రాష్ట్రీయం

తెలుగు వెలుగు దేదీప్యమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: ప్రపంచ తెలుగు మహాసభలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్‌లో ఆదివారం అవధాని జిఎం రామశర్మ చేసిన శతావధానం సందర్భంగా సిఎం మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు హర్షించేలా సభల చివరిరోజు తీర్మానాలు చేస్తామన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు అద్భుతమైన స్పందన రావడంతో తనకు చాలా సంబురంగా ఉందని కెసిఆర్ పేర్కొన్నారు. ఈ సభలకు 42 దేశాలు, 17 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం నుండి ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. సభల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్ని వేదికలు కూడా ప్రతినిధుల హడావుడితో కళకళలాడుతున్నాయన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా సాహిత్యానికి పూర్వవైభవం వస్తుందని పేర్కొన్నారు. కవి సమ్మేళనాలు, చర్చలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయన్నారు. సాహిత్య కార్యక్రమాలకు ఇటీవల కొద్దిగా ఆదరణ తగ్గిందని,
ఇక నుండి సాహిత్యానికి, తెలుగు భాషకు పెద్దపీఠ వేస్తానని ప్రకటించారు. తెలంగాణలోని సాహితీ వేత్తలను తగినంత గుర్తింపు ఇస్తామన్నారు. తాను పుట్టిన గడ్డకు చెందిన డాక్టర్ జిఎం రామశర్మ శతావధానం చేయడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. తాను ఇంజనీర్ లేదా డాక్టర్ కావాలంటూ తన తండ్రికి కోరికగా ఉండేదని, అయితే తన గురువుల కారణంగా తనకు సాహితీరంగంలో ప్రవేశం కలిగిందన్నారు. చదువుకునే రోజుల్లో దాదాపు 3000 పద్యాలను కంఠస్తం చేశానని గుర్తు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రతినిధులకు వసతి, భోజన సదుపాయాలు చాలా బాగా ఉన్నాయని, ఇందుకోసం కృషి చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌ను సిఎం అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను శ్లాఘిస్తూ, అవధాని రామశర్మ ఆశువుగా చెప్పిన పద్యం ఆహుతులను ఆకట్టుకుంది. రామశర్మను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఘనంగా సన్మానించారు. ఆయన నిర్వహించిన శతావధానం సందర్భంగా కెసిఆర్ తన ప్రసంగంలో చదివిన రెండు పద్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

చిత్రం..ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఆదివారంనాటి కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం కె చంద్రశేఖర్ రావు. వేదికపై నిర్వాహకులు, తెలుగు పండితులు
*
రామశర్మ శతావధానంలో
కేసీఆర్ చదివిన
రెండు పద్యాలు
*
‘‘అటజని గాంచె భూమిసురు డంబరచుంబి శిరస్సరజరీ
పటల ముహుర్ముహుర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్స్వన
స్ఫుట నటనానుకూల పురిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్’’
*
‘‘నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుకిన్క బూని
తాచిన, యది నీకు మన్ననయ, చెల్వగు నీ పదపల్లవంబు
మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే
ననియెద నల్క మానవుగదా యికనైన నరాళకుంతలా!’’