రాష్ట్రీయం

తేల్చకుండానే.. తరలిస్తున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని తరలింపుపై గత ఏడాది నుంచి చర్చ జరుగుతున్నా, ఉద్యోగుల సమస్యలు నేటికీ పరిష్కారం కాకపోవడం అడ్డంకిగా మారింది. సిఎం చంద్రబాబు బుధవారం అమరావతిలో తాత్కాలిక సచివాలయ భవనాల సముదాయానికి శంకుస్థాపన చేయడంతో హైదరాబాద్‌లోని సచివాలయంతోపాటు హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. సచివాలయంతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న 15 వేలమంది ఉద్యోగులు తక్షణమే విజయవాడ వెళ్లాల్సి ఉంటుంది. అలాగే తొమ్మిదో షెడ్యూల్, పదో షెడ్యూల్ పరిధిలోకి వచ్చే సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మరో 10 వేలమంది వరకూ ఉంటారు. వీరుకాకుండా ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారు మరో ఐదువేల నుండి 10 వేల వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల గురించి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న సమస్యల్లో ‘లోకస్ స్టేటస్’ ప్రధానమైంది. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారుగా పరిగణింపబడుతున్నారు. ఈ ఉద్యోగులు విజయవాడ వెళ్తే ఏపీ రాష్ట్రంలో లోకల్‌గా పరిగణింపబడరు. ఇందుకోసం కేంద్రం అనుమతి రావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై అధికారికంగా లేఖ పంపించినప్పటికీ, కేంద్రం నుండి పాజిటివ్‌గా స్పందన రాలేదు. వాస్తవంగా ఇది చిన్న సమస్యగా అనిపించినప్పటికీ, ఉద్యోగుల పిల్లలకు సంబంధించి ‘జీవిత సమస్య’గా మారింది. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందా అంటూ ఉద్యోగులంతా ఎదురు చూస్తున్నారు.
అలాగే ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఎ) మరో సమస్య. ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఎ 30శాతం లభిస్తోంది. వీరు విజయవాడ వెళ్లగానే ఇది 20శాతానికి పడిపోతుంది. జనాభా ప్రాతిపదికన హెచ్‌ఆర్‌ఏను నిర్ణయిస్తుండటం వల్ల ఉద్యోగులు విజయవాడ వెళ్లగానే మొట్టమొదటి వేతనంలో 10శాతం హెచ్‌ఆర్‌ఎ తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశంలో ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు కనిపించినా, ఉద్యోగులకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంటుంది. పిల్లల చదువుకు సంబంధించి అడ్మిషన్ల అంశం మరో సమస్యగా ఉంది. కేంద్రీయ విద్యాలయాల్లో, వివిధ సెట్ (కామన్ ఎంట్రన్స్ టెస్ట్)లలో ఇప్పటికే ప్రవేశాల కార్యక్రమం మొదలైంది. ఉద్యోగుల పిల్లలకు సంబంధించి ఈ అంశంపై ప్రభుత్వ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇప్పటి వరకు వెల్లడించలేదు. పదవీ విరమణకు కేవలం మరో రెండు మూడేళ్లు మాత్రమే ఉన్న ఉద్యోగులు మానసికంగా నలిగిపోతున్నారు. ఈ పరిస్థితిలో విజయవాడకు వెళ్లడం వల్ల అనేక సాంకేతిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు వాపోతున్నారు.
అండగా ఉంటాం: ఉద్యోగ నేతలు
ప్రభుత్వం తీసుకునే చర్యలకు అండగా ఉంటామని ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జెఎసి చైర్మన్ కెవి కృష్ణయ్య, కన్వీనర్ యోగీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ రాజధాని తరలింపు కీలకమైన అంశమన్నారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న తాము (ఉద్యోగులంతా) విజయవాడ/ అమరావతి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వివిధ సమస్యలపై తాము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్‌తో చర్చించామని, సమస్యల పరిష్కారానికి టక్కర్ సానుకూలంగా ఉన్నారన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో సిఎం చంద్రబాబు చొరవ చూపాలని కోరారు. ప్రభుత్వం చేపట్టే పథకాలు, కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నామని గుర్తు చేశారు.