రాష్ట్రీయం

పసుపు పోరుకు నేను సైతం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 10: రైతు శ్రేయస్సు దృష్ట్యా పసుపు బోర్డు ఏర్పాటు ఉద్యమానికి తనవంతు అడుగులేస్తానని యోగా గురు రామ్‌దేవ్ బాబు వెల్లడించారు. పసుపు రైతులను ఆదుకునేందుకు గడిచిన నాలుగేళ్లుగా ఎంపీ కవిత అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. పసుపు బోర్డు సాధన కోసం ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయికి చేర్చాలని, ఆ ఉద్యమానికి తాను మద్దతుగా నిలుస్తానన్నారు. ఇప్పటికే పసుపు బోర్డు ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశానని గుర్తు చేశారు. పసుపు దిగుమతులను నిలిపివేసి, ఎగుమతులను
ప్రోత్సహించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని కేంద్రానికి రామ్‌దేవ్ సూచించారు. రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ సీఎం కే.చంద్రశేఖర్‌రావు విశేషంగా కృషి చేస్తున్నారని ప్రముఖ యోగా గురువు రాందేవ్‌బాబా ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా స్పందించిన రాందేవ్‌బాబా, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారిగా నిజామాబాద్‌కు హాజరైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను తెలుసుకున్నారు. ప్రత్యేకించి రైతాంగ శ్రేయస్సు కోసం కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని, దేశంలోనే మరే ఇతర రాష్ట్రాల్లో ఈ తరహా కృషి చేస్తున్న సీఎంలను తాను చూడలేదన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన యోగా శిబిరంలో పాల్గొనేందుకు హాజరైన సందర్భంగా మంగళవారం ఎంపీ కవిత క్యాంపు కార్యాలయంలో రాందేవ్‌బాబా ఆమెతో పాటు మంత్రి హరీశ్‌రావు, ఇతర ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. నిజామాబాద్ జిల్లాలో పతంజలి పరిశ్రమల ఏర్పాటు విషయమై చర్చించారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో రాందేవ్‌బాబా మాట్లాడుతూ తెలంగాణకు వచ్చినందుకే సీఎం కేసీఆర్‌ను పొగడడం లేదని, భారతదేశం ఆత్మ అయిన రైతన్నకు ప్రయోజనం చేకూర్చేలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తుండడం నిజంగానే ఎంతో ప్రశంసనీయమని అన్నారు. తాను ఎంతోమంది సీఎంలను కలిశానని, పొరుగునేవున్న ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా తనకు మంచి స్నేహభావం ఉందని, అయినప్పటికీ దేశంలోనే మరే ఇతర సీఎంలు చేయని తరహాలో తెలంగాణ సీఎం కేసీఆర్ రైతాంగ శ్రేయస్సుకు పాటుపడుతున్నారని నిస్సందేహంగా చెప్పగల్గుతున్నానన్నారు. అనేక మంది వేదికలపై రైతులను ఆదుకుంటామని గొప్పగా ప్రకటనలు చేయడం మినహా, అన్నదాత ఆవేదనను అర్ధం చేసుకుని వారిని ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తెరాస, తన లక్ష్యాన్ని సాధించుకుని ఎంతో నిబద్ధతతో ముందుకు సాగుతోందని, తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం తన సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు కూడా చక్కటి క్రమశిక్షణను నేర్పించారని, కీలక పదవుల్లో కొనసాగుతున్నప్పటికీ ఎంపీ కవిత, మంత్రి హరీశ్‌రావులు అహంభావాన్ని దరి చేర్చుకోకుండా అణుకువతో మెలగడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటును అందిస్తే నిజామాబాద్ జిల్లాలో తమ సంస్థ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. స్థానికంగా సాగయ్యే పసుపు, మొక్కజొన్న, శనగ తదితర పంటలు పండించే రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని, వారికి మద్దతు ధర అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పతంజలి సంస్థ లాభార్జనతో కాకుండా రైతుల హితం కోసమే పని చేస్తోందని, అన్నదాతను ఆదుకునే విషయంలో తాము ముందంజలో నిలుస్తామన్నారు. యోగా శిబిరంలో భాగంగా వేదికపై రాందేవ్‌బాబాతో కలిసి ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి తదితరులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, పతంజలి యూనిట్ స్థాపన కోసం ప్రభుత్వంతో మాట్లాడి, సాధ్యమైనంత మేరకు తోడ్పాటును అందించే ప్రయత్నం చేస్తామని అన్నారు. విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్‌గుప్తా, జీవన్‌రెడ్డి, మేయర్ ఆకుల సుజాత, రెడ్‌కో చైర్మన్ అలీం తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవితలతో కలిసి
మీడియాతో మాట్లాడుతున్న యోగా గురు రాందేవ్‌బాబా