రాష్ట్రీయం

అద్భుతంగా నిర్వహిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: ఈ నెల 15 నుండి 19 వరకు హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు అద్భుతమైన రీతిలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. మహాసభల ఏర్పాట్లపై మంగళవారం ఆయన ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎల్‌బి స్టేడియంలో ప్రధాన వేదికను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. నగరం మొత్తంలో దాదాపు 100 మంది రచయితలు, కవుల పేర్లతో తోరణాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సభల నిర్వహణకు వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. 40 దేశాల నుండి 400 మంది ప్రతినిధులు వస్తున్నారని, దేశంలోని 15 రాష్ట్రాల నుండి 1500 మంది ప్రతినిధులు వస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఆరువేల మంది ప్రతినిధులుగా నమోదయ్యారన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఒక్కో ప్రతినిధికి ఒక బ్యాగ్ ఇస్తామని, అందులో వారి గుర్తింపుకార్డు, కరదీపిక (బ్రోచర్), మూడు పుస్తకాలు ఉంటాయన్నారు. పోతన భాగవతంపై డాక్టర్ సి.నారాయణరెడ్డి రాసిన మందార మకరందాలు అనే పుస్తకం, వాక్భూషణం భూషణం అన్న పుస్తకాలతో పాటు తెలుగు భాష, తెలుగు సంస్కృతికి సంబంధించిన మరొక పుస్తకం ఈ కిట్‌లో ఉంటాయన్నారు. తెలుగు నెలలు, కార్తెలు తదితర వివరాలతో ఈ పుస్తకాన్ని రూపొందించామన్నారు.
ఇప్పటి వరకు ఎలాంటి ప్రాధాన్యత లభించని తెలంగాణ కవులు, రచయితలకు అత్యంత ప్రాధాన్యత ఈ మహాసభల్లో ఇస్తున్నామని సిధారెడ్డి తెలిపారు. వంద మంది కవులు, రచయితలతో నగరంలో తోరణాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతినిధులందరికీ వసతి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. అలాగే వేదికల వద్దనే మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. హైదరాబాద్ బిర్యానీతో పాటు తెలంగాణ వంటలన్నీ సిద్ధం చేస్తున్నామన్నారు. సాధారణ ప్రజల కోసం ఎల్‌బి స్టేడియం వెలుపల 60 ఆహార స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ తక్కువ ధరలపై ఆహారం అందిస్తున్నామన్నారు.
వేర్వేరు సమయాలు
ఎల్‌బి స్టేడియంలోని ప్రధాన వేదిక వద్ద తొలిరోజు సాయంత్రం 5 గంటలకు ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమవుతాయని, రాత్రి 9.30 వరకు ఇవి కొనసాగుతాయని తెలిపారు. భారత ఉపరాష్టప్రతి ఎం. వెంకయ్యనాయుడు ఈ సభలను ప్రారంభిస్తారని, గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు తాను (సిధారెడ్డి) కూడా మట్లాడతామన్నారు. తొలిరోజు
తెలంగాణ ప్రాధాన్యతకు సంబంధించిన చలనచిత్ర ప్రదర్శన ఉంటుందని, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. రోజూ సాయంత్రం 5 గంటల నుండి సాహిత్య, సాంస్కృతిక సదస్సులు ఉంటాయన్నారు. ముగింపు కార్యక్రమంలో రాష్టప్రతి రామనాథ్ కోవింద్ పాల్గొంటారన్నారు. ప్రతినిధులతో పాటు మరొక 25 వేల మంది సాధారణ ప్రజలను ఎల్‌బి స్టేడియంలో కార్యక్రమాలు చూసేందుకు అనుమతిస్తున్నామన్నారు.
తెలుగు విశ్వవిద్యాలయం, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, రవీంద్రభారతి, మినీ హాల్ (రవీంద్రభారతి)లలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాన వేదిక వద్ద నిర్వహించే సమయాలు, ఇతర వేదికల్లో నిర్వహించే సమయాలు వేర్వేరుగా ఉంటాయి. ఉపవేదికల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటలవరకు వివిధ కార్యక్రమాలు ఉంటాయి.
200 పుస్తకాల ఆవిష్కరణ
మహాసభల సందర్భంగా దాదాపు 200 పుస్తకాలను ఆవిష్కరిస్తున్నామని సిధారెడ్డి తెలిపారు. తెలంగాణ అకాడమీ ప్రచురించిన 70 పుస్తకాలు, సాహిత్య అకాడమీ ప్రచురించిన 15 పుస్తకాలు, తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన 10 పుస్తకాలు, తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ప్రచురించిన 10 పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరిస్తున్నారు. కొంత మంది రచయితలు తాము రాసిన పుస్తకాలను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించే అవకాశం ఇమ్మని కోరారని, అలాంటి వారికి అవకాశం ఇస్తున్నామన్నారు. చేతన్ ప్రకాశ్ సేకరించిన ఆరువేల సామెతలతో మరొక పుస్తకాన్ని ప్రచురించి విడుదల చేస్తున్నామని తెలిపారు.
విరసంకు ఆహ్వానం
ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరిస్తున్నామంటూ విప్లవ రచయితల సంఘం (విరసం) ప్రకటించడం శోచనీయమని సిధారెడ్డి పేర్కొన్నారు. ఈ సభలు సామాన్య ప్రజలు చేసుకుంటున్న పండగ అన్నారు. విరసం సభ్యులు ఈ సభల్లో పాల్గొనాలంటూ తాను కోరుతున్నానని పేర్కొన్నారు. తప్పు, ఒప్పులను ఎత్తిచూపే సమయం, సందర్భంగా ఇది కాదన్నారు. విరసం సభ్యులంతా సహృదయంతో ఆలోచించి బహిష్కరణ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు.