రాష్ట్రీయం

మహా ప్రాజెక్టులో గిల్లుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 24: నిబంధనలను ప్రాజెక్టుకింద పాతరేసి, భూసేకరణలో భారీ అవకతవకలకు పాల్పడటం చూస్తుంటే, పోలవరం ప్రతిష్ట పునాదుల్లోనే మసకబారుతోందా? అన్న ఆందోళన కనిపిస్తోంది. పోలవరం సాక్షిగా పశ్చిమాన సాగుతోన్న భారీ భూపరిహార కుంభకోణం లోతుల్లోకి తొంగిచూస్తే.. రాష్ట్రానికి జీవనాడిలాంటి భారీ ప్రాజెక్టులో తమవంతు గిల్లుడు మొదలెట్టిన ఘనులు, వ్యవహారవేత్తలు ఏరకమైన ‘ప్రణాళిక’ అమలు చేస్తున్నారో కనిపిస్తుంది. పోలవరం భారీ ప్రాజెక్టుకు అదేస్థాయిలో భూసేకరణ తప్పనిసరి. తాజా డిజైన్లను అనుసరించి ప్రాజెక్టుకు నాలుగు కాంటూర్ల పరిధిలో భూసేకరణ జరపాలి. ప్రాజెక్టు గర్భం (నిర్మాణ స్థలం) మొదటి కాంటూరులో ఉంటుంది. అంటే, గోదావరికి పశ్చిమాన ఏడు, తూర్పున ఏడు గ్రామాలు ప్రాజెక్టు గర్భం కిందకు వస్తాయ. ఇక రెండో కాంటూర్ ప్రాంతమంతా డెడ్‌స్టోరేజీ కోసం. ఇందులో పోలవరం మండలం పూర్తిగా, వేలేరుపాడు మండలంలోని నాలుగు గ్రామాలు ఉంటాయి. ప్రాజెక్టు ఎత్తునుబట్టి సేకరించాల్సిన స్థలమంతా మూడో కాంటూర్‌లో ఉంటుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం పూర్తిగా వేలేరుపాడు మండలం, కుకునూరు ప్రాంతంలో కొంతభాగం ఉంటుందని అంచనా. ఇక చివరిది, ప్రస్తుత కుంభకోణ కథకు ప్రధానమైనదీ నాల్గవ కాంటూర్. కుకునూరు మండలం మొత్తం నాల్గవ కాంటూర్‌లో ఉంటుంది. నిజానికి ప్రాజెక్టు పనులన్నీ పూరె్తైన తరువాత, ప్రాజెక్టు నిండు స్వరూపాన్ని సంతరించుకున్న సమయంలో మాత్రమే ఈ భూమి అవసరం. ఈ కాంటూర్ల పరిధి ఇటు పశ్చిమ, అటు తూర్పు జిల్లాల్లో విస్తరించి ఉందన్నది తెలిసిందే. నిజానికి పశ్చిమాన చేసినట్టే తూర్పువైపూ భూసేకరణ సమన్వయ వేగంతో ముందుకు తీసుకెళ్లివుంటే ప్రాజెక్టు పనులు పరుగులు తీస్తున్నాయని చెప్పుకోవచ్చు. కానీ అలా జరగడం లేదు. కారణం, భారీ భూపరిహార దందా స్కెచ్ ఇక్కడే
అమలవుతోంది కనుక. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో శరవేగంగా మొదటి, రెండు కాంటూర్ల భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసేశారు. ఇదంతా చూస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిజంగానే ఇంత వేగంగా జరిగిపోతుందా? అన్న ఆనందం కలుగుతుంది. కానీ చిక్కంతా ఇక్కడేవుంది. 3, 4 కాంటూర్ల పరిధిలోని భూసేకరణ ప్రక్రియ మొదలెట్టడానికే, శక్తికిమించి తొలి రెండు కాంటూర్ల పరిధిలో భూసేకరణ పూర్తి చేసేశారన్న అసలు విషయం అర్థమవుతుంది. నిజానికి తూర్పు గోదావరిలో తొలి రెండు కాంటూర్ల భూసేకరణ ఇంతవరకూ కొలిక్కి రాలేదు. మాడో కాంటూర్ పరిధిలోని భూసేకరణ వైపు కనె్నత్తి చూసే పరిస్థితీ లేదు. కానీ, పశ్చిమాన మాత్రం పోలవరం ప్రాజెక్టు పూరె్తైపోయి.. ప్రాజెక్టు నిండిపోయి.. బ్యాక్‌వాటర్ కోసం భూములు సిద్ధం చేయాలన్నంత వేగంతో భూసేకరణ వ్యవహారం పరుగులు తీస్తోంది. ఈ ప్రక్రియనూ భవిష్యత్‌లో అసలు భూమే దొరకదన్నంత వేగంగా పరిగెత్తిస్తుండటం చూస్తుంటే సవాలక్ష అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజకీయం తలచుకుంటే కుంభకోణాలకు కొదువా? అన్న చందాన.. మూడో కాంటూర్ భూసేకరణ ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే నాల్గవ కాంటూర్ భూసేకరణకూ చకచకా పావులు కదిపేశారు.
నిజానికి 2018నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమంటే గ్రావిటీ ద్వారా జలాలు అందించేందుకు ఏర్పాట్లు చేయడం. ఆ విధంగా చూసినా రెండో కాంటూరు భూసేకరణ ప్రక్రియను ముందుగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అదీ ఉభయ గోదావరి జిల్లాల్లో సమన్వయంతో సాగాలి. ఒకవేళ రానున్న రోజుల్లో విపరిణామాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయన్న అంచనాలు కనుక ఉంటే, మూడో కాంటూరు భూములనూ ముందుగానే సేకరించొచ్చు. అలాకాకుండా, ప్రాజెక్టు పూరె్తై అన్నివిధాలా అడుగులు పడిన తరువాత చాలాకాలానికి అవసమయ్యే నాల్గవ కాంటూరు భూములనూ ఆగమేఘాల మీద సేకరిస్తుండటమే ఇక్కడ అనుమానాలకు తావిచ్చే అంశం. ఒకపక్క ప్రాజెక్టు నిర్మాణ పనులు సవాలక్ష సమస్యలతో నత్తనడక నడుస్తుంటే, ఇప్పటికప్పుడే అవసరం లేని నాల్గవ కాంటూర్ భూములను సేకరించటం, చెల్లింపులు చేసేస్తుండటం ‘పక్కా ప్రణాళిక’ ప్రకారమే అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయ.
ఎందుకింత కంగారు?
మూడు, నాల్గవ కాంటూర్ల భూసేకరణకు వచ్చేసరికి విభజన అనంతరం తెలంగాణ నుంచి ఆంధ్రకు కలిసిన వేలేరుపాడు, కుకునూరు మండలాలు పూర్తిగా అంతర్ధానమవుతాయి. అక్కడున్న గిరిజనులకు నిబంధనల ప్రకారం పరిహారంతోపాటు భూమికి భూమికి అందించాల్సి ఉంటుంది. గిరిజనేతరులకు పరిహారంతో సరిపెడతారు. గిరిజనులకు భూమికి భూమి ఇవ్వాలంటే, అందుకోసం మరోచోట భూసేకరణ అనివార్యం. అదీ ఏజెన్సీ పరిధిలో అయితే గిరిజనులకు అనుకూలమన్న అభిప్రాయమూ ఉంది. దీన్ని అసరా చేసుకుని, గిరిజనులకు భూమికి భూమి అందించే ఉద్దేశంతో పశ్చిమ ఏజన్సీని తెరపైకి తెచ్చారు. 1/70 చట్టపరిధిలోకి వచ్చే జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం మండలాలను ఎంపిక చేసుకున్నారు. అనుకున్నదే తడవు భూసేకరణను వేగవంతం చేసి యజమానులకు చెల్లింపులూ మొదలెట్టేశారు. ఇలా మాట్లాడుకోవడం, అలా అవార్డు ఇవ్వడం, మరుక్షణం పరిహారం చేతిలో పెట్టేయటం అన్నంత వేగంగా సాగిపోతోంది వ్యవహారం. ప్రాజెక్టు నిర్మాణ పరిధిలోని పోలవరం, ఇతర గ్రామాల్లో ఇప్పటికీ తమకు పరిహారం అందటం లేదంటూ గిరిజనులు ధర్నాలు, ఆందోళనలు చేస్తుంటే.. ఎప్పుడో అవసరమయ్యే భూములను ఇప్పుడే సేకరించి అస్మదీయ వర్గానికి చెల్లింపులు మాత్రం చేసేస్తుండటం విడ్డూరానికే విడ్డూరం. 1/70 చట్టపరిధిలోకి వచ్చే జీలుగుమిల్లి, బుట్టయిగూడెం మండలాల్లో ఏడు వేల ఎకరాల వరకు భూమిని సేకరించినట్టు తెలుస్తోంది. గిరిజనులకు ఇవ్వాల్సిన ప్రత్యామ్నాయ భూములు మరెక్కడా దొరకవన్నట్టు ఈ రెండు మండలాలపైనే దృష్టి పెట్టడం ఒక ఎత్తయితే, ఎకరా పదిన్నర లక్షల చొప్పున సేకరిస్తుండటం మరో వింత. ఈ లెక్కల ప్రకారం ఇప్పటికి సేకరించిన భూములకు రూ.700 కోట్లు పరిహారం చెల్లించేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇక్కడితో కథ పూర్తికాలేదు. ఇన్ని వేల ఎకరాల పరిధిలోని చెట్టు, పుట్ట, బోరు, ఇల్లు.. ఇలా ఏమివుంటే వాటిని పరిగణనలోకి తీసుకుని లెక్కలువేసి చెల్లించాల్సిన మొత్తాన్ని దాదాపు రూ.1800 కోట్లకు చేర్చేశారని విపక్షాలు లెక్కలుకడుతున్నాయి. అంటే మొత్తం ప్రాజెక్టు పూరె్తైన తర్వాత చెల్లించాల్సిన మొత్తాలను ఇప్పుడే చెల్లించేస్తారన్న మాట. ఇక ప్రాజెక్టు నిర్మాణం పూరె్తై.. పోలవరం నిండిపోయి.. బ్యాక్‌వాటర్ కోసం భూమి అవసరమైనప్పుడు ఆ భూములను స్వాధీనపర్చుకుంటారు. అప్పటి వరకూ పరిహారం తీసుకున్నా భూయజమానుకే ఆ భూములు హక్క్భుక్తంగా ఉంటాయి. ఏళ్ల తరబడి సాగుతున్న 1/70 యాక్ట్‌లోని గిరిజనేతర భూముల సమస్యకు పరిష్కారం చూపించటం ఒక ఎత్తయితే, ఎప్పుడో స్వాధీనపర్చుకునే భూములకు ఇప్పుడే పరిహారం చెల్లించేస్తుండటం మరో వ్యవహారం. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు సాక్షిగా.. అస్మదీయ వర్గానికి చేస్తున్న ఉదార సాయం మాత్రం అంతా ఇంతా కాదు.