రాష్ట్రీయం

ముఖ్యమంత్రి గారి వియ్యంకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 24: తన బావే కదా.. సీట్లో కూర్చుంటే ఏమవుతుందిలే అనుకున్నట్లున్నాడు నందమూరి బాలకృష్ణ. అందుకే ఎవరినీ అడక్కుండా ఎంచక్కా సీఎం సీట్లో కూర్చుని ముఖ్యమంత్రి మాదిరిగా సమీక్ష నిర్వహించేశారు. మామూలు ఎమ్మెల్యే సీఎం సీట్లో కూర్చోవడం, సమీక్ష నిర్వహించడం దుస్సాహసమే! కానీ, సీఎం చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మాత్రం కాదు! బాలకృష్ణ అనగానే ఇదేదో సినిమా సీన్ అనుకోవద్దు. ఈ రియల్ సీన్‌కు విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం వేదికైంది. హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే, సీఎం బావమరిది నందమూరి బాలకృష్ణ బుధవారం సీఎం క్యాంపు ఆఫీసులో తన అనంతపురం జిల్లాలో ప్రతి ఏటా నిర్వహించే లేపాక్షి ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశం క్యాంపు ఆఫీసు ప్రారంభంలో ఉన్న మీడియా హాల్‌లో జరిగితే ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ, ఆయన సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించే హాల్‌లో, సీఎం కుర్చీలోనే కూర్చుని అధికారులకు సూచనలు, ఆదేశాలివ్వడమే వివాదమైంది. సీఎం చంద్రబాబు ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్నారు. సహజంగా చంద్రబాబు శని, ఆదివారాలు సచివాలయానికి సెలవయినందున, ప్రభుత్వ కార్యక్రమాలు, సమీక్షలన్నీ విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచే నిర్వహిస్తుంటారు. మిగిలిన రోజుల్లో సీఎంఓలో పనిచేసే అధికారులు, కింద ఫ్లోర్‌లో ఉన్న శాఖాధిపతులను తప్ప, అక్కడికి ఎవరినీ అనుమతించరు. అయితే, గత కొద్దికాలం నుంచి విజయవాడకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ఆఫీసు ప్రారంభంలో ఉన్న మీడియా హాల్‌లో విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. అది వేరే విషయం! ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఏకంగా క్యాంపు ఆఫీసులో ఉన్న సీఎం సీట్లో కూర్చుని, అధికారులతో సమీక్ష నిర్వహించడం విమర్శలకు తెరలేచినట్టయింది. క్యాంపు ఆఫీసు పైకి వెళ్లాలంటే ముందస్తు అనుమతి తీసుకోవలసి ఉంటుంది. కింద ఉన్న సెక్యూరిటీకి పైనుంచి ఆదేశాలు వస్తేనే ఎవరినైనా అనుమతిస్తుంటారు. అలాంటిది ఒక సాధారణ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణను పైకి అనుమతించడంతోపాటు, ఏకంగా సీఎం సీట్లో కూర్చుని సమీక్ష నిర్వహిస్తున్నా ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడం విమర్శలపాలయింది. పైగా సదరు సమావేశానికి మంత్రి దేవినేని ఉమ, సీనియర్ ఐఏఎస్ అధికారులు నీరభ్‌కుమార్, ముఖేష్‌కుమార్ మీనా, ఇతర అధికారులు హాజరయి, బాలయ్య ఆదేశాలను శ్రద్ధగా నోట్ చేసుకుంటున్న ఫొటోలు ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెచ్చాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ సీఎం సీట్లో కూర్చున్న ఫొటోలు నిమిషాల్లోనే సోషల్‌మీడియాలో వచ్చి, వైరల్ అవడంతో దానిపై విపరీతమైన వ్యతిరేక వ్యాఖ్యలు మొదలయ్యాయి. చాలామంది నెటిజన్లు ప్రజలకు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని, బావమరిది అయితే సీఎం సీట్లో కూర్చోవచ్చా అన్న ప్రశ్నలు సంధించారు. ఏదేమైనా ఈ వ్యవహారం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారి, టీడీపీకి తలనొప్పిగా పరిణమించే అవకాశం కనిపిస్తోంది.