రాష్ట్రీయం

ఆవిరవుతున్న గోదా‘వరి’..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 2: వేసవి తాపం..గోదావరి నదికి శాపంగా మారింది..జీవనది గోదావరి నదిలో అసలే సహజ నీటి లభ్యత అడుగంటిపోయే స్థితిలో వుంటే..ఉన్న ఆ కొద్దిపాటి జలాలు కూడా అమాంతం పెరిగిన ఉష్ణోగ్రతకు ఆవిరైపోతున్నాయి. దీంతో గత వారం రోజులుగా గోదావరిలో నీటి లభ్యత ఎండమావిగా మారిపోయి, రబీ చేలకు నీరందక రైతన్నలు హాహాకారాలు చేస్తున్నారు. గోదావరి డెల్టాల్లోని శివారు ప్రాంతాలకు నీరు అందని పరిస్థితి దాపురించింది. వంతులవారీ విధానంలో కాలువలకు నీరు వదలడం, డ్రెయిన్లకు అడ్డుకట్టలు వేసి, నీటిని మోటార్లు పెట్టి తోడుకుని వినియోగించుకోవడం తదితర విధానాల్లో చుక్క చుక్కను ఒడిసి పట్టి, ఏదోవిధంగా రబీని గట్టెక్కించడానికి రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ శాఖల అధికారులతోపాటు రైతులు మల్లగుల్లాలు పడుతున్నారు.
ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో రబీ వరి చిరుపొట్ట దశలో వుంది. ఈ దశలో నీటి అవసరాలు అధికంగావుంటాయి. ఈ ఒక్క నెల రోజుల పాటు పూర్తిస్థాయిలో నీటిని అందించగలిగితే అత్యధిక దిగుబడులు సాధించవచ్చు. వాస్తవానికి మార్చి నెలాఖరుకు రబీ నీటి విడుదల షెడ్యూలు పూర్తవుతుంది. అయితే నాట్లు ఆలస్యం కావడం తదితర కారణాలవల్ల అదనంగా మరో సుమారు ఇరవై రోజుల వరకు అదనంగా నీటిని సరఫరా అవసరమవుతోంది. దీనితో జల వనరుల శాఖ కసరత్తుచేస్తోంది. రబీ పంటకు నీటి అవసరాలు తగ్గిపోయిన తర్వాత ఏప్రిల్ 20 వరకు వేసవి మంచినీటి అవసరాలకు నీటిని సమ్మర్ స్టోరేజి ట్యాంకుల్లో నింపుకునేందుకు ఏర్పాట్లుచేస్తారు. ఈ చివరి 20 రోజులు కూడా ఇటు మంచినీటి అవసరాలకు సరఫరా చేయడంతో పాటు, రబీ పంట అవసరాలకు కూడా నీటిని అందించాలి. లేకపోతే రబీ పూర్తి స్థాయిలో గట్టెక్కదు. ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 6.82 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రబీ సాగు చేపట్టారు. గోదావరి నదిలో సహజ నీటి లభ్యత తక్కువగావుండటంతో ఈ సీజన్ ఆరంభం నుంచి సీలేరు జలవిద్యుత్ కేంద్రం జలాలపైనే ఆధారపడి, నీటిని సమకూర్చుకుంటున్నారు. ఇప్పటి వరకు సీలేరు నుంచి గోదావరి నదికి 46 టీఎంసీల నీటిని మళ్ళించి వినియోగించారు. ఇప్పటి వరకు గోదావరి నది నుండి కేవలం 16 టీఎంసీల నీరు మాత్రమే సహజంగా లభించింది. రబీకి సంబంధించి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు కలిపి మొత్తం ఇప్పటి వరకు 65 టీఎంసీలు వినియోగించారు. దాదాపు 89 టీఎంసీల నీటితో రబీని గట్టెక్కించవచ్చనే అంచనాతో మొత్తం ఆయకట్టులో సాగుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇంకా సీలేరు నుంచి గోదావరి నదిలో 13 నుంచి 14 టిఎంసిల వరకు నీరువచ్చే అవకాశం కన్పిస్తోంది. ఇంకా సుమారు 9 టీఎంసీల వరకు నీరు లభిస్తే ఇబ్బంది తలెత్తదు. ప్రస్తుత తరహాలోనే నీటి యాజమాన్యం చేసుకుంటే రబీ నుంచి గట్టెక్కవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా వేసవి తాపం పెరిగిపోవడంవల్ల గోదావరి నీటితోపాటు సీలేరు జలాలు కూడా ఆవిరై ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతమైతే రబీకి ఎటువంటి ఢోకా ఉండబోదని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుంచి మూడు డెల్టాలకు 100 డ్యూటీపై నీటిని సరఫరాచేస్తున్నారు. బ్యారేజి వద్ద 13.02 మీటర్ల నీటి మట్టాన్ని నిర్వహిస్తూ మొత్తం మూడు డెల్టాలకు 8840 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో తూర్పు డెల్టాలకు 2520 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 1640 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 4380 క్యూసెక్కుల జలాలను విడుదల చేస్తున్నారు. సీలేరు నుంచి రోజుకు 7000 నుంచి 7500 క్యూసెక్కుల జలాలు గోదావరి నదిలో కలుస్తున్నాయి. ఇందులో 4,500 క్యూసెక్కుల జలాలు మోతుగూడెం విద్యుత్ వినియోగం అనంతరం సీలేరు నుంచి విడుదలయ్యే జలాలు కాగా, మరో 3000 క్యూసెక్కులు మాత్రం విద్యుత్ ఉత్పత్తికి వినియోగించకుండా బైపాస్ ద్వారా నేరుగా గోదావరి నదిలోకి మళ్ళిస్తున్నారు. ఈ విధంగా మొదటి నుంచీ సీలేరు జలాలే గోదావరిలో సమృద్ధిగా ప్రవహించి రబీ అవసరాలు తీర్చుతున్నాయని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. వరదల సమయంలో రోజుకు లక్షలాది క్యూసెక్కుల జలాలు సముద్రం పాలయ్యే స్థితి నుంచి ప్రస్తుతం గోదావరి నదిలో రోజుకు సహజ నీటి లభ్యత 600 నుంచి 700 క్యూసెక్కుల లభ్యతకు దిగజారిపోయింది. నీరు ఆవిరై నదీ గర్భంలో ఇసుక తినె్నలు తేలిపోతున్నాయి. రేవులకు దూరంగా గోదావరి పాయలు కన్పిస్తున్నాయి.

చిత్రాలు..సహజ నీటి లభ్యత తగ్గిపోవడంతో గోదావరిలో కనిపిస్తున్న ఇసుక దిబ్బలు * డ్రెయిన్ల నుంచి తోడిన నీటిని వరిచేలోకి పెడుతున్న దృశ్యం