రాష్ట్రీయం

కన్నుల పండువగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట/చేర్యాల, డిసెంబర్ 17: రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రం.. భక్తుల కొంగు బంగారంగా విరజిల్లుతున్న సిద్దిపేట జిల్లా చేర్యాలలోని కొమురవెళ్లి మల్లన్న క్షేత్రం ఆదివారం జనసంద్రంగా మారింది. మల్లికార్జున స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొమరవెళ్లి మల్లికార్జున స్వామి, గొల్ల కేతకి, బలిజ మేడాలమ్మల కల్యాణం ముక్కోటి దేవతలు, పంచభూతాల సాక్షిగా కన్నుల పండువగా నిర్వహించారు. కొమురవెళ్లి మల్లన్న కల్యాణం సందర్భంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వ పక్షాన పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణం సందర్భంగా ఆలయ కమిటీ పక్షాన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తోట బావి వద్ద ప్రధాన వేదికను అత్యంత వైభవంగా సుందరంగా అలంకరించారు.
ప్రతి సంవత్సరం మార్గశిర మాసం మొదటి ఆదివారం పురష్కరించుకొని వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం స్వామివారి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మలను వీరశైవ పీఠాధిపతి 108 గురువు చన్నవీరశావాచార్య స్వామి పర్యవేక్షణలో వేదమంత్రోచ్ఛరణాల మధ్య, ముక్కోటి దేవతలు పంచభూతాల సాక్షిగా కొమురవెళ్లి మల్లన్న కల్యాణం ఘనంగా వైభవంగా నిర్వహించారు. కల్యాణాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అలంకరణ చేసి గర్భాలయ ముఖ మండపంలోని భైరవ విగ్రహం వద్ద బలిహరణం జరిపి స్వామివారికి ఛత్రకన్ను అమర్చి దర్శనాన్ని ప్రారంభించారు.
అనంతరం కల్యాణం జరిపి తోటబావి వద్ద ఆలయ అర్చకులు, మల్లన్నతో పాటు గొల్లకేతమ్మ, బలిజమేడాలమ్మ ఉత్సవ విగ్రహాలకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. కన్యాదాతలుగా మహాదేవుని వంశస్థులైన మహాదేవుని మల్లికార్జున్, మానస దంపతులు కన్యాగ్రహీతలుగా పడిగన్నగారి వంశస్థులైన ఆంజనేయులు, అర్చన దంపతులు పీటలపై కూర్చుని కోర్కెలుతీర్చే మల్లన్న కల్యాణాన్ని అంగరంగ వైభవంగా ఆదివారం ఉదయం 10.45 గంటలకు స్వామివారి కల్యాణం నిర్వహించారు. వేలాది సంఖ్యలో హాజరైన భక్తులు కన్నుల పండువగా మల్లన్న కల్యాణం తిలకించి తరించారు. కల్యాణం ఆనంతరం మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బొడకంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి ఆలయంలోని మూలవిరాట్‌ను దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణం ఆనంతరం భక్తులు స్వామి వారికి ఒడిబియ్యం సమర్పించుకొని మొక్కుబడులు చెల్లించుకున్నారు. కల్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగ కుండా ఆలయ ఈఓ రామకృష్ణారావు, చైర్మన్ బద్దిపడగ కిష్టారెడ్డి పటిష్టమైన చర్యలు చేపట్టారు. సిద్దిపేట పోలీసు శాఖ పక్షాన భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.
హాజరైన ప్రముఖులు
కొమురవెళ్లి మల్లన్న కల్యాణానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మంత్రి శ్రీనివాస్‌యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బోడకంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డీఆర్వో చంద్రశేఖర్, ఆలయ కమిటీ చైర్మన్ కిష్టారెడ్డి, ఎంపీపీ శ్రీ్ధర్, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. స్వామివారి కల్యాణానికి 108వ గురుషట్‌స్థాల బ్రహ్మ చన్నవీర శివాచార్య హాజరయ్యారు.
పోలీసుల ఓవరాక్షన్: భక్తులతో వాగ్వాదం
కొమురవెళ్లి మల్లన్న కల్యాణాన్ని పురస్కరించుకొని తోటబావి వద్ద ఏర్పాటు చేసిన కల్యాణ మండపం వద్ద స్వామి కల్యాణం అనంతరం భక్తులకు దర్శనానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు, భక్తులకు వాగ్వాదం జరిగింది. ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలను, ఒడిబియ్యం పోయకుండా పోలీసులు అడ్డుకొని, నెట్టివేయడంతో భక్తులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మహిళా భక్తులను పోలీసులు నెట్టివేయడం పట్ల పోలీసుల తీరుపై పలువురు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు భక్తులకు పట్టించుకోకుండా వీఐపీల సేవల తరించడంతో భక్తులు పోలీసుల తీరు పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు.

చిత్రం..కల్యాణానికి హాజరై మల్లన్న మూలవిరాట్‌ను దర్శించుకుంటున్న మంత్రి హరీశ్‌రావు.