రాష్ట్రీయం

దండకారణ్యంలో దారెటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, మార్చి 4: ‘తుపాకీ వదలాల్సి వస్తే పక్కవాడికి అప్పగించు.. కింద మాత్రం పెట్టకు’ అనే సిద్ధాంతంతో దశాబ్దాలుగా చత్తీస్‌గఢ్ - తెలంగాణకు ఆనుకొని ఉన్న దండకారణ్యంలో వేళ్లూనుకున్న మావోయిస్టు ఉద్యమం నేడు దారీతెన్నూ తెలియక సతమతమవుతోంది. వరుస ఎన్‌కౌంటర్లతో అగ్రనేతలు, కేడర్‌ను కోల్పోయి నిలువునా కుదేలవుతోంది. గిరిజనుల మద్దతు కోల్పోయి, పోలీసులు ఒత్తిళ్లు పెరిగిపోయి, పుంజుకునే సమయంలోనే ఎదురుదెబ్బలు తగలడంతో అడవి పార్టీ ఆత్మవిమర్శ చేసుకుంటోంది. కుదేలవుతున్న ఉద్యమానికి కొత్త ఊపిరి పోసేందుకు మావోయిస్టులు ఏడాదిన్నరగా సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. దండకారణ్యంలో జరిగే వేసవి పండుగలను వేదికగా చేసుకుని సభలు, సమావేశాలు నిర్వహించడం ద్వారా యువతను ఆకర్షించడం మొదలుపెట్టారు. తమపై నిర్బంధం ప్రయోగిస్తున్న పోలీసు బలగాలకు సవాల్ విసిరేలా హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నారు. అయితే రానురానూ పోలీసులు అప్రమత్తమై మావోల వ్యూహాలకు గండి కొడుతున్నారు. ఒకవైపు తమపై తుపాకీ ఎక్కుపెడుతూనే మరోవైపు కేడర్‌ను, సానుభూతిపరులను పోలీసులు దెబ్బతీస్తున్న విషయాన్ని మావోయిస్టులు గ్రహించారు. దీంతో తమవారిని చంపిన పోలీసులను, అధికారంలో ఉన్న పార్టీల నేతలను టార్గెట్ చేస్తూ పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
నిలిచిపోయిన కేడర్, ఆయుధాల వృద్ధి
మావోయిస్టు ఉద్యమాన్ని కేడర్ కొరత వేధిస్తోంది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి చురుకైన కార్యకర్తలను రప్పించి కేడర్‌ను పెంచుకోవడంతో పాటు అగ్రనాయకత్వంలో మార్పులు చేయాలని భావిస్తున్నారు. దానిలో భాగంగా పూజారి కాంకేర్ జిల్లాలో 15 రోజుల నుంచి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ సమావేశాలపై కూడా పోలీసులు ఈ నెల 2న దాడి చేసి కాల్పులు జరిపారు. మరోవైపు మావోలు తమకు అవసరమయ్యే ఆయుధాలను, ఆయుధ సామగ్రిని దండకారణ్యంలోని గ్రామాల్లో వ్యాపారాలు, కాంట్రాక్టు పనులు చేసేవారి నుంచే సమకూర్చుకుంటున్నారు. అయితే కొంతకాలంగా పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. మావోయిస్టులకు ఆయుధాల సరఫరాను నిలిపివేసేందుకు నిఘా పెట్టారు. దీంతో పలు సందర్భాల్లో వ్యాపారులు, కాంట్రాక్టర్లు పోలీసులకు చిక్కారు.
ప్రభుత్వంపై తిరుగుబాటు
ఉద్యమ ప్రాంతంలో గిరిజనులపై మావోయిస్టు ముద్ర వేస్తున్నారనేది మావోయిస్టుల ప్రధాన ఆరోపణ. అలాగే పోలీసుల వేధింపులు, ఒత్తిళ్ల వల్లనే చాలామంది లొంగిపోతున్నారని అనేకసార్లు వారు విడుదల చేసిన లేఖల్లో పేర్కొన్నారు. అయితే తమకు శత్రువులుగా భావించే పోలీసులను దీటుగా ఎదుర్కొంటూనే.. ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు వారు వ్యూహం రచించినట్లు తాజా సంఘటనలను బట్టి తెలుస్తోంది. గతంలో వరంగల్ ఎన్‌కౌంటర్ బూటకమని మావోలు ప్రకటించినా, ప్రభుత్వంపై మాత్రం విమర్శలు చేయలేదు. తాజాగా తెలంగాణ - చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్ నేతలే తమ లక్ష్యమని లేఖ విడుదల చేసిన మావోయిస్టులు తమ వ్యూహాన్ని చెప్పకనే చెప్పారు. సాధారణంగా అధికార పార్టీ నేతలపై విరుచుకుపడితే ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతుందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ చర్ల సమీపంలో ఆరుగురు అధికార పార్టీ నేతలను మావోయిస్టులు అపహరించుకుపోయినా ఎలాంటి హాని తలపెట్టలేదు. తాజాగా టీఆర్‌ఎస్ నేతలే తమ లక్ష్యమని పేర్కొనడంతో అధికార పార్టీ నేతల్లో అలజడి మొదలైంది. ప్రభుత్వంపై ఎదురుదాడిని పెంచి తమ కేడర్‌ను నిలుపుకునేందుకు, పోలీసులు సైతం ప్రస్తుత దాడులు ఆపేలా మావోయిస్టు పార్టీ సిద్ధపడినట్లు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య సర్వత్రా ఉద్రిక్తత నెలకొంది.
నేతల్లో గుబులు
ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా టీఆర్‌ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకుంటామని మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేయడంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ప్రతీకారం తీర్చుకునేందుకు మావోలు హింసాత్మక సంఘటనలకు పాల్పడతారనే నిఘా వర్గాల సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలకు పోలీసు శాఖ ముందస్తు జాగ్రత్త సూచనలు జారీ చేసింది. దీంతో రెండ్రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అధికార పార్టీ శ్రేణుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల 3న శ్రీరామనవమి ఏర్పాట్లపై నిర్వహించాల్సిన సమీక్ష సమావేశాన్ని రద్దు చేశారు. ఇక భద్రాచలం మన్యంలోని నేతలంతా సురక్షిత ప్రాంతాలకే పరిమితమయ్యారు. తమకు చెప్పకుండా అధికార పార్టీ నేతలు గ్రామాల్లో పర్యటనలకు వెళ్లకూడదన్న పోలీసుల హెచ్చరికలతో వారిలో భయాందోళనలు నెలకొన్నాయి.