రాష్ట్రీయం

పాపికొండల్లో పైశాచికత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జనవరి 16: ఉల్లాసంగా.. ఉత్సాహంగా ప్రకృతి ఒడిలో మమేకమై సేదదీరుదామని పాపికొండలకు వచ్చే పర్యాటకులకు రక్షణ కొరవడుతోంది. ప్రసిద్ధి చెందిన ఈ పర్యాటక ప్రాంతం కొందరి కనుసన్నల్లోనే సాగుతుండటంతో ఎవరి ఇష్టారాజ్యం వారిదే అన్నట్లు ఇక్కడ పెత్తనం కొనసాగుతోంది. పర్యాటకుల పట్ల దురుసుగా, అనుచితంగా ప్రవర్తించడం ఒకఎత్తయితే.. ఏకం గా దాడులకు తెగబడటం విస్తుగొలుపుతోంది.
ప్రపంచ పర్యాటక చిత్రపటంలో తనదైన ముద్ర వేసుకున్న పాపికొండల విహారయాత్రలో దౌర్జన్యాలు జరగడం పర్యాటకుల్లో అభద్రతా భావాన్ని నింపుతోంది. ఈ నెల 14న ఖమ్మం, హైదరాబాద్‌లకు చెందిన 21 మందితో కూడిన ఒక బృందం పాపికొండల విహారయాత్రకు వచ్చి చేదు అనుభవాన్ని చవిచూసింది. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని వరరామచంద్రాపురం మండలం పోచారం నుంచి లాంచీ ద్వారా కొల్లూరు హట్స్‌కు చేరుకున్నారు. అదే రాత్రి వారంతా అక్కడే బస చేశారు. అయితే సోమవారం మధ్యాహ్నం భోజన సమయంలో భోజనం విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తాయి. భోజనం సరిగ్గా లేదంటూ వేరే కొందరు నిర్వాహకులను ప్రశ్నించారు.
దీంతో స్వల్ప వివాదం రేగి అదికాస్తా ఘర్షణకు దారితీసింది. వారంతా అక్కడి నుంచి వెళ్లిపోగా ఈ ఘర్షణతో ఎలాంటి సంబంధం లేని ఖమ్మం, హైదరాబాద్ నుంచి వచ్చిన బృందంపై పాపికొండల టూర్ నిర్వాహకులు దాడికి దిగారు. భోజనం సరిగ్గా లేదని చెప్పింది తాముకాదని వారు చెప్పేలోగా కర్రలతో వారిని నిర్వాహకులు చితకబాదినట్లు బాధితులు మంగళవారం భద్రాచలంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు. తమను కర్రలు, రాడ్లతో కొట్టడమే కాకుండా తమ బృందంలోని మహిళల వద్ద ఉన్న ఆభరణాలు, మగవారి వద్ద ఉన్న నగదును వారు బలవంతంగా తీసుకున్నారని బాధితులు ఆరోపించారు. మహిళలు కాళ్లపై పడి కొట్టవద్దని వేడుకున్నా వారిని సైతం విచక్షణా రహితంగా కొట్టి గాయపర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ వేళ కుటుంబాలతో సంతోషంగా గడుపుదామని ఇక్కడకు వచ్చామని, తమకు సంబంధం లేని విషయంలో తమపై పాపికొండల టూర్ నిర్వాహకులు, వారి అనుచరులు దాడి చేశారని, ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీయాల్సివచ్చిందని వారన్నారు.
మీడియాతో బాధితులు మాట్లాడుతున్న సమయంలో వారి పిల్లలు బిక్కుబిక్కుమంటూ బయట కూర్చున్నారు. ఏమి జరిగిందో చెప్పమని ప్రశ్నిస్తే ఆ భయానక దాడి గురించి చెబుతూ కన్నీరుపెట్టారు.
చిత్రం..పర్యాటకులపై దాడి చేస్తున్న పాపికొండల టూర్ నిర్వాహకులు, వారి అనుచరులు