రాష్ట్రీయం

భారీ అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జనవరి 12: నగర శివారులోని మేడిపల్లిలోని చెంగిచర్ల చౌరస్తాలోని మెకానిక్ షెడ్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్లలో అకస్మాత్తుగా పేలుడు సంభవించి రెండు ట్యాంకర్లు, ఐదు బైక్‌లు దగ్ధం కాగా షెడ్‌తో పాటు మూడు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. దారిన వెళ్లే వారిపై మంటలు పడటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. మెకానిక్ షెడ్ నిర్వాహకులతో పాటు ట్యాంకర్ల డ్రైవర్లు పరారీలో ఉన్నారు. క్షతగాత్రుల రోధనలతో ఆ ప్రాంతం తల్లడిల్లింది. భారీ శబ్ధంతో మంటలు ఎగిసిపడి నల్లటి పొగతో పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో పరుగులు తీశారు. పోలీసుల కథనం ప్రకారం.. పీర్జాదిగూడ పురపాలక సంఘం పరిధిలోని మేడిపల్లిలోని చెంగిచర్లకు వెళ్లే ప్రధాన రహదారిలో రాజు ట్యాంకర్ మెకానిక్ షెడ్ ఉంది. మెకానిక్ పేరుతో చర్లపల్లి నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాల వైపునకు వెళ్లే పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లను నిత్యం షెడ్‌లోకి మళ్లిస్తుంటారు.
శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పెట్రోల్ ట్యాంకర్ షెడ్ లోపలికి వెళ్లింది. అందులో నుంచి అక్కడ ఉన్న సిబ్బంది పెట్రోల్ తీస్తుండగా అదే సమయంలో మరో ట్యాంకర్ వచ్చింది. లోపలికి వెళ్లేందుకు రివర్స్ తీస్తుండగా ప్రమాదవశాత్తు వెనుక ఉన్న ఇంటికి ఢీకొంది. అదే సమయంలో రాపిడితో మంటలు వచ్చి ట్యాంకర్లలోని పెట్రోల్‌కు అంటుకోవడంతో భారీ శబ్ధం వచ్చింది. అప్రమత్తమైన ట్యాంకర్ల డ్రైవర్లు, అక్కడ ఉన్న సిబ్బంది ప్రమాదం నుంచి తప్పించుకుని సురక్షిత ప్రాంతంలోకి వెళ్లారు. మంటలు ఆగకుండా ట్యాంకర్లలోని ఒక్కొక్క కంపార్ట్‌మెంట్ నుంచి శబ్ధాలతో మంటలు ఎగిసి పడి సుమారు 300 మీటర్ల మేర వ్యాపించాయి. అదే సమయంలో దారిన బైక్‌పై వెళ్లే వారిపై మంటలు పడ్డాయి. వేగంగా వచ్చి మీద పడిన మంటల్లో ఐదుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పీర్జాదిగూడ పురపాలక సంఘం కమిషనర్ టీ.కృష్ణమోహన్ రెడ్డి.. పోలీసు, ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. వౌలాలి, మల్కాజిరిగి, తార్నాక, ముషిరాబాద్ ప్రాంతాల నుంచి సుమారు 10 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పాయి. బైక్‌పై వెళ్తున్న వారిపై మంటలు వ్యాపించడంతో అక్కడే కుప్పకూలిపోయారు. వీరిలో మేడిపల్లిలో నివసిస్తూ కర్నూల్ జిల్లా వూర్కల్ మండలం పరిధిలోని ఉసనాపురం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వెంకటేశ్ నాయక్(28), ఘట్‌కేసర్‌లో నివసిస్తూ కుషాయిగూడ ట్రాఫిక్ విభాగంలో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న మురళీదాస్ (50), ఓలా ఊబర్ క్యాబ్‌లో కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న మేడిపల్లి కమలానగర్‌లో నివసిస్తున్న నవనీత్, మెకానిక్ షెడ్ పక్కనే గుడిసెల్లో నివసిస్తున్న గోపాలచారి(40) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనాల్లో ఆసుపత్రులకు తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాఫ్ట్‌వేర్ వెంకటేశ్ నాయక్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు.
సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఆర్డీఓ
అగ్నిప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని ఆర్డీఓ హన్మంత్ రెడ్డి, ఇన్‌చార్జి తహశీల్దార్ శ్రీకాంత్ రెడ్డి సందర్శించారు. పోలీసు అధికారులతో కలిసి మంటలు అదుపు చేసేంతవరకు అక్కడే ఉన్నారు. సంఘటనపై విచారణ చేపట్టి నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. సంఘటన స్థలాన్ని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అధికారుల బృందం సందర్శించి జరిగిన సంఘటనపై విచారణ చేపట్టింది. మేడిపల్లిలోని చెంగిచర్ల చౌరస్తాలో పెట్రోల్, డీజిల్ దొంగతనం యథేచ్ఛగా జరుగుతోంది. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం సంబధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న అక్రమ వ్యాపారమే ప్రమాదానికి దారి తీసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.