రాష్ట్రీయం

సంపాదనలో కొంత సమాజానికివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో చివరి రోజైన సోమవారం ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రత్యేక ప్లీనరీ సెషన్ నిర్వహించారు. నేటి సమాజంలో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లను ఎదుర్కొనేందుకు పరిష్కార మార్గాల గురించి రవిశంకర్, చంద్రబాబు సెషన్ నిర్వాహకుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కే పరిమితమయ్యారని, విభజన తరువాత తూర్పు తీరానికి వచ్చి, ఇప్పుడు ఈప్రాంతాన్ని అనూహ్యంగా అభివృద్థి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర విభజన వలన ఈ ప్రాంతానికి మేలు జరిగిందని అన్నారు. ఆ ప్రత్యేక ప్లీనరీ సెషన్‌కు సంబంధించి ప్రశ్నలు, సమాధానాల సమాహారం....
ప్రశ్న: సమాజంలో ఆనందం కరవైంది? దీనికి కారణం ఏంటంటారు?
రవిశంకర్: ఆనందమే ఆరోగ్యమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. జనంలోని సంతోషమే సమాజాభివృద్ధికి దర్పణం. చాలామంది సంపాదనలో పడి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. సంపాదించిన దాంట్లో కొంత సమాజానికి తిరిగి ఇచ్చేస్తే, అందులో ఎంతో ఆనందం ఉంటుంది. నేడు చాలామంది తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. 2020 నాటికి ప్రపంచంలో ఇది ఒక పెద్ద సమస్యగా పరిణమించబోతోంది. ప్రపంచంలోని సగం మంది ఒత్తిడి సమస్యకు గురికానున్నారు. భవిష్యత్‌లో ఒక సవాలుగా మారబోతోంది. చాలా మంది ఇప్పటికే నిద్రలేమితో బాధపడుతున్నారు. మంచి ఆహారం ఉన్నా, అనారోగ్య సమస్యల వలన తినలేని పరిస్థితి ఉంది. యుకెలో 80 శాతం మంది ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఒంటరితనాన్ని దూరం చేయడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేకించి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసింది. వృత్తి, ఉద్యోగాలపై చాలా మందిలో చిత్తశుద్థి కొరవడింది. ఒత్తిడే ఇందుకు ప్రధాన కారణం. సమాజం ఆరోగ్యంగా లేకపోతే, ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉన్నా, నిష్ప్రయోజనమే. సంతృప్తి లేని జీవితం కూడా నిరర్థకమే.
చంద్రబాబు: ధనవంతుల కన్నా పేదవాళ్లే ఆనందంగా ఉంటారు. వారికి సంపాదనపై పెద్దగా ధ్యాస ఉండదు. ఉన్నదానితో సంతృప్తి చెందుతారు. డబ్బుతో మనఃశాంతి లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. విలువలతో కూడిన జీవితాన్ని గడపాలి.
ప్రశ్న: ఒత్తిడి సమస్యను ఏ విధంగా పరిష్కరించగలం?
రవిశంకర్: ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతితో మమేకం కావడం ద్వారా చాలా సమస్యలను మనం దూరం చేసుకోగలం. దీనివలన మనిషి ఆలోచనా విధానంలో చాలా మార్పులు వస్తాయి. మెడిటేషన్ ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోగలుగుతాం. పారిశ్రామికవేత్తలు నిరంతరం కొత్తదనం గురించి ఆరాటపడుతుంటారు. ఇదే జీవితం కాకూడదు. ఆనందమయమైన జీవనానికి ఉన్న మార్గాలను అనే్వషించుకోవాలి.
చంద్రబాబు: అక్రమ సంపాదనలో సమస్యలు తప్ప, ఆనందం లేదు. కుటుంబ సభ్యులను సంతోష పెట్టలేం. కుటుంబ సభ్యులతో గడపడంలో ఉన్న ఆనందం వేరెక్కడా లేదు. ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ఉన్న మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని మనం ఎంచుకోవాలి. జీవితంలో మనకు రోజూ అనేక సవాళ్లు, సమస్యలు ఎదురవుతుంటాయి. దీనివలన ఒత్తిడి పెరుగుతుంది. మనలో ఉన్న ఒత్తిడిని బయటకు తీసుకురాగలితే, జీవితం సుఖమయమవుతుంది.
ప్రశ్న: నేటి సమాజంలో ప్రజల సత్వర ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నారు. ఈరోజు పెట్టుబడిపెడితే, రేపటికి అది రెట్టింపుకావాలని ఆశపడుతున్నారు? ఇది ఎంతవరకూ శ్రేయస్కరం?
రవిశంకర్: సాంకేతికత శరవేగంగా అభివృద్థి చెందుతోంది. 1960-70లో ట్రంక్‌కాల్స్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సివచ్చేది. ఇప్పుడు ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నవారితోనైనా ఒక్క నిముషంలో మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇది సాంకేతికత గొప్పతనం. ఇదే సమయంలో మనిషిలో కోరికలు పెరిగిపోయాయి. సత్వర లాభాపేక్ష పెరిగింది. కానీ ఇది శ్రేయస్కరం కాదు. జీవితంలో ఓర్పు చాలా అవసరం. ఆధ్యాత్మికతతో ఓర్పును సొంతం చేసుకోగలుగుతాం. ఓర్పు, అభిరుచి సమ పాళ్లలో ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది.
చంద్రబాబు: టెక్నాలజీని వాడుకోకపోతే వెనకబడిపోతాం. కానీ దాన్ని అవసరమైన మేరకు మాత్రమే వినియోగించుకోవాలి. ఇటీవల కాలంలో ప్రజల అంచనాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రజలకు ప్రభుత్వాలు ఎంత చేసినా, ఇంకా అసంతృప్తితోనే ఉంటున్నారు. ఓర్పు, సహనంతో దేన్నైనా సాధించవచ్చని నమ్మాలి.
ప్రశ్న: మనిషి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలంటే ఏంచేయాలి?
రవిశంకర్: విజన్ చాలా అవసరం. లక్ష్యం లేకపోతే ముందుకు సాగలేం. లక్ష్యాలను చేరుకోవడంలో ఒక్కోసారి విఫలమవ్వచ్చు. అప్పుడే ఓర్పు అవసరం. ఓర్పు లేకపోతే లక్ష్యాలను చేరుకోలేరు. తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉన్న తరువాత బిడ్డ బయటకు రావాలి. అంతకు ముందుగానే వచ్చేయాలని కోరుకోవడం సరికాదు కదా! ఓర్పు సత్ఫలితాలను అందిస్తుంది. అసహనం అనర్థాలకు దారితీస్తుంది. ఈ అసహనానికి ఒత్తిడి ఒక కారణం. అసహనంతో ఉన్నవారు నిజం కన్నా, పుకార్లనే ఎక్కువగా నమ్ముతారు. వీరు జీవితాన్ని అదుపులో ఉంచుకోలేదు. ఇలాంటి వారు ఆధ్యాత్మికతవైపు మళ్లాలి. అప్పుడే సత్‌ఫలితాలను పొందగలుగుతారు. రాష్ట్రంలో అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. వీటిని దాటుకుని, అనతి కాలంలోనే మళ్లీ సాధారణ పరిస్థితులకు వచ్చేశాం. పారిశ్రామికవేత్తలకు ఏదైనా సమస్య తల్తెత్తితే దానిని అధిగమించడానికి పరిష్కార మార్గాలను వెత్తుక్కోవాలి. ఇలా చేయాలంటే, మనమీద మనకు నమ్మకం ఉండాలి. వ్యవస్థమీద మీద నమ్మకం ఉండాలి. యువతరం శక్తి, సామర్థ్యాలపై నమ్మకం ఉంచాలి.
చంద్రబాబు: లక్ష్యాలు చేరుకునేందుకు సులభమైన మార్గాలను ఎంచుకోవాలి. విలువలతో కూడిన వ్యాపారం ఎప్పటికైనా శ్రేయోదాయకం. ఎన్ని టన్నుల బంగారం, డబ్బు ఉన్నా సంతోషం లేకపోతే, జీవితం వ్యర్థం.
ప్రశ్న: నేటి సమాజంలో ప్రజలు సెల్ ఫోన్స్‌ను వదలి క్షణమైనా ఉండలేని పరిస్థితి ఉంది. దీనివలన హ్యాపీనెస్ కోల్పోతున్నారు. దీన్ని అధిగమించాలంటే..?
రవిశంకర్: సెల్‌ఫోన్‌తో జీవితం ముడిపడి ఉండడానికి ఆధునిక సాంకేతికతే కారణం కావచ్చు. కానీ అదే జీవితం కాకూడదు. సెల్‌ఫోన్‌ల వాడకం పట్ల మన ఆలోచనా విధానం మారాలి. ఏకాగ్రత గతి తప్పడం వలన ఈ పరిస్థితి చోటు చేసుకుంది. విమానంలో ప్రయాణించినప్పుడు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో కూడా సెల్‌ఫోన్‌ను ఏరోప్లేన్ మోడ్‌లో ఉంచడానికి చాలా మంది ఇష్టపడడం లేదు. ఒక్క వారం రోజులపాటు సెల్‌ఫోన్‌లను పక్కన పడేయండి. అప్పుడు కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతారు. సెల్‌ఫోన్‌ల వలన మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది. పిల్లలు వీడియో గేమ్స్‌కు అలవాటుపడ్డారు. తోటి పిల్లలతో కలిసి మెలగకపోవడం వలన వారు ఆనందమయ జీవితాన్ని కోల్పోతున్నారు.
చంద్రబాబు: సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థవంతంగా ఉపయోగించుకోవాలి. సెల్ ఫోన్‌లను ఎక్కువగా చూసేవారు అందులోని అనవసరమైన సమాచారంతో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ వాస్తవాన్ని గమనించిన వారు ప్రశాంతంగా ఉంటారు.
ప్రశ్న: మనిషిలో సేవా భావం పెరగాలంటే..?
రవిశంకర్: సమాజంలో కొంతమంది స్వార్థపరులున్నారు. ఇంకొంతమంది కొంతమంది సేవాత్పరులు ఉన్నారు. సేవా భావంతో ఉన్నవారు అందరితో ప్రేమింపబడతారు. అదే స్వార్థపరులను చూస్తే సమాజం భయపడుతుంది. సేవ మనిషి జీవితంలో ఒక భాగం కావాలి. పేదరికంలో ఉన్న వారిని ఆదుకుంటే, సమాజాభివృద్థి సాధ్యపడుతుంది. దేశం కూడా బాగుపడుంది. ఇందులోనే నిజమైన ఆనందం ఉంటుంది.
చంద్రబాబు: సమాజ సేవలో తరిస్తున్న వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. బిల్‌గేట్స్ 80 శాతం కాలాన్ని సమాజ సేవకే వినియోగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవరుచుకుంటే, సమాజం బాగుపడుతుంది.

చిత్రం..విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో ప్రత్యేక ప్లీనరీ సెషన్‌లో పాల్గొన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్, ముఖ్యమంత్రి చంద్రబాబు