రాష్ట్రీయం

త్రిపురలో చక్రం తిప్పిన ‘తేజం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 3: దేశం నివ్వెరపోయేలా, తిరుగులేని కమ్యూనిస్టుల కోట బద్దలయ్యేలా వెల్లడయిన త్రిపుర, నాగాలాండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమల వికాసానికి ఓ తెలుగు వ్యక్తి కారకులయ్యారు. అసలు అక్కడ ఒక్క కౌన్సిలర్ కూడా లేని తన పార్టీని, ఏకంగా అధికారంలోకి తీసుకువచ్చే స్థాయిలో వ్యూహరచన చేసిన ఆ తెలుగు నేత ఇప్పుడు పార్టీలో ట్రబుల్‌షూటర్ అవతారమెత్తారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్! ఏళ్ల తరబడి అక్కడే మకాం వేసి విసుగు విరామం లేకుండా, స్థానిక సమస్యలు, కొత్త నినాదాలను కనుగొని కొత్త తరానికి పార్టీని చేరువ చేయడంలో రాంమాధవ్ వ్యూహరచన.. బీజేపీని శూన్యం నుంచి అద్భుతం వరకూ పయనించేలా చేసింది.
ఏపీకి చెందిన రాంమాధవ్ సంఘ్ నుంచి బీజేపీ అధికార ప్రతినిధి, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగినప్పటికీ మూడేళ్ల నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. మోదీకి అత్యంత నమ్మకమైన నేతల్లో ఒకరైన రాంమాధవ్ ఈశాన్య రాష్ట్రాల బాధ్యతతోపాటు, పార్టీ పక్షాన విదేశాంగ వ్యవహారాలు కూడా చక్కబెడుతున్నారు. మోదీ విదేశీ పర్యటనలకు ముందుగానే అక్కడికి వెళ్లి, ఆయా దేశాల రాజకీయ, ఆర్థిక, విదేశీ విధానాలు, స్థానిక పరిస్థితులను అధ్యయనం చేయడం, మోదీ తిరిగి స్వదేశానికి వచ్చిన తర్వాత మళ్లీ అక్కడికి వెళ్లి ఆయా దేశాల స్పందన, ఇతర అంశాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. గతంలో కేంద్రమంత్రి వర్గ విస్తరణ సమయంలో ఆయనకు విదేశాంగ శాఖ ఇస్తారన్న ప్రచారం జరిగినా, తాను పార్టీ సేవకే పరిమితమవుతానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
తాజాగా జరిగిన త్రిపుర, నాగాలాండ్ ఎన్నికల్లో బీజేపీని విజయ శిఖరాలకు చేర్చడంలోనూ ఆయనే కీలక పాత్ర పోషించారు. ‘మార్చుదాం రండి’ అన్న నినాదం త్రిపుర ఓటర్లపై సమ్మోహనాస్త్రంగా పనిచేసింది. గత 25ఏళ్ల నుంచీ వామపక్షనీడలో విసిగి వేసారిన త్రిపుర ప్రజలకు ఆ నినాదంతోపాటు, నిరుద్యోగులకు ఉపాధి, ప్రభుత్వోద్యోగులకు వేతనాల పెంపు, అభివృద్ధి నినాదాలను తెరపైకి తీసుకువచ్చి, వాటిని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడంలో రాంమాధవ్ ముఖ్య భూమిక పోషించారు. వీటికి మించి అక్కడి బెంగాలీ ఓటర్లకు, గిరిజనులకు చేరవయ్యేందుకు గత మూడేళ్ల నుంచి ఆయన ఆ రాష్ట్రంపైనే ఎక్కువ దృష్టి సారించారు. అక్కడే కొనే్నళ్లుగా క్షేత్రస్థాయిలో పనిచేసిన సీనియర్ సంఘ్ నేత సునీల్ దేవధర్‌ను సమన్వయం చేసుకుని, 25 ఏళ్ల వామపక్ష ‘సర్కారు’ను కూలదోయడంలో మాధవ మంత్రం బాగా పనిచేసింది.
అంతకుముందు ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అసోంలో కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలున్న బీజేపీని అనూహ్యంగా అధికారంలోకి తీసుకురావడం, మణిపూర్‌లో అసాధ్యమైన అధికారాన్ని సుసాధ్యం చేయడం, అత్యంత కీలకమైన కశ్మీర్‌లో అంచనాలకు మించి బీజేపీ సీట్లు సాధించడంలోనూ ‘మాధవ మంత్రమే’ పనిచేసిందన్నది బహిరంగ రహస్యమే. కాషాయదళం కలలో కూడా ఊహించని తాజా రెండు అద్భుతాల సాధనలో ఓ తెలుగు నేత చక్రం తిప్పడమే విశేషం.
కర్నాటకలోనూ ఇవే ఫలితాలు: రఘురాం
వచ్చే కర్నాటక ఎన్నికల్లోనూ ఈ ఫలితాలే పునరావృతం కానున్నాయని ఢిల్లీలో ఏపీ బీజేపీ సమన్వయకర్త పురిఘళ్ల రఘురాం జోస్యం చెప్పారు. ‘ఒక్క కౌన్సిలర్ సీటు కూడా లేని త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ గెలుస్తుందని మీరెవరైనా ఊహించారా? 5సీట్లున్న అసోం, నాలుగు సీట్లున్న హర్యానాలో మేం అధికారంలోకి వచ్చాం. ఇక ఈశాన్యం బీజేపీ పరం కాబోతోంది. అక్కడున్న 25 ఎంపీ సీట్లలో 20 సీట్లు అవలీలగా సాధిస్తామని ఈ అద్భుత విజయమే చెబుతుంది. మోదీ-అమిత్‌షా జోడీని ప్రజలు ఆదరిస్తున్నారు. విపక్షాల జీఎస్టీ, పెద్దనోట్ల రద్దుతో ప్రజల కష్టాల ప్రచారంలో పసలేదని ఈ ఎన్నికల ఫలితాలు చాటాయ’ని విశే్లషించారు. అసలు ఒక్క సీటూ లేని ఈశాన్యంలోనే అధికారంలోకి వచ్చిన తాము, నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలున్న ఏపీలోనూ నిర్ణాయక పాత్ర పోషించడం పెద్ద కష్టం కాదన్నారు. ఇప్పటికే 32 వేల పోలింగ్‌బూత్‌లలో తమ పార్టీ కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేస్తున్నారని, శక్తికేంద్రాలను పటిష్టం చేస్తున్నామన్నారు.

చిత్రం..త్రిపుర ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం అగర్తలలో కార్యకర్తలతో కరచాలనం చేస్తున్న రామ్‌మాధవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బిప్‌లాబ్ కుమార్ దేవ్