రాష్ట్రీయం

విద్యార్థి దశ నుంచి రాజనీతిజ్ఞత దిశగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 26: నాయకుడంటే.. స్థితప్రజ్ఞత-ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించేవాడు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినవాడు. జయాపజయాలతో నిమిత్తం లేకుండా వ్యవస్థను నడిపించేవాడు. తనతో ఉన్న వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునేవాడు. వీటన్నింటికీ మించి జనాలకు, సహచరులకు, అనుచరులకు భరోసా ఇచ్చేవాడు. ఇన్ని లక్షణాలున్న వారే జననేతగా సుస్థిరకాలం మనగలుగుతారు. ఈ లక్షణాలు పుష్కలంగా ఉన్నందుకే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు తన నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.
యూనివర్శిటీలో విద్యార్థి నేత నుంచి ఎదిగి ఒదిగిన బాబు రాజకీయ అడుగుడులు.. ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి, కర్షకపరిషత్ చైర్మన్, తర్వాత రికార్డు స్థాయిలో ఏపీ ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లు, ఆ తర్వాత నవ్యాంధ్రకు నాలుగేళ్లు సీఎంగా దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ఈ నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో బాబు నడిచిన దారిలో ఎత్తుపల్లాలు, విజయాలు, అపజయాలు, లెక్కలేనన్ని అనుభవాలు ఆయనను రాజనీతిజ్ఞుడిగా మార్చాయి.
1978 ఫిబ్రవరి 27న అంటే నేటికి సరిగ్గా 40 ఏళ్ల క్రితం.. జనం, కష్టం, వ్యూహానే్న నమ్ముకున్న బాబు చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా 2494 ఓట్లతో గెలిచి ధృవీకరణ పత్రం తీసుకున్న రోజుది. ఎస్వీ యూనివర్శిటీ స్టూడెంట్ లీడర్‌గా తన వెనుక విద్యార్ధిలోకాన్ని ముందుండి నడిపించిన ఆ అనుభవమే, టీడీపీలో శిక్షణాతరగతుల ఆలోచనలకు ఊపిరిపోసింది. ఎన్టీఆర్‌ను నాదెండ్ల కూలదోస్తే వ్యూహరచనతో మళ్లీ ఎన్టీఆర్‌ను ప్రతిష్ఠించింది. రాష్ట్ర విభజన, తెలంగాణ డిమాండ్, తెలంగాణ సీఎంతో వైరం, విపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ ఆపరేషన్ ఆకర్ష వంటి సంక్షోభాలను అవకాశాలుగా తీసుకుని గమ్యం దాటిన తీరు బాబు నాయకత్వతీరును కొన్ని నిదర్శనాలే.
ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే, బాబు పార్టీని కిందిస్థాయి నుంచి నిర్మాణం చేశారు. ఒక నిర్మాణ స్వరూపం లేని టీడీపీని సంస్థాగతంగా తిరుగులేని స్థాయికి తీసుకువచ్చిన ఘనత బాబుదే. కార్యకర్తల శిక్షణా తరగతులు, గుర్తింపుకార్డుల నుంచి ఇప్పుడు కార్యకర్తలను ఆదుకునేందుకు బీమా కల్పించే దశ వరకూ తీసుకువెళ్లిన ఫలితంగా, క్యాడర్ పార్టీనే నమ్ముకునే పరిస్థితి కల్పించారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకీ లేని లైబ్రరీ, నాలెడ్జ్ సెంటర్, రోజూ మీడియాలో వచ్చిన వార్తలపై విశే్లషణ, క్రమం తప్పకుండా నేతలతో టెలీకాన్ఫరెన్సు, వీడియోకాన్ఫరెన్సులతో శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్న ఏకైక నేతగా బాబు గుర్తింపు పొందారు.
సీనియర్లకు మార్గదర్శి
బాబు ఇప్పుడు దేశంలో ఉన్న నలుగురైదుగురు సీనియర్ రాజకీయ వేత్తల్లో ఒకరు. ఫరూఖ్ అబ్దుల్లా, లాలూ, దేవేగౌడ, ములాయంసింగ్ యాదవ్, ప్రకాష్‌సింగ్ బాదల్ వంటి సీఎంగా పనిచేసిన సీనియర్లలో బాబు ఒకరు. మిగిలిన వారిలో ఒక్క ములాయం సింగ్ మాత్రమే జాతీయ రాజకీయాల్లో కొనసాగిస్తుండగా, మిగిలిన వారు వారి రాష్ట్రాలకే పరిమితమయ్యారు. బాబు నాయకత్వాన్ని ఇష్టపడే సీపీఐ బర్దన్ ‘ఇక మా వయసు, ఓపిక అయిపోయింది. ఇక నువ్వే పార్టీలను నడిపించాలి. నీ అంత నేర్పు, సహనం, దూరదృష్టి, చాణక్యత మాకు లేవు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను నువ్వే నడిపించాల’ని భుజం తట్టి చెప్పారు. బాబుతో పాటు రాజకీయ జీవితం ప్రారంభించిన చాలామంది నేతలు తెరమరుగయ్యారు. మరికొందరు వృద్ధాప్యంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండగా, ఇంకొందరు అనారోగ్యంతో ఉన్నారు. ప్రస్తుతం క్యాబినెట్‌లో ఉన్న కేఈ కృష్ణమూర్తి ఒక్కరే ఇప్పుడు బాబుకు సహచరుడిగా కొనసాగుతున్నారు. బాబు మాత్రం క్రమశిక్షణాయుత జీవితం, మితాహారం, యోగా వంటి అలవాట్లతో ఇంకా నవ యువకుడి మాదిరిగా ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకూ అవిశ్రాంతంగా పనిచేయగలుగుతున్నారు.
పనిలోనే ఆనందం
బాబు సమావేశాలకు హాజరయ్యే ఐఏఎస్‌లు సమావేశం మధ్యలో నాలుగైదుసార్లు బయటకువస్తుంటారు. బాబు మాత్రం గంటల తరబడి విసుగు విరామం లేకుండా సమీక్షలు నిర్వహిస్తుంటారు. ఒకసారి అమెరికా పర్యటన నుంచి రాత్రి 9 గంటలకు వచ్చిన బాబు తనతో వచ్చిన మంత్రులు, ఉన్నతాధికారులను కూర్చోమని చెప్పి ఫ్రెష్ అవడానికి లోపలికి వెళ్లి పావు గంటలో వచ్చి, 11 గంటల వరకూ సమీక్ష నిర్వహించారు. అప్పటికి బాబు వ్యవహారశైలి తెలియని ఓ ప్రముఖుడు ‘ఏమిటీ ఆయనకు విసుగుండదా? అంతదూరం జర్నీ చేసి రెస్టు లేకుండా ఈ సమీక్షలేమిట’ని పక్కనే ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారిని ఆశ్చర్యపోతూ ప్రశ్నించారు. ‘ఆయనకు ఇందులోనే ఆనందం ఉంటుంది’ అని సదరు ఉన్నతాధికారి ముక్తసరిగా జవాబిచ్చారట. ఆరుపదులు దాటిన ఈ వయసులో కూడా ఇంత నవోనే్మషంగా ఆలోచిస్తూ, కొత్త-పాత తరం నేతలను సమన్వయం చేస్తున్న విధానమే బాబును దేశంలో గొప్ప రాజనీతిజ్ఞుడిగా నిలబెట్టింది. ‘నేను సార్(తండ్రి)తో పోటీ పడలేను. ఆయనతో పోటీపడటం ఎవరికైనా కష్టం. ఒకపని మొదలుపెడితే అది పూర్తయ్యేవరకూ ఆయన నిద్రపోరు. మమ్మల్ని నిద్రపోనివ్వరు. పనిచేయకపోతే నాకూ అందరిలా మందలింపులు తప్పవు. కొడుకు కదా అని నాకేమీ మినహాయింపులుండవు. అలాంటి తీరు ఆయనది. అందుకే నేను ఎప్పటికైనా ఆయనతో పోటీ పడాలని కోరుకుంటా’నని బాబు తనయుడు, మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.
సూటుతో ఒకే ఒక్కసారి
విదేశాలకు వెళ్లినా ఎప్పుడూ ప్యాంటు, షర్టు వేసుకునే కనిపించే బాబు ఒకే ఒక్కసారి మాత్రం సూటుతో దర్శనమిచ్చారు. ఆయన రెవిన్యూ-ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో జరిగిన ఓ సమావేశానికి హాజరైన సందర్భంగా సూటుతో హాజరయ్యారు. అది మినహాయించి ఎప్పుడూ సూటుతో కనిపించలేదు. చలికి గడ్డకట్టే కొన్ని దేశాలకు వెళ్లినప్పుడు కూడా లోపల ఇన్నర్ తప్ప, చివరకు కోటు కూడా వేసుకోని జీవనశైలికి అలవాటుపడ్డారు. ఆయనతో వెళ్లిన మంత్రులు, అధికారులు జర్కిన్, ఇన్నర్లు, చేతికి గ్లౌజులతో కనిపిస్తుంటారు.
ఇదీ బాబు లైఫ్‌స్టైల్!
క్రమశిక్షణ, పనిపట్ల అంకితభావం, సహనంతో దేశంలో ప్రధానులను ఎంపిక చేసే కీలక నేత స్థాయికి చేరుకున్న బాబు ఆహారపు అలవాటు, జీవనశైలి భిన్నం. తెల్లవారున 4 గంటలకు కసరత్తులు, యోగా. ఆ తర్వాత నాలుగు లీటర్ల మంచినీరు, ఒక పండు. తర్వాత అరగంట పత్రికాపఠనం. తాను ఫోన్‌లో మాట్లాడవలసిన వారితో ఫోన్ ముచ్చట్లు. మళ్లీ చాలా తక్కువగా అల్పాహారం. తర్వాత కిందికి వచ్చి నేతలతో సమావేశాలు, అధికారులతో సమీక్షలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం పది నిమిషాల్లోనే భోజనం ముగింపు. బాబు కొనే్నళ్ల నుంచి రైస్‌కు దూరంగా ఉంటున్నారు. ఇవన్నీ ఆయన వద్ద కొనే్నళ్ల నుంచి పనిచేస్తున్న మాణిక్యమే దగ్గరుండి చూసుకుంటారు. మళ్లీ సాయంత్రం తనకోసం వచ్చిన వారితో పలకరింపులు. ఎప్పుడైనా తప్ప మధ్యాహ్నం నిద్రపోరు. బాబు దగ్గరకు సాయం కోసం వచ్చే వారిలో అనారోగ్యం, చదువుకు ఆర్థిక సాయం కోసం వచ్చే వారే ఎక్కువ. అధికారంలో లేని రోజుల్లో కూడా తన సాయం కోసం వచ్చిన వారికి ఎన్టీఆర్ ట్రస్టు నుంచి సాయం చేసేవారు. అప్పట్లో రోజుకు కనీసం 30-40 మందికి వివిధ రకాల సాయాలు చేసేవారు. బాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు 25 వేలకు మించి ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు 15, 20 లక్షలు కూడా కొన్ని వేల మందికి ఉదారంగా ఇస్తున్న సందర్భాలున్నాయి.
దటీజ్ లీడర్!
బాబు అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా తనతో ఉన్న వారి బాగోగులు చూస్తుంటారు. కార్యకర్తలతోపాటు అగ్రనేతలు సైతం కష్టాల్లో ఉంటే వారికి దన్నుగా నిలుస్తారు. పోటీ చేసి ఓడిన వారికి, పార్టీని నమ్ముకుని ఆర్థికంగా నష్టపోయిన వారికి తనకు తెలిసిన రాష్ట్రాల్లో పనులు ఇప్పించేవారు. తెలంగాణలో ఇప్పుడు టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లో ఉన్న ఒకనాటి తన సహచరులు, పార్టీ నేతలకు విపక్షంలో ఉన్నప్పుడే పెద్ద కంపెనీలతో మాట్లాడి పనులు ఇప్పించేవారు. ఇప్పుడు తెలంగాణలో మంత్రిగా ఉన్న ప్రముఖుడు అప్పట్లో అనేక శాఖలు నిర్వహించినప్పటికీ, ఆయన కుమార్తె వివాహానికి ఆర్థిక సాయం చేయడం కాకుండా, తన ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే మధ్యలో వచ్చి ఆ కార్యక్రమానికి హాజరైన అరుదైన నాయకత్వ లక్షణం బాబుది. ఆ సమయంలో తన ఇంట్లో వారంతా శుభకార్యంలో ఉంటే, బాబు తన పీఏ రూములో బట్టలు మార్చుకుని మళ్లీ తన ఇంట్లో కార్యక్రమానికి హాజరయిన విలక్షణ వ్యక్తిత్వం. కానీ దురదృష్టవశాత్తూ ఈ విషయంలో వైఎస్‌కు వచ్చిన ప్రచారం బాబుకు రాలేదని పార్టీ ప్రముఖులు చెబుతుంటారు.
అవమానాలు అనేకం!
దేవెగౌడ, గుజ్రాల్‌ను ప్రధాని, బాలయోగిని స్పీకర్, అబ్దుల్‌కలాంను రాష్టప్రతిని చేయటంలో చక్రం తిప్పిన బాబు రాజకీయ జీవితం అంతా పూలపాన్పు కాదు. విపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ చేసిన అవమానాలు దిగమింగారు. అసెంబ్లీలో తననుద్దేశించి చేసి వైఎస్ చేసిన వ్యాఖ్యకు తీవ్రంగా మనస్థాపం చెందారు. చివరకు సొంత సామాజికవర్గ ప్రముఖులు కూడా వైఎస్ వైపు చూసిన రోజులవి. అంతకుముందు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఆయన వల్ల లబ్ధిబ్థిపొందిన పారిశ్రామికవేత్తలు, విపక్ష నేతగా ఉన్నప్పుడు హాజరైన కార్యక్రమాల్లో ఎదురుపడినా పలకరించకుండా పక్కకుతప్పుకుని వెళ్లిన సందర్భాలు ఆయనను బాగా గాయపరిచాయంటారు. అధికారంలో ఉండగా బాబును ఆకాశానికెత్తిన సొంత సామాజికవర్గ మీడియా సంస్థలు విపక్షంలో ఉన్నప్పుడు పట్టించుకోకపోగా, వైఎస్‌కు అనుకూలంగా వ్యవహరించాయి. తనకంటే జూనియర్ అయినప్పటీ రాష్ట్రం కోసం మోదీకి విధేయత ప్రదర్శిస్తూ వచ్చిన ఫొటోలపై సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ, పట్టువిడుపులు ప్రదర్శిస్తున్నారు.
మెస్ సెక్రటరీ నుంచి..
‘అప్పట్లో ఎస్వీ వర్శిటీలో మెస్ సెక్రటరీ అంటే ప్రతిష్ఠాత్మకమైన పదవి. బాబు నాయకత్వ లక్షణాలను అప్పట్లోనే చూశాం. మేమంతా రీసెర్చి స్కాలర్లం. 29 డిపార్టుమెంట్లు ఉండేవి. అప్పట్లో స్కాలర్లకు వీసీలే ఇంటర్వ్యూలు చేసేవాళ్లు. చంద్రబాబుకు తొలి నుంచీ బీసీలు, దళితులంటే గౌరవం.
అప్పట్లోనే ఆయన చైర్మన్ పదవికి ఒక రజకుడిని, సెక్రటరీకి ఒక బలిజను నిలబెట్టి తన ప్యానెల్‌ను గెలిపించుకున్నారు. హాస్టల్‌లోని 80 రూములకు వెళ్లి, వారిని మెప్పించి, ఒప్పించి తెల్లవారుజామున 3 గంటలకు వచ్చేవారు. పని అంటే బాబుకు అంత చిత్తశుద్ధి. బీసీ, ఎస్సీలు అధికారంలో భాగస్వాములు కాకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదని వాదించేవారు. అందుకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఉన్నా సీఎంగా ఉన్నా వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. క్రమశిక్షణ, లౌక్యం, పట్టువిడుపులు, దీక్షా దక్షత, చిత్తశుద్ధి, చేసిన పని పూర్తి చేయాలన్న పట్టుదల, నలుగురినీ సమన్వయం చేసుకునే తత్వం, ఎదుటివారి పట్ల నిజాయితీ, ఎదుటివారి సమస్యలను అర్థం చేసుకునే తత్వం ఉన్నందుకే ఆయన 40 ఏళ్ల ప్రస్థానం విజయవంతంగా సాగుతోంది. నిజానికి బాబు సేవలు దేశానికి అవసరం. ఆయన ఉత్తరాదిలో జన్మించి ఉంటే ఆయనకున్న నాయకత్వ లక్షణాలకు ఎప్పుడో ప్రధాని అయ్యేవార’ని ఎస్వీయూలో బాబుకు సీనియర్ అయిన మాజీ ఐఏఎస్ అధికారి, మిత్రుడైన డాక్టర్ లక్ష్మీనారాయణ తన అనుభవాలను వివరించారు.
* * *