రాష్ట్రీయం

పట్టిసీమ.. అవినీతి పుట్ట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 7: కృష్ణాడెల్టాకు నీరిచ్చేందుకు గోదావరి జలాల మళ్లింపులో భాగంగా నిర్మించి పట్టిసీమ ప్రాజెక్టులో అంతులేని అవినీతి చోటుచేసుకుందని బీజేపీ శాసనసభ పక్ష నేత పీ విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. విశాఖలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ టెండర్ల ప్రక్రియలో ఎక్సస్ రేట్లపై ఉన్న నిషేధాన్ని తొలగించడం ద్వారా కాంట్రాక్టరు 22 శాతం ఎక్కువకు కోట్ చేసి నిధులు మింగేశారని ఆరోపించారు. పట్టిసీమ తొలి అంచనాలు రూ.1125కోట్లు కాగా, ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి రూ.1,660 కోట్లకు అంచనాలను పెంచేశారన్నారు. ఇక ప్రాజెక్టు పనుల్లో భాగంగా తీవ్ర అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. డయాఫ్రం వాల్ నిర్మాణంలో భాగంగా మట్టి పనుల్లో క్యూబిక్ మీటర్‌కు రూ.21,313 చెల్లించారని, అంటే ఒక ట్రాక్టర్ మట్టి తీయడానికి రూ.63 వేలు చేల్లించినట్టైందన్నారు. మట్టి పనుల్లోనే సుమారు రూ.80 కోట్లమేర అవినీతి జరిగిందన్నారు. నీటి పంపుల ఏర్పాటు విషయంలో కూడా కాంట్రాక్టరు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు కాగ్ రిపోర్టులో వెల్లడైందన్నారు. నీటి ఎత్తిపోతలకు 30 పంపుసెట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, 24 పంపులు మాత్రమే ఏర్పాటు చేశారన్నారు. అయితే నీటి ఎత్తిపోతల పరిమాణంలో మార్పు లేదని అధికారులు వివరణ ఇస్తున్నారని, పంపుల ఏర్పాటులో మరో రూ.60 కోట్ల మేర నిధులు పక్కదారి పట్టాయన్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో కాంట్రాక్టర్ నుంచి వసూలు చేయాల్సిన లేబర్‌సెస్ రూ.14.22 కోట్లు తొలుత వసూలు చేసి, తిరిగి కాంట్రాక్టరుకు
చెల్లించారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టులో కాగ్ లెక్కలను మాత్రమే తాము ప్రస్తావిస్తున్నామన్నారు. పట్టిసీమ అవినీతితో పాటు ఇసుక దందా, విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణ వంటి అంశాల్లో అవినీతి రాజ్యమేలుతోందని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. వీటిపై ప్రభుత్వం సీబీఐ విచారణ సాధ్యంకాని పక్షంలో సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణకు సిద్ధం కావాలన్నారు. అయితే సీబీఐ విచారణకు ముఖ్యమంత్రి ముందుకురాని పక్షంలో తాను సీబీఐకి ఫిర్యాదు చేసే అంశాన్ని పరిశీలిస్తానని స్పష్టం చేశారు. విశాఖలో జరిగిన భూ కుంభకోణంపై ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు నివేదికను ప్రభుత్వం బహిర్గతపరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై తాను సీఎంను స్వయంగా కలిసి అడిగానని తెలిపారు. నివేదిక బయటకు వస్తే చాలా మంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయన్నారు.
విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ బీజేపీ ప్రభుత్వం ఇచ్చి తీరుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జోన్ తెచ్చేదీ మేమే, ఇచ్చేదీ మేమేనని ఈ సంవత్సరం చివరి నాటికి రైల్వేజోన్‌పై కేంద్రం ప్రకటన చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.