రాష్ట్రీయం

టెక్నాలజీయే ఆయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 26: నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజా శ్రేయస్సుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలతో ముందుకెళుతోందని, భవిష్యత్ లోనూ ఈ ఒరవడి కొనసాగిస్తుందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో నిర్వహించిన 69వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ రంగానికి చేస్తున్న కృషిని వివరించారు. ప్రభుత్వ పాలనా తీరు, పథకాల అమలుపై 80 శాత ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఆహార భద్రతను వివరిస్తూ 1.42 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు చేయూతనందించేందుకు బియ్యం, గోధుమపిండి, కందిపప్పు, రాగిపిండి తదితరమైనవి సబ్సిడీపై అందిస్తున్నామన్నారు. రూపాయికే కేజీ బియ్యం, చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న రంజాన్ తోఫా, చంద్రన్న క్రిస్మస్ కానుక పేరిట పండుగల సందర్భంగా ఆరు రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నామన్నారు. చౌకధరల దుకాణాల్లో ఆటోమేషన్‌తో 1525.87 కోట్ల వ్యయం ఆదా అయిందన్నారు. 2017-18లో 12.46 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్‌లు ఇచ్చామని, దీంతో ఎల్‌పీజీ కుటుంబాల సంఖ్య 54.39 లక్షలకు చేరిందన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా చంద్రన్న విలేజ్ మాల్‌ను అందుబాటులోకి తెచ్చామని, వీటిలో తక్కువ ధరకే వినియోగ వస్తువులను మొదటి దశలో 6,500 చౌక ధరల దుకాణాల్లో అందించే ఏర్పాటు చేశామన్నారు. ఎన్‌టీఆర్ వైద్యసేవ, 108 అంబులెన్స్, చంద్రన్న సంచార చికిత్స ద్వారా పేదవారికి వైద్య సౌకర్యాలు అమలు చేస్తున్నామన్నారు. నగరాల్లో 222 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల ద్వారా మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చి చివరికి 100 శాతం ఓడీఎఫ్ సాధించే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. గత మూడేళ్లలో 10,270 కిలోమీటర్ల రోడ్డు మారాలు అభివృద్ధి చేశామన్నారు. కేంద్రం అమలు చేస్తున్న అమృత్ మిషన్ ద్వారా 179 ప్రాజెక్టులను 3,762 కోట్లతో వివిధ నగరాల్లో చేపడుతున్నామన్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు
బీసీ-ఎఫ్ కేటగిరిగా గుర్తిస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశామన్నారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 1067 హాస్టళ్లు, 188 రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 2.14 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ కులాలకు 75 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి తీసుకువచ్చి కృష్ణాడెల్టా రైతులను, పంటలు కాపాడామన్నారు. రాష్ట్రంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా రైతుల్లో అవగాహన తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు.
ఉద్యానవనాలు, మత్స్యశాఖలో గణనీయ ప్రగతి సాధించామన్నారు. చేనేత కార్మికులకు వృద్ధాప్య పింఛన్లు అందిస్తూ, అర్హత వయస్సును కుదించామన్నారు. చిన్న, మధ్యతరహా రైతులకు రూ.10.24కోట్ల రివాల్వింగ్ ఫండ్ అందించామన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా 56,865 మందికి రూ.396 కోట్లతో స్వయం ఉపాధి పథకం అమలు చేశామన్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేని వారికి ఎన్‌టీఆర్ హౌసింగ్ ప్రోగ్రాం ద్వారా 7.62 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతిస్తూ రూ.12,924 కోట్లతో చేపట్టడానికి చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు 16లక్షల గృహాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి రాజధానిని నిర్మించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని హైటెక్ హబ్‌గా చేయడంతోపాటు ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ, ఫిన్‌టెక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా ఉపయోగిస్తూ దేశంలోనే మొదటిగా ఆంధ్రప్రదేశ్‌లో బ్లాక్ చైన్ టెక్నాలజీని పైలెట్ ప్రాజెక్టుగా రెండు శాఖల్లో అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఏ విషయంలోను రాజీ పడకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందన్నారు.
విద్యాశాఖ శకటానికి మొదటి బహుమతి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కవాతు చేసిన బృందాలలో మొదటి బహుమతి ఇండియన్ ఆర్మీ సైనికులకు దక్కగా, రెండవ బహుమతి 16వ బెటాలియన్‌కు దక్కింది. నాన్ క్యాడర్‌లో మొదటి బహుమతి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీకి, రెండో బహుమతి ఎన్‌సీసీ బెటాలియన్ (బాలికలు)కి రాగా, ప్రదర్శించిన శకటాల్లో మొదటి బహుమతి విద్యాశాఖకు చెందిన సర్వశిక్షా అభియాన్, రెండో బహుమతి గృహ నిర్మాణ శాఖకు, మూడో బహుమతి అటవీశాఖ శకటాలు దక్కించుకున్నాయి. వేడుకల్లో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, చైర్మన్ ఎన్‌ఎండీ ఫరూక్, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర మంత్రులు దేవినేని, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, కిమిడి కళా వెంకట్రావు, శిద్దా రాఘవరావు తదితరులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చిత్రం..గణతంత్ర వేడుకల్లో గౌరవ వందనం స్వీకరిస్తున్న గవర్నర్ నరసింహన్