రాష్ట్రీయం

ఉద్యమం ఉద్ధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 15: ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ‘ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి’ ఆధ్వర్యంలో ఆరోసారిగా సోమవారం రాష్ట్ర బంద్ జరగబోతోంది. సమితి ఆధ్వర్యంలో తొలిసారిగా 2015 ఆగస్టు 11న రాష్ట్ర బంద్ జరిగింది. ఆ తరువాత అనేక సందర్భాల్లో బంద్‌లతో పాటు జాతీయ రహదారి దిగ్బంధం, రైల్‌రోకో వంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఇచ్చిన బంద్ పిలుపునకు వామపక్షాలతో పాటు వైకాపా, కాంగ్రెస్, జనసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. బంద్‌ను విజయవంతం చేయాలంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి వేర్వేరుగా తమ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న జగన్ సోమవారం తన యాత్రకు విరామం ప్రకటించారు. ఆరోజు ముత్యాలంపాడు పాదయాత్ర శిబిరంలోనే జగన్ బస చేస్తారని, తిరిగి మంగళవారం ఉదయం యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఆదివారం రాత్రి జగన్ తన
అనుయాయులతో సమావేశమై బంద్ విజయవంతానికి వ్యూహరచన చేశారు. ఆర్టీసీ యాజమాన్యం ముందు జాగ్రత్తగా సోమవారం ఉదయం సుదూర ప్రాంతాలకు బయల్దేరే బస్సు సర్వీసులన్నింటినీ ముందుగానే నిలిపివేసింది. బంద్ పరిస్థితిని బట్టి మధ్యాహ్నం నుంచి బస్సుల రాకపోకలను పునరుద్ధరించేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. నగరంలో పోలీస్ బందోబస్తుతో సాధ్యమైనంత మేర సిటీ బస్సులను నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బంద్‌ను వ్యతిరేకించనప్పటికీ బాహాటంగా మద్దతు మాత్రం ఇవ్వటం లేదు. ప్రత్యేక హోదా కోసం ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా నిరసన దీక్ష చేపట్టబోతున్నారు. ఆయన చేపట్టే దీక్షకు ఇప్పటి నుంచే ఆ పార్టీ నేతలు విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. ఆరోసారిగా జరుగుతున్న రాష్ట్ర బంద్‌ను చూసైనా రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా కోసం కృషిచేయాలని, లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో బీజేపీకి గతంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందంటూ సాధన సమితి నేతలు హెచ్చరిస్తున్నారు. బంద్‌లో విద్యార్థులు, యువజనులు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నారు. రాష్ట్ర బంద్‌కు ఐజేయు ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయుడబ్ల్యుజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవీ సుబ్బారావు మద్దతు తెలిపారు. బంద్‌లో జర్నలిస్టులంతా పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు. అలాగే ఇతర జర్నలిస్టు సంఘాలు కూడా బంద్‌కు మద్దతు తెలిపాయి. బంద్‌కు సంఘీభావంగా న్యాయవాదులు జిల్లా అంతటా విధుల బహిష్కరణకు ముందుకొచ్చారు. ఆయా న్యాయవాద సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు తెలియచేయనున్నారు. వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు బంద్ నుండి మినహాయింపు ఇవ్వాలని ప్రైవేట్ విద్యాసంస్థలు సాధన సమితిని కోరాయి. దీంతో విద్యాసంస్థల బంద్ ఏమేర ఉంటుందనేది చూడాల్సి ఉంది. ప్రభుత్వం మాత్రం బంద్‌ను దృష్టిలో పెట్టుకుని సోమవారం జరగాల్సిన పరీక్షను మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. దీన్నిబట్టి చూస్తే విద్యాసంస్థలు కూడా బంద్ చేసే అవకాశం కనిపిస్తోంది. విద్యాశాఖ మాత్రం ఎలాంటి ముందస్తు సెలవు ప్రకటించలేదు.