రాష్ట్రీయం

ఆశలు అడియాసలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 25: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా నవ్యాంధ్రకు కొత్త రైల్వే జోన్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కేంద్రం ఇప్పటి వరకూ ఆ దిశగా తీసుకున్న చర్యల్లేవు. జోన్ ఏర్పాటుపై నియమించిన కమిటీ నివేదిక ఇచ్చి తమపని పూర్తయిందనిపించింది. ఇటీవల విశాఖ వచ్చిన రైల్వే బోర్డు చైర్మన్ జోన్ ఏర్పాటు సాంకేతికంగా సాధ్యం కాదని స్పష్టం చేస్తూనే రాజకీయ నిర్ణయం తీసుకుంటే తప్ప జోన్ రాదని కుండబద్దలు కొట్టారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వాల్లో పాలుపంచుకుంటున్న బీజేపీ, టీడీపీలకు చెందిన నాయకులు రైల్వే జోన్ అంశంపై ఇప్పటికీ సానుకూల ప్రకటనలే చేస్తూ వచ్చారు. రెండు దశాబ్దాలుగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కోరుతూ అన్ని రాజకీయా పార్టీలు ఉద్యమాలు చేపట్టాయి. అధికారంలోకి వచ్చిన పార్టీలు మాత్రం జోన్ వస్తుందంటూ ప్రజలను మభ్యపెడుతూనే వచ్చారు. విభజన హామీలో కీలకమైన రైల్వేజోన్ అంశం గత నాలుగేళ్లుగా విస్తృత ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. బీజేపీ, టీడీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు రైల్వే జోన్ కోసం ఉద్యమాలు చేస్తూనే ఉన్నాయి. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారం పంచుకుంటున్న బీజేపీ, టీడీపీలు మాత్రం ఇప్పటి వరకూ జోన్ వస్తుందనే నమ్మకంతోనే ఉన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీతో సరిపెట్టిన కేంద్రం రైల్వే జోన్ ఇస్తుందనే
మిత్రపక్షమైన టీడీపీ కూడా నమ్మకం పెట్టుకుంది. జోన్ విషయంలో కేంద్రం సానుకూలత కోసం అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభును రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించింది కూడా అందుకే. రాష్ట్రం నుంచి కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న బీజేపీకి రాజ్యసభ స్థానం కేటాయించడం, అందులోనూ రైల్వే మంత్రికే అవకాశం ఇవ్వడం ద్వారా రైల్వే జోన్‌పై టీడీపీ ప్రజలకు నమ్మకం కలిగించగలిగింది. అయితే అనూహ్యంగా సురేష్ ప్రభు రాజ్యసభకు ఎన్నికైన కొద్ది కాలానికే ఆయన్ను రైల్వే శాఖ నుంచి తప్పించి బీజేపీ తన రాజకీయ చతురతను చాటుకుంది. అప్పటికే జోన్ విషయాన్ని తేల్చేందుకు కేంద్రం కమిటీ ఏర్పాటు చేసింది కూడా. నెలల పాటు సంప్రదింపులంటూ కాలం గడిపిన కమిటీ ఎట్టకేలకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే కమిటీ ఎవరిని సంప్రదించింది, ఎవరితో చర్చించింది అన్న అంశంపై రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీల్లోనూ స్పష్టత లేదు. ఇదే సందర్భంలో రైల్వే బోర్డు చైర్మన్ అశ్వని లోహాని ఇటీవల విశాఖ సందర్శించారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ సాంకేతికంగా సాధ్యం కాదని, కమిటీ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించిందని ప్రకటించారు. అయినప్పటికీ రాష్ట్రానికి చెందిన బీజేపీ, టీడీపీ ఎంపీలు, మంత్రులు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వస్తుందని నమ్మకబలుకుతూనే వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రైల్వేజోన్ తప్పకుండా వస్తుందని ప్రకటించారు. తాజాగా టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తూ, కేంద్రంలో సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వైఎస్ చౌదరి విశాఖలో రైల్వే జోన్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సాంకేతికంగా రైల్వే జోన్ సాధ్యం కాదని పేర్కొంటూ రాజకీయ నిర్ణయం మేరకు ఎన్‌డీఎ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. తాము కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా జోన్ సాధించగలమనే నమ్ముతున్నామంటూ సర్దిచెప్పుకున్నారు. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే నెమ్మదినెమ్మదిగా రైల్వేజోన్ అంశాన్ని మరుగున పడేయాలన్న ప్రయత్నాలు తెరవెనుక ముమ్మరంగా సాగుతున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేక హోదా అంశంలో కూడా వస్తుందంటూనే ప్యాకేజీ ప్రకటన చేసి ప్రజలను అందుకు మానసికంగా సిద్ధం చేశారు. రైల్వే జోన్ అంశాన్ని కూడా అదే తీరులో మరుగున పడేయాలన్న పథకంతో ముందుకు సాగుతున్నట్టు ప్రచారం సాగుతోంది.