలను చేపట్టడంపై, నిర్ణయాత్మక కార్యక్రమాలను చేపట్టడంలో అలసత్వానే్న ప్రదర్శించారు.
ఈకారణంగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాచీన చరిత్రకు సాక్షీభూతంగా నిలిచిన కోటిలింగాల నేడు కాలగర్భంలో కలిసి పోవడానికి సిద్దమైంది. శ్రీపాద పాజెక్టు నిర్మాణ చర్యలలో భాగంగా ఈచారిత్రిక గ్రామం రానురాను నీట మునిగే అవకాశం ఏర్పడింది. దీనితో ఈగ్రామం చరిత్ర పుటలనుండి కనుమరుగు కావడం అనివార్యంగా కనిపిస్తోంది. కోటిలింగాల గ్రామానికి పరిరక్షణ గోడల నిర్మాణ ప్రతిపాదనలను కాగితాలకే పరిమితం కాగా, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ చొరవ, టూరిజం చైర్మన్ పేర్వారం రాములు చేయూత ఫలితంగా కోటిలింగాల వద్ద గోదావరి నదిపై జలవిహారం కోసం రెండు నూతన బోట్లు చారిత్రక గ్రామానికి చేరుకోగా, డిసెంబర్ 4న ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే, అవిభక్త కరీంనగర్ జిల్లాకు 50వేల సంవత్సరాలకు పూర్వపు చరిత్ర ఉంది. చరిత్రలో ఆంధ్రులకు లభించినంతవరకు, శాతవాహనులదే మొట్టమొదటి రాజవంశమని, అదీ మహారాష్టల్రోని పైఠానోలేక నాసిక ప్రాంతమో అనుకుంటే కాదని, అంతకు ముందే వీరు ఆంధ్రులని, కరీంనగర్ జిల్లానే వారి మూలపురుషులకు ఆవాసస్థానమని, చారిత్రక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. శాతవాహన వంశానికి మూలపురుషుడని భావింపబడే శ్రీముఖుడు కోటిలింగాలను రాజధానిగా చేసుకుని పాలించాడని స్పష్టమై, ఆయన నాణాలు కోటిలింగాలలోలభ్యమైనాక చరిత్రలో నూతన
అధ్యాయానికి నాంది పలికింది. జిల్లా కేంద్రమైన కరీంనగర్‌కు 65కి.మీ.ల, ధర్మపురి క్షేత్రానికి 19కి.మీ.ల దూరాన వెల్గటూరు మండలంలోని గోదావరి, పెద్దవాగు సంగమ స్థానమందుగల కోటిలింగాలలోని పుట్టకోట గోడలు (పూర్వపుకోటలు) ఆంధ్రదేశ పాలకులైన శాతవాహనుల తొలి రాజులకు ఆటపట్టయినవి. ఆంధ్రుల తొలిరాజుగా పురాణాల్లో వర్ణించబడిన శ్రీముఖ చక్రవర్తి నాణాలను, కప్పారావుపేట సమీపాన, ధర్మపురి వాస్తవ్యులు, ప్రముఖ చారిత్రక పరిశోధకులు, పురావస్తుశాఖలో ఎపిగ్రాఫిక్ అసిస్టెంటు (శాసన వ్యాఖ్యాత)గా పనిచేస్తూ మరణించిన సంగనభట్ల నరహరిశర్మ సేకరించి, పురావస్తుశాఖకు అప్పగించడంతో, ఈప్రాంత ప్రాశస్త్యం వెలుగు చూడగలిగింది. శాతవాహన కాలానంతరమైనట్టి ఉద్యోగ వర్గానికి చెందిన ‘మహాతలవర, మహాసేనాధిపతిస’ అను నాణెములు ఇచ్చట లభించినవి. విదిశా నగరమును కేద్రముగా ఏలిన చివరి శుంగరాజుల నాణెములు లభింగా వాటిపై బ్రాహ్మీలిపిలో ‘ రఙగోబదస, రఙసమగోపస’ అని వ్రాసి ఉన్నవి. శుంగుల అనంతరం మగధనేలారని పురాణాల్లో పేర్కొనిన కాణ్వరాజుల నాణెములుకూడా లభించాయి. వీటి ఆధారంగా పురాణములందు పేర్కొనినట్లు మగధరాజ్యమును వౌర్యుల అనంతరం శృంగులు, కాణ్వులు పిదప ఆంధ్రులు వరుసగా పాలించినట్లు తార్కాణ మిచ్చుచున్నదని పురావస్తుశాఖ మాజీ డైరక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్ర్తీ సోదాహరణంగా నిరూపించారు. వీటిలో కొన్ని కోటిలింగాల పొలములలోబ్రాహ్మీలిపి లోని శిలా ఫలకాలు వెలుగు చూశాయి. ఇచట లభించినట్టి అపురూప నాణెములు వేరెచ్చటా లభించని కారణంగా, కోటిలింగాల శాతవాహనులకు తొలి రాజధానియని, పరిసర ప్రాంత కేంద్ర స్థానమని స్పష్టమైంది. కోటిలింగాలలోనే నరహరిశర్మ పంచమార్క్ నాణాలు, ఇతర అపురూప నాణాలు సేకరించి పురావస్తు శాఖకు హస్తగతం చేశారు. వానిలో రఙశాతవాహ, రఙసాతకంనిస అని బ్రాహ్మీలిపిలో వ్రాయబడినవి. లిపి ప్రకారం శ్రీముఖుని కన్నా ఇవి ప్రాచీనమైనవి. సహజంగా ఉండవలసిన ఉజ్జయిని చిహ్నం వీటిలో లేదని నరహరి పరిశోధనలో పేర్కొన్నారు. శాతవాహన కాలపుపొరలలో అనేక శాతవాహన నాణాలు లభించాయి. లభ్యమైన నాణెములనుబట్టి శాతవాహవంశ మూలపురుషుడైన శాతవాహనుడు ఆంధ్రగోపులను, శబరులను, మహాతలవరులను, తదితర ఆంధ్ర రాజులను ఓడించి శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. శాతవాహనులు తొలుత ఆంధ్రుల పాలనలో భాగమై, ఆంధ్ర భృత్యులుగా ఉండి, బలవంతులై సామ్రాజ్య స్థాపనకు పూనుకున్నారని, శ్రీముఖుడే చివరి కాణ్వరాజును అంతమొందించి, స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచి, విస్తరించారని జగిత్యాలకు చెందిన ప్రముఖ చారిత్రక పరిశోధకులు, రిటైర్డ్ రీడర్ డాక్టర్ జైశెట్టి రమణయ్య కరీంనగర్ చరిత్ర సంస్కృతి గ్రంథంలో వర్ణించారు. హాల చక్రవర్తిగాథా సప్తశతిలోని గోదావరీ వర్ణన ఆధారంగా, లభ్యమైనట్టి సిముఖ నాణాలను బట్టి కోటిలింగాల, శాతవాహనుల బలిష్ఠ దుర్గమని తెలియుచున్నది. కోటిలింగాల సమీపమునగల గుట్ట జైనమునుల కావాస స్థానముగ నుండేదని తెలుస్తున్నది. సమీపాన క్రీ.పూ.రెండవ శతాబ్దపు బౌద్ధ స్థూపం పాషాయిగాం గుట్టపైన ఉండేది. ప్రస్తుతం మధ్యయుగానికి చెందిన దేవాలయం గ్రామంలోఉంది. రెండు గర్భగృహాలకు ఉమ్మడి మంటపముంది. ప్రతి గర్భగృహంలో అంతరాళం ఉంది. ప్రధానాలయంలో కోటీశ్వరుడు లింగరూపుడుగా ప్రతిష్ఠితుడుకాగా, దక్షిణ దిశలో ఉత్తర ముఖ గర్భగృహంలో సిద్ధేశ్వరుడు లింగరూపుడై ఉన్నాడు. ఆలయం చాళుక్య కళారీతులలోనుండి గోదావరి ఒడ్డున అనేక శిల్ప ప్రతిమలున్నాయి. పురావస్తు శాఖచే త్రవ్వకాలు జరపబడి, పర్యాటక శాఖ గుర్తింపు పొందిందీ ప్రదేశం.
చారిత్రక గ్రామం ముంపు ప్రమాదాన్ని ఆలస్యంగానైనా గ్రహించిన జిల్లా మేథావి వర్గం కోటిలింగాలను పరిరక్షించే చర్యలు గైకొనాలని ప్రభుత్వానికి విన్నవించింది. రాష్ట్ర రాజధాని నుండి సైతం ఈఅంశంపై అవగాహన కలిగిన దివంగత ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, మల్లేపెల్లి లక్ష్మయ్య, ఆచార్య జయధీర్ తిరుమలరావు, డాక్టర్ రాజరెడ్డి, ఐకాస కన్వీనర్ కోదండరాం, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవిత, కవి గాయకులు దేశిపతి శ్రీనివాస్ లాంటి మేథావులను రప్పించి, కోటిలింగాల పరిస్థితిని ప్రత్యక్షంగా చూపించి తద్వారా గత ప్రభుత్వం దృష్టిని ఆకర్షించి, పరిరక్షించే ప్రయత్నం చేసింది. అపురూప నాణాలు లభ్యమైన కోటిలింగాల గ్రామం ఖాళీ అయితే త్రవ్వకాలకు మరింత సానుకూలత ఉండగలదనే ప్రతిపాదన అందుకున్న రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ చెన్నారెడ్డి అందుకు సానుకూలంగా స్పందించి, కోర్ కమిటీ నిర్ణయాన్ని అనుసరించి త్రవ్వకాలు జరిపేలా కృషి సల్పగలమని ప్రకటించి నామమాత్రపు త్రవ్వకాలు చేపట్టి చేతులెత్తేయడమూ జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు ముంపుకు గురికాకుండా ఆలంపూర్‌లో నిర్మించినట్లు, కోటిలింగాల పరిరక్షణా గోడలు నిర్మించాలనే ప్రతిపాదన చాలాకాలంగా కాగితాలకే పరిమితమైంది. మేధావి వర్గ ప్రయత్నానికి జిల్లాకు చెందిన అమాత్యులు, వివిధ పదవులలోనున్న నేతలు, వివిధ పార్టీల నాయకులు, ముఖ్యంగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరోధించే ఏకైక లక్ష్యంతో తెరాసను స్థాపించిన, ఆపార్టీ అధినేత, ప్రస్తుత సిఎం కేసిఆర్ చేయూత నందించి, రాష్ట్ర చరిత్రతో విడదీయరాని సహస్రాబ్దుల సంబంధాన్ని కలిగిన అపురూప చారిత్రిక బంధాన్ని, తత్సంబంధ ఆధారాలను పరిరక్షించి, కోటిలింగాల ఉనికిని కరుమరుగు కాకుండా ఉండగల చర్యలు గైకొనేందుకు ప్రభుత్వాధినేతగా ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉన్నాయి.
*

చిత్రాలు..కోటిలింగాల గ్రామంలోని మధ్యయుగంనాటి కోటీశ్వరాలయం
*ఇటీవలి తవ్వకాలలో బయల్పడ్డ ప్రాచీన నిర్మాణాలు
*ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పర్యాటక శాఖ బోట్లు