రాష్ట్రీయం

డామిట్..కథ అడ్డం తిరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 2: బీజేపీ మాజీ నాయకుడు భరత్‌రెడ్డి ఇద్దరు దళిత యువకుల పట్ల దాష్టీకానికి పాల్పడిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కిడ్నాప్‌కు గురైనట్టు భావిస్తున్న ఇద్దరు యువకులు రాజేశ్వర్, లక్ష్మణ్ ఆచూకీని ఎట్టకేలకు పోలీసులు పసిగట్టి వారిని సురక్షితంగానే ఇళ్లకు చేర్చినప్పటికీ, బాధిత యువకులు మీడియా సమక్షంలో చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలతో మరింత గందరగోళ పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నం శివారులో లక్ష్మణ్, రాజేశ్వర్ మొరం తవ్వకాలను అడ్డుకున్నారని భరత్‌రెడ్డి వారిపై దాడి చేసి మురుగునీటి గుంతలో మునకలు వేయించడం, ముక్కు నేలకు రాయించిన దృశ్యాలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం విదితమే. అప్పటినుండి అజ్ఞాతంలోకి వెళ్లిన భరత్‌రెడ్డి, తన వెంట బాధిత యువకులను కూడా హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. రెడ్డిపై నవీపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు కిడ్నాప్ కేసు నమోదైంది. 18 రోజుల అనంతరం ఎట్టకేలకు శుక్రవారం హైదరాబాద్‌లో పోలీసులు వారి ఆచూకీని తెలుసుకుని, తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయతే భరత్‌రెడ్డి తమపై దాడి చేయలేదని, దొరల రాజ్యం పేరుతో తీస్తున్న సినిమా షూటింగ్ కోసం తాము మురుగు నీటి గుంతలో మునిగిన సన్నివేశాల్లో నటించామని చెప్పారు. బాధితులను పోలీసులు శుక్రవారం రాత్రే వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇది జరిగి కొన్ని గంటలు గడవకముందే లక్ష్మణ్, రాజేశ్వర్ శనివారం మళ్లీ తమ కథనాన్ని మార్చివేశారు. భరత్‌రెడ్డి తమపై దౌర్జన్యానికి పాల్పడింది ముమ్మాటికీ వాస్తవమేనని మీడియా సమక్షంలో వెల్లడించారు. భరత్‌రెడ్డి చెర నుండి సురక్షితంగా బయటపడేందుకే తాము ‘సినిమా షూటింగ్’ కట్టు కథ అల్లామని పేర్కొన్నారు. మొరం తవ్వకాలను అడ్డుకున్నామనే రెండు మాసాల క్రితం భరత్‌రెడ్డి తమ పట్ల అమానవీయంగా ప్రవర్తించాడని, ఈ వీడియోలు సోషల్ మీడియాలో బయటకు పొక్కిన వెంటనే తమను పది నిమిషాలు మాట్లాడేది ఉందంటూ గ్రామ శివారు ప్రాంతానికి పిలిపించాడని తెలిపారు. అక్కడి నుండి బలవంతంగా వాహనంలో హైదరాబాద్‌కు వెంట తీసుకెళ్లి రహస్య ప్రాంతంలో ఉంచాడని వివరించారు. తమ వెంట గ్రామానికి చెందిన రాజన్న అనే వ్యక్తిని కూడా తీసుకువచ్చి మూడు రోజుల తరువాత పంపించివేశాడని తెలిపారు. ఐదు రోజుల అనంతరం హైకోర్టులో పిటిషన్ అని చెప్పి తమచే ఏవేవో కాగితాలపై సంతకాలు తీసుకున్నాడని అన్నారు. భరత్‌రెడ్డి చెర నుండి బయటపడేందుకు అతను సూచించిన విధంగానే సినిమా షూటింగ్‌లో నటించిన సన్నివేశాలుగా అబద్ధం చెప్పాల్సి వచ్చిందన్నారు. తమకు భరత్‌రెడ్డి నుండి ప్రాణభయం ఉన్నందున రక్షణ కల్పించాలని బాధిత యువకులు వేడుకున్నారు. ఇకముందు తమకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని, ఒకవేళ తమకేదైనా హాని వాటిల్లితే భరత్‌రెడ్డిదే బాధ్యత అని అన్నారు. కాగా, దళిత సంఘాల నాయకులు శనివారం అభంగపట్నం చేరుకుని లక్ష్మణ్, రాజేశ్వర్‌లను పరామర్శించి ధైర్యం చెప్పారు. పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు తామంతా అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. వారిని నవీపేట పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఎస్‌ఐ నరేష్‌కు జరిగిన సంఘటనల పరిణామాలపై బాధిత యువకులతో వివరింపజేస్తూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయించారు.

చిత్రం..కిడ్నాప్‌కు గురై 18 రోజుల అనంతరం ఇళ్లకు చేరుకుని కుటుంబ సభ్యులను కలుసుకున్న బాధిత యువకులు రాజేశ్వర్, లక్ష్మణ్