రాష్ట్రీయం

విడదీయని బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 25: ఆంధ్రుల అతిలోకసుందరి, అభిమాన తార శ్రీదేవి మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాతో శ్రీదేవి బంధం ప్రత్యేకమైనది. నెల్లూరంటేనే తనకు అంత ఇష్టంలేని ప్రదేశంగా శ్రీదేవి భావించే పరిస్థితి నెలకొంది. గతంలోకి వెళితే.. ప్రముఖ సిటీనటుడు కృష్ణ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీదేవి హీరోయిన్‌గా నటించిన వజ్రాయుధం షూటింగ్ శ్రీదేవికి చేదు అనుభవాన్ని మిగిల్చిందనేది కొందరికే తెలుసు. 1985లో వజ్రాయుధం షూటింగ్ జిల్లాలోని సోమశిల డ్యాం వద్ద 22 రోజుల పాటు జరిగింది. ఈ షూటింగ్‌లో పాల్గొనేందుకు నిత్యం చెన్నై నుండి గూడూరు వరకూ శ్రీదేవి రైలులో వచ్చి అక్కడ్నుంచి కారులో సోమశిలకు వచ్చేవారు. కొందరు అల్లరిమూకలు గూడూరు నుండి సోమశిలకు వెళుతున్న సమయంలో శ్రీదేవి ప్రయాణిస్తున్న కారును అడ్డగించి ఆమెను చూడాలని ప్రయత్నించే క్రమంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ హఠాత్పరిణామానికి హతాశురాలైన శ్రీదేవి ఎలాగో వారి నుండి తప్పించుకోగలిగారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్రంలో సంచలనమైంది. నిందితులపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ సంఘటన కారణంగా కొద్ది రోజుల పాటు సోమశిలలో సినిమా షూటింగ్‌కు అంతరాయం కలిగింది.
హీరో కృష్ణకు సెక్యూరిటీ ఏర్పాటు చేసిన చిత్రయూనిట్ శ్రీదేవికి సెక్యూరిటీ ఏర్పాటు చేయకపోవడమే ఈ బాధాకరమైన సంఘటనకు కారణమని అప్పట్లో ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అప్పట్నుంచి నెల్లూరన్నా అక్కడ ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా శ్రీదేవి అంతగా ఆసక్తి చూపేవారు కాదంటారు. 1992లో ముఖ్యమంత్రిగా నెల్లూరు జిల్లాకు చెందిన నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ఉన్న సమయంలో నంది అవార్డుల ఫంక్షన్‌ను నెల్లూరులో ఏర్పాటు చేశారు. 1991 సంవత్సరానికి క్షణ క్షణం సినిమాకు నంది అవార్డు అందుకోవాల్సిన శ్రీదేవి నెల్లూరులో 1992లో ఏర్పాటు చేసిన నంది అవార్డుల కార్యక్రమానికి రాలేదు. అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ శ్రీదేవి మాత్రం రాకపోవడంపై గతంలో తనపై జరిగిన అఘాయిత్యంతో నెల్లూరుకు రావడం ఆమెకు ఇష్టం లేదని అందరూ భావించారు. కానీ శ్రీదేవికి నెల్లూరు జిల్లాలో లెక్కకు మించి అభిమానులున్నారు. అతిలోక సుందరి హఠాత్తుగా మరణించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నగరంలో పలుచోట్ల ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి కళాకారులు శ్రద్ధాంజలి ఘటించారు.

చిత్రం..వజ్రాయుధం సినిమా షూటింగ్ సందర్భంగా శ్రీదేవి విడిది చేసిన సోమశిలలోని అతిథిగృహం ఇదే