రాష్ట్రీయం

ఐఏఎస్‌ల సవారీ సాహసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 2: ఈ సీజన్‌లో మంచుదుప్పటి కప్పుకునే ఆదిలాబాద్‌లో వేకువజామున ఇంటిగడప దాటడానికీ ఎవరూ సాహసించరు. అలాంటిది గడ్డకట్టే చలిలో ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి బుద్దప్రకాష్‌జ్యోతి, నిర్మల్ కలెక్టర్ ఇల్లంబర్ది ఏకంగా 25 కిలోమీటర్ల దూరం వరకు సైకిల్‌పై సవారీ చేసి ఆశ్చర్యపర్చారు. ప్రతి ఆదివారం ఇద్దరు ఐఏఎస్‌లు ఆటవిడుపుగా వ్యాయామం, కాలి నడక, జిమ్‌లో సాధనవంటివి చేయడం పరిపాటి. అయితే శనివారం వేకువజామున సైకిల్‌పై మహారాష్ట్ర సరిహద్దు వరకు చుట్టిరావాలని నిర్ణయించుకున్న బుద్దప్రకాష్ జ్యోతి, ఇల్లంబర్ది అనుకున్నదే తడవుగా ఉదయం 5.30కు 6.8 డిగ్రీల చలిలో సాహసయాత్రకు ఒడిగట్టారు. ఆదిలాబాద్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి బయల్దేరిన వీరిద్దరూ జాతీయ రహదారి గుండా సైకిల్‌పై వెళ్తూనే జైనథ్ మండలం మారుమూల కోర్ట, మహారాష్ట్ర పరిధిలోకి వచ్చే చెనాక వరకు 25 కి.మీటర్లు ప్రయాణం సాగించారు. పనిలో పనిగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చెనాకకోర్ట బ్యారేజీ పనులను పర్యవేక్షించారు. కోర్ట వద్ద నిర్మిస్తున్న బ్యారేజీ పుట్టింగ్ పిల్లర్లు, వాటర్
స్టోరేజీ నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా 50 వేల ఎకరాలకు సాగునీరందించే పెన్‌గంగా నదీతీరంలో నీటి లభ్యత, బ్యారేజీ పనుల పురోగతిపై ఆదిలాబాద్ కలెక్టర్ బుద్దప్రకాష్ నిర్మల్ కలెక్టర్‌కు వివరించారు. అంతటితో ఆగకుండా కాల్వల నిర్మాణ పనులను రాళ్ళగుట్టలను లెక్కచేయకుండా సైకిల్‌పైనే పర్యవేక్షించడం గమనార్హం. అక్కడే ఉన్న ఇరిగేషన్ డీఈ, ఏఈలను పలకరించి పనుల గురించి ఆరా తీశారు. గడవులోగా పనులు పూర్తిచేయాలని, కూలీల సంఖ్య పెంచాలని కలెక్టర్ బుద్ద ప్రకాష్ సూచించారు. ఉదయం 5.30 నుండి 9.30 గంటల వరకు సైకిల్ సాహస యాత్ర ముగించుకొని ఆదిలాబాద్‌కు తిరిగివచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరు కలెక్టర్లు మాట్లాడుతూ చలికాలంలోనూ ప్రతి వ్యక్తి వ్యాయామం చేయాలని, సైకిల్ వ్యాయామం వల్ల ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియజెప్పేందుకే 25 కిలోమీటర్లు వెళ్లామని, తమకు ఎలాంటి ఇబ్బంది కలగకపోగా ఉల్లాసం కలిగించిందన్నారు. పచ్చదనం పరుచుకున్న అటవీ గుట్టల వధ్య ఏకాంతంగా సైకిల్‌పై వెళ్ళడం తమకు ఉత్సాహాన్ని ఇచ్చిందని బుద్ద ప్రకాష్ తెలిపారు.

చిత్రం..జందాపూర్ క్రాస్‌రోడ్డు జాతీయ రహదారిపై సైకిల్ సవారి చేస్తున్న కలెక్టర్లు బుద్ద ప్రకాష్, ఇల్లంబర్ది