రాష్ట్రీయం

చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: చట్టసభల్లో వెనుకబడిన తరగతులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అధ్యక్షతన నగర శివారులోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో విద్యార్థి గర్జన నిర్వహించారు. సభకు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావడంతో స్టేడియం కిటకిటలాడింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. కేసీఆర్ కుటుంబం తప్ప ప్రజలెవ్వరూ బాగుపడలేదన్నారు. విద్యార్థులు, రైతులు ఇలా అన్ని వర్గాల వారు బాగుపడాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ సాధించుకుంటే చివరకు కేసీఆర్ కుటుంబ సభ్యులే బాగుపడుతున్నారని విమర్శించారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల బలహీనవర్గాల విద్యార్థులు విద్యకు, ఉద్యోగానికి, ఉపాధికి దూరమవుతున్నారని విమర్శించారు. చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతునిస్తుందని చెప్పగానే సభికుల హర్షధ్వానాలు మిన్నంటాయి. తెలంగాణలో బిసి ‘ఇ’ కోటా కింద ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బీసీల్లో జనాభా ఆధారంగా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల్లో 25 శాతం ఉన్న విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని, అదేవిధంగా 33 శాతం ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనారిటీ విద్యార్థుల కోసం తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేసి లక్షలాది విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించే అవకాశాలు కల్పించామని గుర్తు చేశారు. కాగా తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని విమర్శించారు. లక్షన్నర కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్‌లో ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు ఇవ్వాల్సిన 2 వేల కోట్ల రూపాయలు మాత్రమే బకాయిలకు కేటాయించి మిగత 20 వేల కోట్ల రూపాయల నిధులను కాంట్రాక్టర్లకు మంజూరు చేయడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సభకు అధ్యక్షతన వహించిన ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి
మెజారిటీ ప్రజలైన బీసీలకు రాజ్యాధిరంలో వాటా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించినప్పుడు బీసీలకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రాజకీయ రంగంలో బీసీల ప్రాతినిధ్యం 14 శాతం దాటలేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సేకరించిన గణాంకాల ద్వారా తెలిసిందన్నారు.
ఇలాఉండగా సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. చట్ట సభల ఎన్నికల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేయాలని, పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్‌ను తొలగించాలని, ఇంజనీరింగ్, ఎంబిఎ, ఎంసిఎ, ఫార్మసీ, డిగ్రీ, ఇంటర్ తదితర కళాశాల స్థాయి కోర్సులు చదివే బీసీ విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే భరించాలని, గత ఏడాది ఫీజుల బకాయిలు రూ.1600 కోట్ల, ఈ ఏడాది రూ.2 వేల కోట్లు ఒకే దఫా చెల్లించాలని, బీసీలకు 900 రెసిడెన్షియల్ కాలేజీలు మంజూరు చేయాలని ఇలా మొత్తం 23 డిమాండ్లను సమావేశంలో కరతాళధ్వనుల మధ్య ఆమోదించారు.

చిత్రం..బీసీ విద్యార్థి గర్జన వేదికపై చట్టసభల్లో రిజర్వేషన్లకు మద్దతు ప్రకటిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి