రాష్ట్రీయం

కొలువుల కొట్లాట నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: ‘కొలువుల కొట్లాట’ పేరిట టి.జెఎసి సోమవారం (4న) సభ నిర్వహించనుండగా, ఆదివారం మధ్యాహ్నం ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలోనే మానేరు వసతి గృహంలో విద్యార్థి మురళి ఆత్మహత్య చేసుకోవడంతో మరింత ఉత్కంఠ నెలకొంది. మురళి ఆత్మహత్యకు సరైన కారణాలు ఏవీ తెలియకపోయినప్పటికీ, నిరుద్యోగ సమస్యతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని సహచర విద్యార్థులు ఆందోళనకు దిగారు. టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ అధ్వర్యంలో అసలే ‘కొలువుల కొట్లాట’కు నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రానున్నారన్న సమాచారం నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వానికి వచ్చింది. ఈ సమయంలోనే విద్యార్థి మురళి ఆత్మహత్యతో టి.జెఎసి సభకు మరింత మంది వెళ్ళే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
రెచ్చగొట్టినా.. రెచ్చిపోవద్దు: కోదండరామ్
‘కొలువుల కొట్లాట’ను భగ్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా ప్రయత్నించే అవకాశం ఉందని ప్రొఫెసర్ కోదండరామ్ అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే తాము ప్రభుత్వం అనుమతించకపోయినా, తాము కోర్టు ద్వారా సాధించుకున్నందున
ఆ కక్షతో ప్రభుత్వం ఉందన్నారు. కాబట్టి పోలీసులను ఉపయోగించి, కవ్వింపు చర్యలకు పాల్పడి ఏదో రకంగా భగ్నం చేసే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఉదాహరణకు జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియానికి వచ్చేందుకు వీలుగా నిరుద్యోగ యువకులు, విద్యార్థులు ముందుగానే బస్సుల కోసం అడ్వాన్స్‌లు చెల్లించినా, చివరి నిమిషంలో అధికారులు తాము ఇవ్వలేమంటూ చేతులు ఎత్తేసినట్లు పలు జిల్లాల నుంచి ఫోన్లు వచ్చాయని ఆయన తెలిపారు. జిల్లాల నుంచి వచ్చే వాహనాలను పోలీసులు నిలిపి వేసే ప్రమాదం ఉందన్నారు. అటువంటి సమయంలో ఉన్నతాధికారులతో మాట్లాడి, సామరస్యంగా చర్చించి స్టేడియానికి రావాలే తప్ప పోలీసులతో ఘర్షణ పడరాదని ఆయన సూచించారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే తనను కానీ జెఎసి ఇతర నాయకులను కానీ సంప్రదించాలని ఆయన తెలిపారు. పోలీసుల కవ్వింపు చర్యలను గమనించి జాగ్రత్తగా మసలుకోవాలని అన్నారు.
ఆదరా-బాదరగా నోటిఫికేషన్లు
రాష్ట్ర ప్రభుత్వం ఆదరా-బాదరగా ఈ మూడేళ్ళలో 75 నోటిఫికేషన్లు జారీ చేసి, 156 సార్లు పరీక్షలు నిర్వహించి చివరకు 16 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని ఆయన తెలిపారు. ఇందులో 10 వేలు పోలీసు శాఖకు సంబంధించినవే ఉన్నాయని అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఆదరా-బాదరగా నోటిఫికేషన్లు జారీ చేయడంతో అనేక నోటిఫికేషన్లపై కోర్టుల్లో కేసులు పడ్డాయని, దీంతో నియామకాలు నిలిచి పోయాయని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ఏడాదిలోగా లక్షా 7 వేల ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, చివరకు మూడేళ్ళలో చేసింది 16 వేలేనని అన్నారు. కాబట్టి ఉద్యోగ నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచాలన్న ఉద్ధేశ్యంతోనే ‘కొలువుల కొట్లాట’ సభ నిర్వహించాలని సంకల్పించామని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా సభ నిర్వహించుకోవడానికి కూడా అవకాశం లేకుండా ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించిందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాము కోర్టును ఆశ్రయించి, అనుమతి పొందామని, ఇది నిరుద్యోగ యువత సాధించిన విజయమని ఆయన అన్నారు.
బతికి ఉండి సాధించుకోవాలి
ఉద్యోగాలు వస్తాయో, లేదో కుటుంబ పోషణ ఎలా? అనే మానసిక వత్తిడితో నిరుద్యోగ యువకుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నదని ప్రొఫెసర్ కోదండరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత నారాయణ్‌ఖేడ్, తొర్రూరు, అసిఫాబాద్, ఆదిలాబాద్‌లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి మురళి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న అంశం ఇంకా తేటతెల్లం కాలేదని ఆయన తెలిపారు. నిరుద్యోగులు, విద్యార్థులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడరాదని, బతికి సాధించుకోవాలే తప్ప, ఆత్మహత్య చేసుకుంటే ప్రయోజనం ఉండదన్నారు.
అఖిలపక్షం హాజరు..
నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాటం చేసేందుకు తాము సంకల్పించిన కొలువుల కొట్లాట సభకు అన్ని పార్టీలూ, ప్రజా సంఘాలు మద్ధతునిచ్చాయని ఆయన తెలిపారు. ప్రజాగాయకుడు గద్దర్, జస్టిస్ చంద్రకుమార్, విమల, టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి, బిజెపి నాయకులూ హాజరుకానున్నారని ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు. ఈ సభలో ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని, ఇంకా పలు తీర్మానాలూ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
చిత్రం..హైదరాబాద్‌లో ఆదివారం విలేఖరులతో మాట్లాడుతున్న టి.జెఎసి చైర్మన్ కోదండరామ్