రాష్ట్రీయం

అవి అప్పులు కాదు.. భవిష్యత్ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం చేస్తున్న అప్పులు భవిష్యత్ అవసరాలకు పెట్టుబడులని రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రి కే. తారకరామారావు స్పష్టం చేశారు. మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూం, మిషన్ కాకతీయ వంటి ప్రతిష్టాత్మకప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటూ దుయ్యబడుతున్న అభివృద్ధి నిరోధకులను ప్రజలే నిలదీయాలని మంత్రి పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని ఉప్పల్, నాచారం తదితర ప్రాంతాల్లో రూ.124 కోట్ల అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. నాచారం సమీపంలోని సింగం చెరువు తండాలో నిర్మించిన 176 డబుల్ బెడ్‌రూం ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని విధంగా అభివృద్ధి సంక్షేమ రంగాల్లో తెలంగాణ ముందుకెళ్తుందని, ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతోందన్నారు. అభివృద్ధి నమూనా అంటే గతంలో గుజరాత్ వంటి కొన్ని రాష్ట్రాల పేర్లు మాత్రమే చెప్పేవారని, కానీ నేడు తెలంగాణ సాధిస్తోన్న అభివృద్ధి, సంక్షేమంపై దేశవ్యాప్త చర్చ జరుగుతుందన్నారు. ఇది ఆత్మవిశ్వాసంతో చెబుతున్న మాటగా మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పేద వాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా డబుల్ బెడ్‌రూం ఇళ్లను ‘డిగ్నీటి హౌజింగ్’గా వ్యాఖ్యానించారు. గతంలో పేదల ఇళ్ల నిర్మాణాలు తూతూమంత్రంగా జరిగాయన్నారు. ఒకే గదిలో నివసించటం ఎంత అసౌకర్యమో అందులో నివసిస్తున్న వారికే తెలుస్తుందన్నారు. పేదల ఆత్మగౌరవాన్ని చాటింది రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. గతంలో మూడు రకాలుగా ఆదాయ వనరులను సమకూర్చి, ఒక గది ఇంటి కోసం పేదలను మూడు చెరువుల నీళ్లు తాగించారని, వేధింపులకు గురి చేసి ఆగమాగం చేశారని విమర్శించారు. మరికొన్ని గ్రామాల్లో నిర్మించని ఇళ్లకు కూడా బిల్లులు డ్రా చేసుకున్నారని ఆరోపించారు. పరకాలలో
550 ఇళ్లు కట్టినట్లు బిల్లులు చెల్లింపులు జరిగాయని, వాస్తవానికి 50 ఇళ్లు కూడా నిర్మించలేదన్నారు. ఇల్లు కట్టిచూడు, పెళ్లి చేసి చూడు అన్న పేదల బాధ్యతలను నెత్తినేసుకున్నది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. ఉచితంగా ఇళ్లు కట్టించి, లక్షా 116 ఇచ్చి పెళ్లికీ సాయం చేస్తోన్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. ఈ ఐదేళ్లలో లక్ష్యంగా పెట్టుకున్న 3 లక్షల ఇళ్లను 2019 ఏప్రిల్ లోపు కట్టి చూపిస్తామని ఇటీవలే అసెంబ్లీలో సీఎం ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు.
లక్ష ఇళ్లు హైదరాబాద్‌లో అనుకున్న గడువులోపే పూర్తి చేస్తామన్నారు. ఈ ఇళ్లతో రాష్ట్రంలోని పేదలందరికీ డబుల్ ఇళ్లు రావని అంటూ, నిధులను బట్టి ఇళ్లను నిర్మించుకుంటూ ప్రతి పేద వాడికీ డబుల్ ఇళ్లను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నిర్మించే 3 లక్షల డబుల్ ఇళ్లు 33 లక్షల ఇందిరమ్మ ఇళ్లతో సమానమని వివరించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న హౌజింగ్ ఖర్చు కంటే తెలంగాణలో వెచ్చిస్తున్న ఖర్చుని వివరిస్తూ, ఒక్కో ఇంటికి రూ.8.75 లక్షలు వెచ్చించి నిర్మించగా, దీన్ని విలువ ఓపెన్ మార్కెట్‌లో సుమారు రూ.30 లక్షలు ఉంటుందన్నారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని సాహసం తెలంగాణ చేసిందంటూ డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రస్తావించారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా ద్వారా నీటిని సరఫరా చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలన్న సీఎం ఆకాంక్ష మేరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగునీటి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, తెరాస పాలన స్వర్ణయగమని అభివర్ణించారు. ఇంటింటికీ నల్లాలతో నీళ్లొస్తే తమకు రాజకీయంగా పుట్టగతులుండవని భావించిన కొందరు నేతలు కేసులు వేస్తున్నారని, అలాంటి వారిని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. గత పాలకుల వైఫల్యాలను ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని గుర్తుచేశారు. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్, హౌజింగ్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, అదనపు కమిషనర్ భారతి హోళికేరి తదితరులు పాల్గొన్నారు.
కళ్లులేని విపక్షాలు: నాయిని
విపక్షాలు కళ్లులేని కబోదులని, తెరాస ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని గుర్తించక అనవసరవిమర్శలు గుప్పిస్తున్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు. సింగం చెరువు తాండాలో మరో 176 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి, ప్రభుత్వం హైదరాబాద్‌లో మరో చరిత్ర సృష్టించిందన్నారు. రాష్ట్భ్రావృద్ధికి సీఎం కేసీఆర్ ఆహర్నిశలూ కృషి చేస్తున్నారని, ఐటీ శాఖలో కేటీఆర్ విప్లవాత్మక మార్పులు, నిర్ణయాలతో చరిత్ర సృష్టిస్తున్నారని కితాబునిచ్చారు. విద్యుత్‌పై సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న తెరాస సర్కారు, ఎవరూ ఊహించని విధంగా జనవరి నుంచి రైతులకు 24 గంటలు విద్యుత్‌నిస్తూ, రెండు పంటలకు రూ. 8వేలు పెట్టబడి అందిస్తోందన్నారు. ఇవన్నీ చూడలేని విపక్షాలు మాత్రం అర్థరహిత విమర్శలు చేస్తున్నాయని మంత్రి నాయని ధ్వజమెత్తారు.

చిత్రం..నగర పర్యటనలో భాగంగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి కేటీఆర్