రాష్ట్రీయం

ఉండవల్లితో పవన్ కళ్యాణ్ కీలక భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణతో ఎపికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆదివారం కీలక భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, కేంద్రం తీరు, ప్రభుత్వ తప్పిదాల పట్ల కీలక అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ భేటీ ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎపి ప్రభుత్వానికి ఈ నెల 15 వరకు డెడ్‌లైన్ విధించారు. అప్పట్లోగా కేంద్రం మంజూరు చేసిన నిధులెన్ని, ఖర్చు చేసిందెంత, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, ఖర్చులకు సంబంధించి సమగ్ర వివరాలతో శే్వతపత్రం జారీ చేయాలని భేటీ అనంతరం ఇరువురు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు తాను ఎన్నోసార్లు అడిగినా ప్రభుత్వం నుంచి నిధుల విషయంలో స్పందన లేదని అన్నారు. శే్వతపత్రం జారీ చేసి ఇస్తే ఉండవల్లి, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ వంటి వివిధ రంగాలకు చెందిన మేథావులతో సంయుక్త నిజ నిర్ధారణ కమిటీని నియమించి ఆ వివరాలపై చర్చిస్తామని చెప్పారు. ఆ పై ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇది కేవలం నిజనిర్ధారణ కమిటీ తప్ప రాజకీయ కమిటీ ఎంతమాత్రం కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం చేస్తామన్న ప్రత్యేక హోదా, నిధుల విడుదల, రెవెన్యూ లోటు, పలు అంశాల్లో కేంద్ర సహాయం, అనేక అంశాలపై రోజు చర్చ జరుగుతోంది. ఎపి ప్రజలతో పాటు తాను కూడా చాలా బాధపడ్డానని, ఇలాంటి పరిస్థితిలో ప్రశ్నించడం తప్ప వేరొక మార్గం లేదని అన్నారు. తాను ఎవరో చెబితే రాజకీయాల్లోకి రాలేదని వివరణ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం, బిజెపిలకు మద్దతు ఇచ్చానని, ఇప్పుడున్న పరిస్థితిపై తనపై అడగాల్సిన బాధ్యత కూడా ఉందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ నేతలు కోరుకున్నారు, వాళ్లకు రాష్ట్రం వచ్చింది, న్యాయం జరిగింది. మరి ఎపికి ఇచ్చిన హామీల సంగతేమిటి..?. ఇప్పటి వరకు నోరు మెదపకుండా, ఒత్తిడి చేయకుండా టిడిపి ఎందుకు ప్రజల్లో నిరాశను కలిగించిందని పవన్ ప్రశ్నించారు. టిడిపి ప్రజలకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ప్రశ్నిస్తానని అన్నారు. తనతో కలిసి వచ్చే వారి జాబితాను త్వరలో విడుదల చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తీసుకున్న టాస్క్ చాలా బాగుందని ప్రశంసించారు. నిజమైన రాజకీయాలను పవన్‌కళ్యాణ్ ప్రారంభించారని కొనియాడారు. కేంద్రం ఇస్తున్న నిధుల వివరాలకు, రాష్ట్రం చెబుతున్న అంకెలకు పొంతన లేదని అన్నారు. ఎపిలో టిడిపి ప్రభుత్వం ఆడరాని అబద్ధాలు ఆడుతోందని విమర్శించారు. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వల్లే టిడిపి అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఎపి గడ్డు పరిస్థితుల్లో ఉందనే విషయం ప్రజలకు నిజం తెలియాలని అన్నారు. పవన్ కళ్యాణ్ చాలా మంది మేథావులతో చర్చిస్తున్నారని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో జరిగిన ఈ భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, కేవలం కొన్ని అంశాలపై చర్చించేందుకు మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాను రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పవన్‌తో కలిసి పని చేస్తానని, అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పవన్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.