రాష్ట్రీయం

ధర్మపురిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, ఫిబ్రవరి 26: దక్షిణకాశీగా, హరిహరక్షేత్రంగా, నవనారసింహ క్షేత్రాలలో నొకటిగా పేరెన్నికగన్న ధర్మపురి క్షేత్రంలో 13రోజులపాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవ వేడుకలు సోమవారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. క్షేత్రంలోని ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మీనరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల దేవాలయాలలో ప్రారంభం రోజు ఫాల్గుణ శుద్ధ ఏకాదశి పర్వదినాన ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం ఏసీ, ఈఓ నాయిని సుప్రియ ఆధ్వర్యంలో, డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మకర్తల పర్యవేక్షణలో, దేవస్థాన ఆస్థాన పౌరాణికులు కందాళై పురుషోత్తమాచార్యులు, వేదపండితులు బొజ్జా రమేశశర్మ, ముత్యాల శర్మ, ప్రధానార్చకులు నంబి రఘునాథాచార్య, శ్రీనివాసాచార్య, హరినాథాచార్య, రమణాచార్య, అశ్విన్ కుమార్, అర్చక పురోహితులు సంతోష్ శర్మ, సంపత్ శర్మ ప్రభృతులు ఫాల్గుణ శుద్ధ ఏకాదశి ఉదయం శుభ ముహూర్తంలో సంప్రదాయరీతిలో ముందుగా అవబృథ పర్యంత సంకల్పాలు, అంకురార్పణ, కలశస్థాపన, విశ్వక్సేనారాథన, వాసుదేవ పుణ్యాహ వాచనాలు, భగవత్, భాగవత సమారాధనలు, ఉత్సవ మూర్తుల రక్షాబంధనం, నాందీముఖం, వరాహతీర్థం తదితర ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవతలందరినీ ఆహ్వానించి, మాతృకా పూజలు నిర్వహించి, అన్ని ఆలయాలలో బ్రహ్మకలశ స్థాపనలు చేశారు. ఇఓ సుప్రియ, దేవస్థానం చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, కమిటీ సభ్యులు, అర్చకులకు దీక్షా వస్త్రాలను బహూకరించారు. సాయంత్రం శ్రీయోగానంద, ఉగ్ర నారసింహ శఠారిలను వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మంగళ వాద్యాలు తోడురాగా పురవీధులగుండా ఊరేగింపు జరిపి వరాహ తీర్థం, తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మశాల ప్రాంతాలకు వెళ్ళి, ఉత్సవాన్ని నిర్వహించి మృత్తికా సంగ్రహణం, పుట్టబంగారం కార్యక్రమాలను సంప్రదాయ ప్రకారం నిర్వహించారు. దేవస్థానం ఏసీ, ఈఓ సుప్రియ, చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సునీల్ కుమార్, నటరాజ్, వెంకటేశ్వర్‌రావు, లింగన్న, తిరుపతి, రాజన్న, సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లను గావించారు. ధర్మపురి సీఐ లక్ష్మీబాబు, సబ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
చిత్రం..ఆస్థాన పురోహితులు పురుషోత్తమాచార్యను ఆహ్వానిస్తున్న ఈఓ సుప్రియ, చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు.