రాష్ట్రీయం

తెలుగు ఉప్పొంగేలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: తెలంగాణ ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా ప్రపంచ తెలుగు మహాసభలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ జీవన సౌందర్యాన్ని ప్రపంచానికి తెలిపేలా రెండున్నర కోట్లతో ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఎల్‌బి స్టేడియంలో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారు రమాణా చారి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, సాహిత్య అకాడమి చైర్మన్ నందిని సిధారెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ప్రభుత్వ గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ఎ శ్రీ్ధర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్ ప్రభాకరరావు, స్పోర్ట్సు అథారిటీ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. 15 నుండి 19వ తేదీ వరకూ జరిగే తెలుగు మహాసభలు ప్రధాన కార్యక్రమాలు ఎల్‌బి స్టేడియంలో జరుగుతాయని మంత్రి వివరించారు.
సభల నిర్వహణకు సీఎం కోర్ కమిటీని నియమించారన్నారు. వచ్చే అతిథులకు, సభా నిర్వహణ, వేదిక, అలంకరణ, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు వివిధ కమిటీలు ఏర్పాటుకావడంతోపాటు పని కూడా మొదలు పెట్టామన్నారు. కమిటీలకు ఇప్పటికే వాటి బాధ్యతలు, జాబ్ చార్ట్, మైక్రో లెవెల్ ప్లానింగ్ ఉన్నాయన్నారు. తెలుగు మహాసభలకు ఇప్పటికే సిఎం కెసిఆర్ 50 కోట్లు మంజూరు చేశారని, ఈ నిధులు వేదికల ఏర్పాటు, అలంకరణ, అతిథుల వసతులు, సౌకర్యాల కోసం ఖర్చు చేస్తామన్నారు. 7న మరోమారు సచివాలయంలో సమావేశం
నిర్వహిస్తామని కడియం వెల్లడించారు.
6.9వేల మంది ప్రతినిధులుగా నమోదు
ప్రపంచ తెలుగు మహాసభలకు 6900 మంది తమ పేర్లను ప్రతినిధులుగా నమోదు చేసుకున్నారని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. ప్రతినిధుల నమోదు కార్యక్రమం మంగళవారం రాత్రితో ముగిసిందని, ఆన్‌లైన్ ద్వారా 4,293 మంది, నేరుగా 2,611 మంది పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తామని, మహాసభల ప్రాంగణాల వద్ద ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతినిధులందరికీ మధ్యాహ్న భోజనం, రవాణ సౌకర్యాలు ఉచితంగా అందిస్తామన్నారు. బస చేసేందుకు ప్రతినిధులు కోరిన హోటళ్లలో తక్కువ ధరలకు గదులు కేటాయిస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ కమిటీలను సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసిందని సిధారెడ్డి వివరించారు. పద్యకవిత కమిటీ, వచన కవిత కమిటీ, కథాసాహిత్య కమిటీ, సాహిత్య విమర్శ కమిటీలను ఏర్పాటు చేశారు.
62మంది పేర్లతో తోరణాలు
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 62 మంది ప్రముఖుల పేర్లతో హైదరాబాద్‌లోని వేర్వేరుచోట్ల తోరణాలను ఏర్పాటు చేస్తున్నారు. హాల చక్రవర్తి, పంప మహాకవి, మల్లియ రేచన, విద్యానాథుడు, పాల్కూరికి సోమన, బమ్మెర పోతన, గోన బుద్ధారెడ్డి, కవయిత్రి కుప్పాంబిక, గౌరన, మారన, మడికి సింగన, కొరవి గోపరాజు, కామినేని మల్లారెడ్డి, సింహగిరి కృష్ణమాచార్యులు, సర్వజ్ఞసింగభూపాలుడు, చరిగొండ ధర్మన్న, ఏకామ్రనాథ, మరిగంటి సింగరాచార్యులు, అద్దంకి గంగాధర కవి, పొన్నగంటి తెలగన్న, సారంగుతమ్మయ, సురభి మాధవరాయలు, ఎలకూచి బాలసరస్వతి, భక్తకవి రామదాసు, శేషప్ప కవి, వరకవి సిద్ధప్ప, రాకమచర్ల వేంకటదాసు, దున్న ఈద్దాసు, గడ్డం రామదాసు, సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట అళ్వారుస్వామి, రావిచెట్టు రంగారావు, పజాకవి కాళోజి, ఒద్దిరాజు సోదరులు, బండారు అచ్చమాంబ, బూర్గుల రామకృష్ణారావు, పి.వి. నరసింహారావు, దాశరథి కృష్ణమాచార్య, డాక్టర్ సి. నారాయణరెడ్డి, డాక్టర్ బిరుదురాజు రామరాజు, పాకాల యశోదారెడ్డి, నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ, శ్రీనాథ మహాకవి, అల్లసాని పెద్దన, వేమన, తిరుపతి వేంకటకవులు, అన్నమాచార్య, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ, గుర్రం జాషువా, గంగుల శాయిరెడ్డి, పల్లా దుర్గయ్య, వానమామలై వరదాచార్యులు, అరిగె రామస్వామి, దైదవేములపల్లి దేవేందర్, అలిశెట్టి ప్రభాకర్, మల్క్భిరాముడు, గూడ అంజయ్య పేర్లతో తోరణాలను ఏర్పాటు చేస్తున్నామని నందిని సిధారెడ్డి తెలిపారు.

చిత్రం..ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తదితరులు