ఆంధ్రప్రదేశ్‌

కేంద్రం మెడలు వంచైనా రాష్ట్రానికి న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 2: కేంద్రం మెడలు వంచైనా రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూస్తాం.. అది ఎన్నికలలోపు కావచ్చు.. లేదా తరువాత కావచ్చు..ఎప్పుడైనా ఈ పోరాటం ఆగదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ ప్రారంభం సందర్భంగా ఉండవల్లి ప్రజావేదికలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నిరుద్యోగ లబ్ధిదారులతో మంగళవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా- ప్యాకేజీ విషయంలో నెలకొన్న సందిగ్ధతపై స్పష్టత ఇవ్వాలని ఓ యువకుడు కోరాడు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ మనది హేతు బద్ధతలేని విభజన.. రాజధానిలేదు.. విద్యాసంస్థలు లేవు..ఆస్తులు, అప్పుల పంపకాల్లో అసమానతలు చూపారు.. 52 శాతం జనాభా ఉన్న మన రాష్ట్రానికి 42 శాతం ఆస్తులు కేటాయించారు.. అప్పులు మాత్రం 58 శాతానికి పెంచారని వివరించారు. ప్రజలంతా నిరాశ, నిస్పృహలతో ఉన్న నేపథ్యంలో నన్ను నమ్మి అధికారం కట్టబెట్టారు.. అన్యాయం జరిగిన రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకోకుండా నవనిర్మాణ దీక్ష చేపట్టామని గుర్తుచేశారు. విభజన చట్టం అంశాలు, హామీల అమలుకు నాలుగేళ్లుగా కేంద్రం నమ్మించి మోసగించిందని ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇవ్వకుండా వంచన చేసిందని ధ్వజమెత్తారు. కేంద్రం చేసిన మోసానికి నిరసనగానే ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై అవిశ్వాసం ప్రకటించిందని తెలిపారు. అయినా మన కష్టంతో రెండంకెల వృద్ధిరేటు సాధించ గలిగామన్నారు. విజయానికి మూడు సూత్రాలు చెప్పారు. ప్రజల సహకారం, సాంకేతిక పరిజ్ఞానం, అధికారులత సమర్ధతతో ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని వివరించారు. ఇదొక అద్భుతాల సమయం.. నాలుగో పారిశ్రామిక విప్లవ దశలో ఉన్నాం.. ఐవోటీ- ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ మేలి కలయికే నాలుగో పారిశ్రామిక విప్లవంగా అభివర్ణించారు. భూగర్భజలాలు.. కాలుష్యం వివరాలు, వీధి దీపాలు.. అన్నీ రియల్‌టైమ్‌లో పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు యువజనం సహకారం అందించాలని కోరారు.
ఇతర రాష్ట్రాల్లో నిలిపివేసినట్లుగా మన రాష్ట్రంలో కూడా నిరుద్యోగ భృతిని నిలిపివేస్తారా.. ఇది ఎన్నికల కోసమా.. అని లబ్ధిదారుడు ఒకరు ప్రశ్నించగా ముఖ్యమంత్రి స్పందిస్తూ ఇతర రాష్ట్రాలు మధ్యలో నిలిపివేయటానికి కారణం ఫ్రేమ్‌వర్క్‌లో లోపమని, మన రాష్ట్రంలో అలాంటి ప్రమాదం లేదన్నారు. పూర్తి సాంకేతికత, బయోమెట్రిక్‌తో అమలు చేస్తామని చెప్పారు. ఇది ఎన్నికల కోసం కాదని, నిరుద్యోగులను ఆదుకోవాలనే సంకల్పమన్నారు. ఏదోలే అనుకుని ఇంట్లో కూర్చుంటే కాదు.. ప్రభుత్వపరంగా నీరిస్తాం.. భూములిస్తాం.. అవసరమైన వసతులు కల్పిస్తాం.. పరిశ్రమలకు అవసరమైన అనుమతులు మంజూరు చేస్తాం.. మీరు కూడా నైపుణ్యత పెంపొందించుకుని కష్టపడి పనిచేయాలి.. అప్పుడే గుర్తింపు వస్తుందని హితవు పలికారు. మీ భవిత..్భద్రత.. భవిష్యత్ నిర్మించుకునేందుకు ఇదో అవకాశం అన్నారు.

జీవనయోగ్య నగరంగా అమరావతి
నిరుద్యోగులు ఉపాధి కోసం హైదరాబాద్‌ను ఆశ్రయిస్తున్నారు.. ఈ పరిస్థితుల్లో అమరావతిని ఏ రకంగా మారుస్తారని ఓ యువతి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి స్పందిస్తూ హైదరాబాద్‌లో ఎకో సిస్టంను సృష్టించటం వల్ల నాలెడ్జి ఎకానమీకి దోహదపడింది.. అదే అక్కడ ప్రధాన ఆదాయ వనరుగా మారింది.. అమరావతిని అంతకుమించిన జీవనయోగ్య నగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. తిరుపతి, విశాఖ, విజయవాడ జీవన నగరాలుగా ఉన్నాయి.. చెన్నై నుంచి తిరుపతి వరకు ఐటీని అభివృద్ధి చేస్తామన్నారు. విదేశీ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టి స్థానికేతరులకు ఉపాధి కల్పిస్తున్నాయని, ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ప్రోత్సాహాన్ని అందించటం ద్వారా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని లబ్ధిదారులు చేసిన వాదనలు సరైనవి కావన్నారు. ప్రపంచం మొత్తంగా ఉన్నత విద్యకు అవకాశాలు ఏం ఉన్నాయో పరిశీలన జరిపి జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి అందుబాటులోకి తెస్తున్నామని, ఇంకా విదేశీ ఉన్నత విద్యకు రూ 15 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా భవిష్యత్తుకు బాట వేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం 20వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిందని అత్యంత పారదర్శకంగా నియామకాలు జరుపుతామన్నారు. రూపాయి అవినీతి జరిగినా తమకు తెలియజేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఇక్కడ స్థాపితమయ్యే ప్రైవేటు పరిశ్రమల్లో నూటికి 90 శాతం స్థానికులకు అవకాశాలు ఇస్తున్నారని, ఉల్లంఘించిన సంస్థల వివరాలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

అవినీతికి తావులేదు
ఈ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు ముడుపులు చెల్లించనిదే రావని, ఎన్నికలలోపు నియామకాలను భర్తీచేస్తారా అని యువనేస్తం లబ్ధిదారులడిగిన ప్రశ్నలపై ముఖ్యమంత్రి స్పందిస్తూ బాగా చదువుకున్న వారికి అన్యాయం జరగదన్నారు. గత 20 ఏళ్ల క్రితం నేను నాటిన మొక్క ఈ రోజు ప్రపంచమంతా విస్తరించిందని చెప్పారు. అప్పట్లో విద్యనభ్యసించిన ఇంజనీరింగ్ విద్యార్థులు ఇప్పటి ఐటీ రంగాన్ని శాసిస్తున్నారని, ఎక్కడచూసినా తెలుగు వారే ఐటీ నిపుణులుగా ఉన్నారన్నారు. ఉద్యోగ నియామకాల్లో అవినీతికి పాల్పడినట్లు 1100కు ఫిర్యాదుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రానికి 15 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని అవి ఏర్పాటైతే 32లక్షల మందికి ఉపాధి లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఓ లక్ష్యంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నామని అయితే కొందరు దురుద్దేశ్య పూర్వకంగా బురద జల్లుతున్నారని మండిపడ్డారు. నన్ను విమర్శించే వాళ్లకు ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్లు దోచిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కేసుల్లో ఇరుక్కుని జైలుపాలై ప్రస్తుతం రోడ్ల వెంట తిరుగుతూ ఓట్లు అడుక్కోవటంతో పాటు జప్తులో ఉన్న ఆస్తుల కోసం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రయోజనాలకు పాటుపడుతుంటే అడ్డుకుంటున్నారని ఏ రాజకీయ నాయకునికైనా సచ్ఛీలత అవసరమన్నారు. సమర్థ నాయకత్వం ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. జీవితం అంటే సినిమా కాదని అది ఏదో ఒకరిద్దరికి మాత్రమే లాభమని చెప్తూ నిజ జీవితం వేరు..సినిమా వేరనేది గ్రహించాలని పరోక్షంగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను విమర్శించారు. ఈ ప్రభుత్వంలో యువత అధైర్యపడాల్సిన అవసరంలేదని భరోసా ఇచ్చారు.