రాష్ట్రీయం

ఆర్గనైజర్లదే కీలకపాత్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, మార్చి 20: ప్రభుత్వ అనుమతి లేని బీటీ-3 పత్తి విత్తనాలను అక్రమంగా సాగుచేయించడంలో ఆర్గనైజర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. అమాయక రైతులను బుట్టలో వేసుకుని కోట్లాది రూపాయల అక్రమ సంపాదనకు పలు విత్తన కంపెనీలు తెరలేపాయి. బీటీ-3 పత్తి సాగు చేయకూడదని, మార్కెటింగ్ చేయరాదని ఓవైపు ఉత్తర్వులు ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి వసతి ఉన్న అమాయక రైతులను ఎంపిక చేసుకుని బీటీ-3 విత్తన పత్తి సాగుచేస్తే గంప గుత్తగా దిగుబడి వస్తుందని, అదంతా తామే కొంటామని చెప్పి మాటమాత్రపు ఒప్పందంతో విత్తన కంపెనీల ఆర్గనైజర్లు కర్నూలు కేంద్రంగా తిష్టవేసి నంద్యాల ప్రాంతంలో భారీ విస్తీర్ణంలో బీటీ-3 విత్తన పత్తి సాగు చేయిస్తున్నారు. బీటీ-3 పత్తి సాగుచేస్తున్న రైతుల పేర్లు బయటకు రాకుండా చూస్తున్నారు. అసలు పత్తి పంట సాగుచేయని రైతుల పేర పంట సాగుచేసినట్లు ట్రాన్సిట్ పర్మిట్లు పుట్టించి నంద్యాలలోని మిల్లుల్లో జిన్నింగ్ చేయించి విత్తనాలను అక్రమంగా కర్నాటక, తెలంగాణ, ఏపీలోని కొన్ని జిల్లాలకు రవాణా చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి మార్చి నెలఖరు వరకు పత్తి జిన్నింగ్ చేయగా వచ్చిన విత్తనాలను కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ, రాయచూరు, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు, గద్వాలతోపాటు కర్నూలు నగరంలోని ఖరీదైన అపార్టుమెంట్లలో నిల్వ చేస్తున్నారు. పత్తి విత్తనాలను శుద్ధి చేసి ఆకర్షణీయమైన బ్రాండెడ్ విత్తన కంపెనీల పేర్లతో 450 గ్రాములు చొప్పున ప్యాకింగ్ చేసి ఒక్కో ప్యాకెట్ రూ.1000 నుండి రూ.1500 వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కోట్లలో జరుగుతున్న ఈ మొత్తం వ్యాపారం జీరో బిజినెస్ కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పైసా పన్ను కట్టకుండా విత్తన కంపెనీలు దాటవేస్తున్నాయి.
పంట సాగులో వ్యవసాయాధికారుల పాత్ర
రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానం జోడించి ప్రతి గ్రామంలో ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగుచేస్తున్నది ట్యాబ్‌లలో డాటా నిక్షిప్తం చేసి వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంది. అయితే ఈ ప్రాంతంలోని వ్యవసాయాధికారులు గుట్టుగా తమ ట్యాబ్‌లలో ఎక్కడా బీటీ-3 సాగుచేస్తున్నట్లు నమోదు చేసిన దాఖలాలు లేవు. విత్తన కంపెనీల ఆర్గనైజర్లతో చేతులు కలిపి లక్షలు దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీటీ-3 విత్తన పత్తి కోత దశ నుండి జిన్నింగ్ పూర్తయ్యేంత వరకు వ్యవసాయాధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నప్పటికీ ఎక్కడా కూడా సాగుచేస్తున్నట్లు, జిన్నింగ్ చేస్తున్నట్లు వెల్లడించకపోవడం గమనార్హం. ఆర్గనైజర్లతో చేతులు కలిపిన స్థానిక వ్యవసాయ అధికారులు విజిలెన్స్ అధికారుల కదలికలను ముందే గుర్తించి ఆర్గనైజర్లకు రహస్యంగా సమాచారం చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మార్చి 12న నంద్యాల పట్టణంలో వ్యవసాయాధికారుల కన్నుగప్పి రెండు లారీల బీటీ-3 పత్తి విత్తనాలను అక్రమ రవాణా చేస్తుండగా గుర్తించిన అధికారులు ఆ లారీలను పట్టుకుని విత్తన ఆర్గనైజర్లతో బేరసారాలు నెరిపినట్లు సమాచారం. వారి నుంచి రూ.28 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఆ మరుసటి రోజు 13వ తేదీ రాత్రి అయ్యలూరు మెట్ట సమీపంలోని ఓ జిన్నింగ్ మిల్లు నుండి కర్నాటక రాష్ట్రానికి చెందిన ఒక మినీ లారీలో చిత్రదుర్గకు విత్తనాలు తరలిస్తున్నారన్న సమాచారం వ్యవసాయాధికారులకు అందినప్పటికి అక్రమ రవాణాను అడ్డుకోకపోగా ఆర్గనైజర్ల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్లు తెలిసింది. నంద్యాల పట్టణంలోని 14 జిన్నింగ్ మిల్లుల్లో ఫిబ్రవరి నెల అంతా బీటీ-3 విత్తన పత్తి రాత్రి పూట రహస్యంగా జిన్నింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు.
బీటీ-3 విత్తన పత్తి సాగు వివరాలు
నంద్యాల డివిజన్‌లోని పలు మండలాల్లో గత ఏడాది బీటీ-3 విత్తన పత్తి విస్తృతంగా సాగైంది. దొర్నిపాడు మండలంలోని రామచంద్రాపురం, భాగ్యనగరం, పాంపల్లె, చింతకుంట్ల, అమ్మిరెడ్డినగర్, అర్జునాపురం, కొండాపురం, గోస్పాడు మండలంలోని ఒంటెలగల, శ్రీనివాసపురం, ఉమాపతినగర్, ఎం.కృష్ణాపురంతోపాటు అనేక గ్రామాల్లో బీటీ-3 పత్తి సాగుచేసినట్లు సమాచారం. సాగునీటి వసతి కలిగిన ఎకరా పొలంలో బీటీ-3 విత్తన పత్తి సాగుచేస్తే కనీసంగా 5 క్వింటాల పత్తి దిగుబడి వస్తుంది. ఐదు క్వింటాల పత్తిని జిన్నింగ్ చేయిస్తే 3 క్వింటాళ్ల విత్తనాలు చేతికి వస్తాయి. ఈ పత్తి విత్తనాలను రహస్య ప్రాంతాలకు తరలించి గ్రేడింగ్ చేసిన అనంతరం కనీసం రెండున్నర క్వింటాళ్ల నిఖార్సయిన పత్తి విత్తనం ఆర్గనైజర్ల చేతికి వస్తుంది. అయితే విత్తన పత్తి సాగుచేసిన రైతుకు దక్కేది కనీస ధర మాత్రమే.
బినామీ రైతుల పేరిట ట్రాన్సిట్ పర్మిట్లు
బీటీ-3 విత్తన పత్తి సాగుచేసిన రైతుల పేరిట కాకుండా, అసలు పత్తి పంట సాగుచేయని రైతుల పేరిట ఆర్గనైజర్లు ట్రాన్సిట్ పర్మిట్లు పుట్టించి అక్రమంగా జిన్నింగ్ మిల్లుల్లో రైతుల పేరిట పత్తి జిన్నింగ్ చేస్తున్నారు. ఉదాహరణకు గోస్పాడు మండలం ఒంటెలగల గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి పేర టీసీ తీసుకున్న ఆర్గనైజర్లు ఆయన పొలంలో పండించిన విత్తన పత్తి 2365 కేజీలు కొనుగోలు చేయగా, అందులో నుండి 59 బస్తాల పత్తి విత్తనాలు వచ్చాయని బోగస్ జాబితా సిద్ధం చేసి తతంగం నడిపించారు. ఇదే గ్రామానికి చెందిన సుబ్బరాయుడు, మధుసూదన్, బాలయేసన్న, కాశీంబాష పేర్లమీద ట్రాన్సిట్ పర్మిట్లు తీసుకున్న దాఖలాలు ఉండగా ఆయా రైతులను విచారిస్తే తాము పత్తి పంటనే సాగుచేయలేదని లబోదిబోమంటున్నారు. మొత్తం మీద నిషేధించిన బీటీ-3 విత్తన పత్తి రహస్యంగా సాగుచేస్తూ కోట్లలో అక్రమ వ్యాపారం చేస్తున్న సీడ్ కంపెనీలపై ప్రభుత్వం గట్టి నిఘా వేసి కేసులు నమోదు చేయాలని రైతులు అంటున్నారు. బీటీ-3 సాగు చేసిన రైతులు, ఆర్గనైజర్లు, విత్తన కంపెనీలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టే అవకాశాలు ఉన్నప్పటికీ వ్యవసాయాధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.

చిత్రాలు..లారీలో కర్నాటకకు బీటీ-3 పత్తి వితనాలు తరలిస్తున్న దృశ్యం..
* రైతు చంద్రశేఖర్‌రెడ్డి పేర తీసిన ట్రాన్సిట్ పర్మిట్