రాష్ట్రీయం

మోదీ..డిక్టేటర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 7: ప్రధాని నరేంద్ర మోదీ ఒక నియంత తరహా నాయకుడని, ఎన్డీఏ నుండి ఆనాడే బయటకు వచ్చి ఉంటే రాష్ట్రానికి మరిన్ని వేధింపులు ఉండేవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. దబాయించి ముందుకు పోవాలనుకుంటున్నారే తప్ప ప్రజల మనోభావాలు గుర్తించి సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన ఆయనకు లేదని ధ్వజమెత్తారు. ఆనాడే ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ఉంటే రాష్ట్రానికి మరిన్ని వేధింపులు ఉండేవని అభిప్రాయపడ్డారు. వెలగపూడి సచివాలయంలో అఖిలపక్షాలు, సంఘాల ప్రతినిధులతో శనివారం సమావేశమైన చంద్రబాబు హోదాపై రాజ్యసభలో ఇచ్చిన హామీని నెరవేర్చకపోవటం, పార్లమెంట్‌లో చేసిన చట్టాన్ని అమలు చేయకపోవటంపై రాష్ట్రంలో నిరసన వ్యక్తమవుతోందన్నారు. ఏపీ హక్కులపై చర్చించటానికి పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించామని, ఇటీవల ఢిల్లీ పర్యటనలో అనేక రాజకీయ పార్టీల నేతలను కలిసి మోదీ రాష్ట్రానికి చేసిన వాగ్దానాలను గుర్తుచేశానన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిందనే విష ప్రచారానికి పూనుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర హక్కుల కోసమే ఢిల్లీకి వెళ్లానని, రాజకీయాల కోసం కాదని అందరికీ స్పష్టంగా చెప్పానని చంద్రబాబు అన్నారు. మోదీకి ఎదురు నిలవటం ద్వారా రాష్ట్ర సమస్యలను జాతీయ స్థాయిలో తీసుకెళ్లగలిగినట్లు చెప్పారు. దబాయించి ముందుకు పోవటమే తప్ప పరిష్కరించే ఆలోచన ప్రధానికి లేదని, మోదీ మాట తప్పారన్న విషయాన్ని జాతీయస్థాయిలో అందరి దృష్టికి తీసుకువెళ్లటంలో తన ఢిల్లీ పర్యటన విజయవంతమైందన్నారు. బీజేపీ తప్ప మిగిలిన పార్టీలన్నీ తమకనుకూలంగానే ఉన్నాయన్నారు. మోదీ ఓ డిక్టేటర్ తరహా నాయకుడని పేర్కొన్న ఆయన రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తెలిసినా తుది నిర్ణయం తీసుకోక తప్పలేదని వివరించారు. రాష్ట్రానికి నష్టం కలిగించాలని అనుకుంటే వారే మరింత నష్టపోక తప్పదని హెచ్చరించారు. తాము తలుచుకోకపోతే రాజధానికి గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ వచ్చేదా అంటూ ఇప్పుడు వారు ప్రశ్నిస్తున్నారంటే వాళ్ల ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతున్నాయని విమర్శించారు. డబ్బులన్నీ కావాలంటున్నామని, నిధులు దుర్వినియోగం చేస్తున్నామని విష ప్రచారం మొదలు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడాలని భావిస్తూ రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు మోదీని గట్టిగా ప్రశ్నించే సాహసం ఎవరూ చేయలేదని, అమిత్‌షా ఇటీవల వాడిన భాష జాతీయ స్థాయిలో ఎవరూ వాడలేదని ఆరోపించారు. మోదీ మాట తప్పారన్న
విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చేయగలిగామని చంద్రబాబు పేర్కొన్నారు. గోద్రా ఘటన నేపధ్యంలో అప్పుడు సీఎంగా ఉన్న మోదీని రాజీనామా చేయమని డిమాండ్ చేసింది తానేనని గుర్తుచేశారు. రెండేళ్ల క్రితమే ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ఉంటే పోలవరం సహా అనేక ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించేవాళ్లని అన్నారు. తెలుగు ఆత్మగౌరవం, కన్నడ ఆత్మగౌరవం, తమిళ ఆత్మగౌరవం అంటూ హేళనగా మాట్లాడారని గుర్తుచేశారు. వాజ్‌పేయి హయాంలో అన్నీ చేయించుకున్నామన్న దుగ్ధ బీజేపీ నేతల్లో ఉందని, అడిగిందల్లా చేసేందుకు ఇదేమైనా వాజ్‌పేయి ప్రభుత్వమా? ఇది మోదీ ప్రభుత్వమని అన్నారన్నారు. ప్రధాని ఇక్కడకు వచ్చినప్పుడల్లా సార్.. అంటూ గౌరవం ఇచ్చి మాట్లాడానని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన అహాన్ని సంతృప్తిపరచటానికి కూడా ఆలోచించలేదన్నారు. మోదీ రాజకీయాల్లో తనకంటే జూనియర్ అని, అయినా ప్రధాని పదవిలో ఉండటంతో ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చామన్నారు. తానేమీ తొందరపడి ఏదీ చేయలేదని, ప్రధాని ధోరణి పూర్తిగా తెలుసుకున్నాకే బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నమ్మకద్రోహం చేస్తున్నారని రూఢీ చేసుకునేవరకు ఎన్డీయేలోనే ఉండి రాష్ట్ర హక్కుల కోసం పోరాడానని అఖిలపక్ష ప్రతినిధులకు వివరించారు. రెండురోజులు రాష్ట్రాన్ని స్తంభింప చేస్తే మోదీ సంతోషిస్తారంటూ.. ఇదే వారు, వారికి వంత పాడుతున్న వాళ్లు కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోవాలన్నదే వాళ్ల అంతర్గత లక్ష్యంగా మండిపడ్డారు. ఈ పోరాటం దారి తప్పితే మరో రూపం తీసుకుంటుందని, అలా జరగాలని కోరుకునే వాళ్లకు అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగితే పరిశ్రమలు వెనుకడుగు వేస్తాయని ఐకమత్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు.

చిత్రం..అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు