రాష్ట్రీయం

మళ్లీ మొదటికొచ్చిన అగ్రిగోల్డ్ సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 13: అగ్రిగోల్డ్ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఆస్తులకంటే అప్పులు ఎక్కువగా ఉండటంతో ఈ సంస్థను స్వాధీనం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని భావిస్తున్నారు. అగ్రిగోల్డ్‌ను స్వాధీనం చేసుకోవడానికి జీఎస్‌ఎల్ సంస్థ వెనుకంజ వేస్తోందన్న ప్రచారం బాధితులను ఒక్కసారిగా కుంగదీసింది. ఇన్నాళ్లూ ఉన్న కాస్త ఆశ చచ్చిపోవడంతో కొంత మంది బాధితులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మిగతా బాధితులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బాధితులంతా తమ ఆందోళనను తీవ్రం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన రూ. 3,965 కోట్లను ప్రభుత్వం వెంటనే అడ్వాన్స్‌గా అందించాలని ఏపీ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. సంస్థ ఆస్తుల విక్రయం విషయంలో విపరీతమైన తాత్సారం జరుగుతుండటం, కుటుంబ సమస్యలు, వేధింపులు వంటి కారణాల వల్ల ఆత్మస్థైర్యం దెబ్బతిని బాధితులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ ఆస్తులను జీఎస్‌ఎల్ సంస్థ టేకోవర్ చేసుకోదన్న విషయం తెలిసి శ్రీకాకుళం జిల్లాలో కోటేశ్వరరావు అనే బాధితుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటనను గుర్తుచేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. నగరంలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ముప్పాళ్ల మాట్లాడుతూ ఖాతాదారులు, ఏజెంట్లలో ఎవరి గుండెతలుపు తట్టినా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ, అనారోగ్య సమస్యలే కనిపిస్తున్నాయన్నారు. బాధితులకు అసోసియేషన్ అండగా ఉంటుందని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రెండు, మూడునెలల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సగం డబ్బయినా సరే అడ్వాన్సుగా ఇప్పిస్తామని, మిగిలిన మొత్తాలను పోస్ట్‌డేటెడ్ చెక్కులు, బాండ్ల రూపంలో సాధిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబును శనివారం కలిసేందుకు ఆయన పర్సనల్ సెక్రటరీని అపాయింట్‌మెంట్ కోరామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సీఎంతో భేటీ అయి ప్రధానంగా ఐదు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేస్తామన్నారు. అడ్వాన్స్‌తో పాటు ఈ నెల 25న కోర్టులో దాఖలు చేసే అఫిడవిట్‌లో సంస్థ ఆస్తులను బహిరంగ వేలం వేసే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఇవ్వాలని కోరాలన్నారు. ఆస్తుల విక్రయానంతరం ప్రభుత్వం అడ్వాన్స్‌గా ఇచ్చిన సొమ్మును జమ చేసుకుని మిగిలిన మొత్తాన్ని వడ్డీ, కంపెనీ ఆయా స్కీమ్‌లలో ఇచ్చిన వాగ్దానాల మేరకు బాధితులకు చెల్లించాలన్నారు. సంస్థ అధినేత అవ్వా సీతారామారావుతో పాటు అరెస్టయి ప్రస్తుతం బయట తిరుగుతున్న డైరెక్టర్లు అందర్నీ అరెస్ట్ చేయాలన్నారు. వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. జిల్లాకు ఒక కౌంటర్ ఏర్పాటు చేసి మిగిలిన బాండ్లను పరిశీలించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించినట్లు చెప్పారు. 17న అన్ని మండల కేంద్రాల్లో తహశీల్దార్లకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. 23న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. మూడేళ్లుగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం చేపట్టినా శాంతియుతంగానే చేస్తున్నామని, విధిలేని పరిస్థితుల్లో తప్పనిసరిగా ఉద్యమం మరోరూపం తీసుకుంటుందన్నారు. అగ్రిగోల్డ్ మోసానికి నష్టపోయిన 20 లక్షల కుటుంబాలకు మేలు చేసేలా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో మే మొదటి వారంలో ‘చలో సచివాలయం’ కార్యక్రమం చేపడతామని ముప్పాళ్ల వివరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు బి విశ్వనాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేసే విషయంలో అన్ని రాజకీయ పార్టీలు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. విలేఖరుల సమావేశంలో కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈవీ నాయుడు, ఉప ప్రధాన కార్యదర్శి బీవీ చంద్రశేఖర్, మహిళా కార్యదర్శి నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.