రాష్ట్రీయం

రాజీలేదు.. రణమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 27: రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ ప్రసక్తి లేదని, రాష్ట్రానికి అన్యాయం జరిగితే పోరాడి సాధించేవరకూ విశ్రమించేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత నాలుగేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హోదా ఇస్తామని నమ్మించి మోసం చేసిందని, ముందే మనం పోరాటం ప్రారంభిస్తే నిధులు ఆపేస్తారన్న కారణంతోనే తొందరపడకుండా ఈ నాలుగేళ్లూ ఒత్తిడి చేశామన్నారు. అయితే చివరి బడ్జెట్‌లోనూ రిక్తహస్తం చూపటం వల్లే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి పోరాడాల్సి వస్తోందన్నారు. అందరినీ సమన్వయం చేసుకెళ్లేందుకు తనకెలాంటి భేషజాలు లేవని ముందుగానే చెప్పానని, అందుకే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏంచేస్తే బాగుంటుందన్న సూచనలు, సలహాల కోసం అత్యవసరంగా అఖిలపక్షం నిర్వహించామని బాబు వివరించారు. మంగళవారం సచివాలయంలో దాదాపు ఐదు గంటల పాటు జరిగిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ప్రారంభోపన్యాసం చేశారు. విభజన సమయంలో రాష్ట్రం కోసం పోరాడిన సంఘాలు, ఇప్పుడు పోరాడుతున్న సంఘాలను అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించామని,
బీజేపీ, జనసేన, వైసీపీ రాలేదన్నారు. ఏరోజుకు ఆరోజు అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో చర్చ జరుగుతుందని ఆశించామని, ఇప్పుడు దాదాపు జాతీయస్థాయిలో అన్ని రాజకీయ పక్షాలు మన సమస్యపై పార్లమెంటులో చర్చకు ఆమోదం తెలిపాయని గుర్తుచేశారు. ముఖ్యమైన అంశాలపై అన్ని రాజకీయ పక్షాలకు పెన్‌డ్రైవ్ ద్వారా సమాచారం అందిస్తున్నామని, మనం ఖర్చు చేసిన నిధులపై కేంద్రానికి సమర్పించిన పత్రాల నకళ్లు కూడా జత చేస్తున్నామని వివరించారు. ‘పార్లమెంటు ఉభయ సభల్లో ఆనాడు రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం తెలిపిన విధానం గుర్తుచేసుకుంటే ఇప్పటికీ బాధాకరంగానే ఉంటుంది. రాష్ట్రానికి ఒక జాతీయ పార్టీ నష్టం కలిగించింది కాబట్టి మరో పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకుంటే అది ఏపీ ప్రయోజనాలకు ఉపయోగంగా ఉంటుందని భావించే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. ఈ నాలుగేళ్లలో 29సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, చేయాల్సిన విధులు, నెరవేర్చాల్సిన హామీలను గుర్తుచేశాం. రూ.16వేల కోట్ల ఆర్థిక లోటు గురించి పదేపదే గుర్తుచేశా. ప్రత్యేక హోదా గురించి ఒత్తిడి తెచ్చాం. చివరికి ప్రధానమంత్రికి రాష్ట్రంలో పరిస్థితులు వివరించి చెబితే నీతి ఆయోగ్‌ను పిలిచి ఈ అంశంపై చర్చించారు’ అని బాబు గుర్తుచేశారు. అప్పటికీ ఈ అంశంపై కదలిక లేకపోతే శాసనసభ సమావేశాలకు ముందురోజు మాట్లాడి మళ్లీ ఒత్తిడి చేస్తే, అప్పుడు ప్రత్యేక హోదాతో సమానమైన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారన్నారు. అప్పుడు కూడా తాను ఎక్కడా రాజీపడలేదని, ప్రత్యేక హోదా ద్వారా వచ్చే ప్రతి ప్రయోజనం రాష్ట్రానికి అందాల్సిందేనని స్పష్టం చేశానన్నారు. స్పెషల్ స్టేటస్ ఇక ఏ రాష్ట్రాలకూ ఇవ్వడం లేదని ఈశాన్య రాష్ట్రాలకు ఆ హోదా ప్రయోజనాలు పొడిగిస్తూ జీవో ఇచ్చారన్నారు. ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసుకోవాలని కొత్త పాట అందుకున్నారని, చివరి బడ్జెట్‌లోనయినా ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన కేటాయింపులు చేస్తారని అనుకుంటే రిక్తహస్తం చూపించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరానికి రూ.58వేల కోట్లతో ఎస్టిమేషన్ వేసి డీపీఆర్-2 ఇచ్చామని, రూ.16వేల కోట్లు పోగా ఇంకా ప్రాజెక్టు నిర్మాణానికి రూ.42వేల కోట్లు కావాలన్నారు. అందులో మొత్తం లెక్కవేస్తే రూ.58వేల కోట్లలో, రూ.4వేల కోట్ల విలువైన పవర్ ప్లాంట్ వస్తోందని, భూసేకరణ, పునరావాసానికి రూ.33వేల కోట్లు అవుతుందన్నారు. కాపర్ డ్యామ్ పూర్తయితే ఈ సంవత్సరమే గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే అవకాశం ఉండేదన్నారు. అమరావతికి రూ.1500 కోట్లు ఇచ్చారని, మరో వెయ్యి కోట్లు ఇస్తామన్నారని చెప్పారు. ఆరోజు ప్రధాని ఢిల్లీ కంటే అత్యుత్తమ రాజధాని కడతామని మాటిచ్చి చేతల్లో మొండిచేయి చూపించారన్నారు. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలకు భూ కేటాయింపులు సహా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసిందన్నారు. రూ. 3,500 కోట్లు డిఫర్ ట్యాక్స్ ఈ రాష్ట్రానికి కట్టాల్సిన సంస్థలు ఇప్పటికీ హైదరాబాద్‌లో కట్టే పరిస్థితి ఉందన్నారు. మెట్రో విషయంలో పాలసీ మార్చారని, మెట్రో ఇక్కడ వయబిలిటీ కాదన్నారు. లైట్‌మెట్రో ఇద్దామని చెప్పారని, వేరే రాష్ట్రాలకు మాత్రం ఇలాంటి అభ్యంతరాలు చెప్పకుండా ఉదారంగా ఇస్తూ మన విషయానికి వచ్చేసరికి ఇలా పాలసీ మార్చేస్తున్నారని ఆయన విమర్శించారు. డిస్కమ్ సంస్థల పవర్ బకాయిలు తెలంగాణ నుంచి అడ్జెస్టు చేయిస్తామని చెప్పి ఇంతవరకు తేల్చలేదన్నారు. 9, 10 షెడ్యూల్ వివాదాలను పరిష్కరించలేదని చంద్రబాబు విరుచుకుపడ్డారు.

చిత్రం..హోదా పోరాటంపై అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు