రాష్ట్రీయం

మెగా హైడల్ @ 2022

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 17: ప్రతిష్ఠాత్మకమైన పోలవరం మెగా జల విద్యుత్కేంద్రం నిర్మాణాన్ని 2022 మార్చి నాటికి పూర్తి చేయాలని ఏపీ జెన్కో అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని, విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో నాణ్యతను పాటించాలన్నారు. వివిధ ఇంధన ప్రాజెక్టుల పురోగతిపై విజయవాడ నుంచి టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం సమీక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఇటీవలి కాలంలో విద్యుదుత్పత్తిలో మిగులున సాధించినప్పటికీ వచ్చే పాతికేళ్లలో వచ్చే అదనపు అవసరాలు, పారిశ్రామిక డిమాండ్‌ను తీర్చగలగాల్సి ఉందన్నారు. విశ్వస్థాయిలో నిర్మించనున్న రాజధాని అమరావతి అవసరాలను గమనంలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, పర్యావరణ హితమైన సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడం ఇప్పుడు ప్రాపంచిక విధానంగా మారిందని చెప్పారు. ‘సుస్థిర ప్రాతిపదికపై 40 నుంచి 45 శాతం పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంది. అంతేకాదు థర్మల్ విద్యుత్ కేంద్రాలు వెదజల్లే కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించేందుకు విశ్వస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సూపర్ క్రిటికల్ బాయిలర్లను ఏర్పాటు చేసి మన థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఆధునికీకరించాల్సి ఉంది. క్లీన్ అండ్ గ్రీన్ విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్ రికార్డులు సృష్టించింది. ఇంధన సామర్థ్యం, పరిరక్షణలో వరుసగా మూడేళ్ల నుంచి జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులను సాధించడం ద్వారా హ్యాట్రిక్ నమోదు చేసింది. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తితో సరాసరి 25 శాతం లోడ్ డిమాండ్‌ను తట్టుకోగల సామర్థ్యం సాధించడం ద్వారా మనం కాలిఫోర్నియాకు చేరువ కావటం నాకెంతో సంతోషంగా ఉంది. కాలిఫోర్నియాలో పవన, సౌర విద్యుత్‌ను 40 శాతం ఉత్పత్తి చేస్తున్నారు. మనం క్లీన్ ఎనర్జీలో అక్టోబర్ 2017లో 46 శాతం సామర్థ్యాన్ని సాధించాం. దేశమంతా బొగ్గు కొరత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రస్తుత తరుణంలో మన రాష్ట్రం సౌర, పవన విద్యుత్ రంగాల్లో ముందుకు దూసుకెళ్లడం ఈ సంక్షోభ నివారణకు ఎంతో దోహదకారిగా ఉంది’ అని చంద్రబాబు వివరించారు. విద్యుత్ ఉత్పత్తి కోసం దూరదృష్టి, దార్శనికత ఎంతో అవసరమని, ప్రజాప్రయోజనాల కోసం పనిచేయడంలో తానెప్పుడూ రాజీపడలేదని స్పష్టం చేశారు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా నాటి ప్రధానిని ఒప్పించి విశాఖలో వేయి మెగావాట్ల సామర్థ్యంతో సింహాద్రి విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పామన్నారు. ఈ తరహా విద్యుత్ కేంద్రం ఒక్క ఏపీలోనే ఉందని, ఆటంకాలు ఎదురైనా అత్యంత స్వల్ప
వ్యవధిలో, అపోహలను, అనేక ప్రచారాలను పటాపంచలు చేస్తూ శ్రీశైలం ఎడమ గట్టున 900 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రం నిర్మించిన ఘనత మనకుందని గుర్తుచేశారు. ఖరీదైనదిగా దుష్ప్రచారం చేసిన జల విద్యుత్ ఉత్పత్తి ఆ తర్వాతి కాలంలో ఎంత చవకగా మారిందో తెలిసిందేనన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వరంగా మారాయని, పోలవరం జల విద్యుత్ కేంద్రాన్ని వేగవంతంగా పూర్తిచేసి అందుబాటులోకి తెస్తే విద్యుత్ డిమాండ్ పతాక స్థాయికి చేరినప్పుడు అవసరాలను తీర్చిగలిగే సామర్థ్యం సిద్ధిస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేలా ఈ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఏపీ జెన్కోను దేశంలోని విద్యుత్ ఉత్పత్తి రంగ సంస్థల్లో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల 700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన నాగార్జునసాగర్ ఎడమ గట్టు, 900 మెగావాట్ల శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు తెలంగాణకు వెళ్లాయని, ఈ లోటును పూడ్చేందుకు అంతే సామర్థ్యం కలిగిన పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాలు స్థాపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు కసరత్తు చేయాలని చంద్రబాబు ఐటీ ముఖ్య కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, ఏపీ జెన్కో ఎండీ విజయానంద్‌ను ఆదేశించారు. ఎగువ సీలేరు పంపు స్టోరేజీ ప్లాంట్ వద్ద వెయ్యి మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు కోసం సర్వే పూర్తి చేశామని ఆయన ముఖ్యమంత్రికి తెలిపారు. ముఖ్యమంత్రి నిరంతర పర్యవేక్షణలో నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ కేంద్రం ద్వారా 50 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని స్థాపించామని కూడా ఆయన తెలిపారు. రాష్ట్ర ఇంధన వనరుల శాఖ మంత్రి కళా వెంకటరావు మాట్లాడుతూ ఉద్యోగుల సహకారంతో నిర్ణీత కాల వ్యవధిలోనే విద్యుత్ కేంద్రాల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. విజయానంద్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రాజెక్టులను పూర్తిచేస్తే ఏపీ జెన్కో ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 4613 మెగావాట్ల నుంచి 8173 మెగావాట్లకు పెరిగి రెట్టింపు అవుతుందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి సాయిప్రసాద్, ఇంధన వనరుల శాఖ, ఐ అండ్ ఐ, ఏపీసీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, రాష్ట్ర ఇంధన శాఖ సలహాదారు కె రంగనాథం, ఏపీ జెన్కో సంచాలకులు ఆదినారాయణ, హైడల్ జెన్కో సంచాలకులు సీహెచ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.