రాష్ట్రీయం

వేగవంతం.. పోలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 15: అఖండ గోదావరి ఎడమ గట్టు వైపు దేవీపట్నం మండలం అంగుళూరు వద్ద పోలవరం పవర్‌హౌస్ మట్టి పనులు ఊపందుకున్నాయి. మట్టి పనులు ఇదే వేగంతో దాదాపు రెండు నెలల్లో పూర్తి చేసి జూన్ నెలాఖరుకల్లా కాంక్రీటు పని చేపట్టాలనే లక్ష్యంతో కార్యాచరణ చేపట్టారు. ఇటీవల కాలంలో ఏపీ జెన్కో ఎండి విజయానంద్ పనులను క్షేత్ర స్థాయిలో సమీక్షించారు. పవర్‌హౌస్ మట్టి పనులు మాత్రమే పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్సు ప్యాకేజీలో జరుగుతున్నాయి. మిగిలిన పవర్‌హౌస్ నిర్మాణమంతా ఏపీ జెన్కో మాత్రమే నిర్మిస్తుంది. ఈ మేరకు ఏపీ జెన్కో పవర్‌హౌస్ నిర్మాణాన్ని నవయుగ సంస్థ చేపట్టింది. ట్రాన్స్‌స్ట్రాయ్ నుంచి పనులు నవయుగ చేతికి వచ్చిన తర్వాత పనులన్నీ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మట్టి పని కూడా నవయుగ సంస్థ చేపట్టింది. పవర్‌హౌస్ మట్టి పని త్రివేణి సంస్థ సబ్ కాంట్రాక్టుగా చేపట్టింది. రెండు నెలల్లో మట్టి పని పూర్తయిన వెంటనే కాంక్రీటు పనులు చేపట్టేందుకు కార్యాచరణ చేపట్టారు. మొత్తం ప్రాజెక్టును వాస్తవానికి 58 నెలల్లో పూర్తి చేయాలనేది టెండరు నిబంధన కాగా 52 నెలల్లోనే పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణంలో విశేష అనుభవం కలిగిన జియాటెక్ సంస్థ జాయింట్ వెంచర్‌గా నవయుగ సంస్థ ఏపీ జెన్కో ఆధ్వర్యంలో పవర్‌హౌస్ నిర్మాణం చేపట్టనుంది. పోలవరం పవర్‌హౌస్ వద్ద అప్రోచ్ ఛానెల్, ట్రయిల్‌రేస్ ఛానల్‌ను హెడ్‌వర్క్సు కాంపొనెంట్‌లోనే నిర్మిస్తారు. ఒక దాని తర్వాత ఒకటిగా ఏపీ జెన్కో 12 టర్బైన్లు నిర్మించనుంది. స్పిల్ వే నుంచి రిజర్వాయర్ ద్వారా నీరంతా పవర్‌హౌస్ వైపునకు వస్తుంది. అక్కడ విద్యుత్తు ఉత్పత్తి తర్వాత నీటిని బ్యారేజి వైపు విడిచిపెడతారు. ఈ క్రమంలో విద్యుత్తు ఉత్పత్తి తరువాత విడుదలయ్యే జలాలన్నీ బ్యారేజీకి చేరుతాయి. దీంతో బ్యారేజి వద్ద నిరంతరంగా జలాలు ఉంటాయి. పోలవరం పవర్‌హౌస్ మట్టి పనులు జల వనరుల శాఖ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు ప్యాకేజీలోనే ఉన్నాయి. పవర్‌హౌస్ వల్లే గోదావరి డెల్టాలకు స్థిరీకరణ లభిస్తుంది. ప్రస్తుతం రబీలో సీలేరు జలాలపై ఆధారపడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నిరంతరం నదిలో పుష్కలంగా
జలాలు ఉంటాయి. పోలవరం పవర్‌హౌస్ నుంచి విద్యుత్ ఉత్పత్తి తర్వాత జలాలను బ్యారేజీ నుంచి ఎపుడు కావాల్సి వస్తే అపుడు వినియోగించుకునే విధంగా అవకాశం లభిస్తుంది. పోలవరం డ్యామ్ పూర్తయ్యేసరికి పవర్‌హౌస్ పూర్తయ్యే విధంగా కార్యాచరణ చేపట్టారు.
పోలవరం పవర్‌హౌస్‌ను రూ.5వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. వాస్తవానికి రూ. 3200 కోట్లకే పవర్‌హౌస్ హెడ్ వర్క్సుకు టెండర్లు ఖరారయ్యాయి. మిగిలిన జిఎస్టీ, వివిధ రకాల టాక్సులు, అప్పులకు వడ్డీ తదితరాలను కలుపుకుని మొత్తం ప్యాకేజీ ఏపీ జెన్కో రూ.5 వేల కోట్ల అంచనాతో చేపట్టింది. మెగా వాట్ విద్యుత్ తయారీకి సుమారు రూ.5 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేసి ఈ ప్రాజెక్టు చేపట్టారు. మొత్తం 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి 12 టర్బైన్లు నిర్మాణం చేపడుతున్నారు. అతి తక్కువ ధరకు విద్యుత్ లభించే ప్రాజెక్టుగా భారతదేశంలోనే ప్రతిష్టాత్మక విద్యుత్ ప్రాజెక్టుగా పోలవరం పవర్‌హౌస్ రూపొందనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ జెన్కో నిధులను రుణం ద్వారా సమకూర్చుకుంటోంది. ఇందుకు సంబంధించి పనులన్నీ పూర్తయ్యాయి. జెన్కో నిర్మాణ వ్యయాన్ని ఏడాది కాలంలోనే తిరిగి తీర్చేసే విధంగా ప్రాజెక్టు రూపకల్పన చేసుకుంది. ఏడాది కాలంలోనే పెట్టిన పెట్టుబడి రానుంది.
ఇదిలా ఉండగా పోలవరం పవర్‌హౌస్ నిర్మాణ ప్రాంతమంతా భారీ స్థాయిలో విస్తరించనుంది. అన్ని విభాగాలకు సంబంధించి దాదాపు 1200 మంది వరకు అధికారికంగానూ, అనధికారికంగా ఉద్యోగులు ఉంటారు. వీరందరికీ పెద్ద ఎత్తున క్వార్టర్లను నిర్మించేందుకు స్థల పరిశీలన చేశారు. పురుష్తోత్తపట్నం గ్రామం పరిధిలో తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ ఎదురుగా వున్న ప్రాంతంలో ఏపీ జెన్కో పోలవరం పవర్‌హౌస్ క్వార్టర్లను నిర్మించనున్నారు. మొత్తం మీద పోలవరం పవర్‌హౌస్ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి.

చిత్రం..అంగుళూరు వద్ద సాగుతున్న పోలవరం పవర్‌హౌస్ పనులు